US Election 2024 : పోలింగ్ ముందు.. లాస్ట్ సర్వే.. క్లయిమాక్స్ లో దూసుకొచ్చిన ట్రంప్..!

మరికొన్ని గంటల్లో అంటే.. 2024, నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండు నెలలుగా ముందస్తుగా ఓట్లు వేస్తూ వస్తున్న అమెరికన్లు.. నవంబర్ 5వ తేదీ పోలింగ్ డే రోజు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముందు రోజు జరిగిన చిట్టచివరి సర్వేలోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కంటే 1.8 శాతం ఓట్లు అధికంగా ఆధిక్యంలో ఉన్నారు. 

అమెరికా అధ్యక్షుడిని డిసైడ్ చేసే స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ అనూహ్యంగా ముందుకు రావటం విశేషం. స్వింగ్ స్టేట్స్ లో మొన్నటి వరకు కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహించిన సర్వేల్లో మాత్రం ట్రంప్ దూసుకొచ్చారు. 

స్వింగ్స్ స్టేట్స్ లోని అరిజోనా స్టేట్ లో ట్రంప్ 51.9 శాతం మద్దతు ఉంటే.. హారిస్ కు కేవలం 45.1 శాతం మాత్రం మద్దతు ఉంది. 
మరో స్వింగ్ స్టేట్ నెవాడాలో 51.4 శాతం మంది ట్రంప్ కు సపోర్ట్ చేస్తుంటే.. 45.9 శాతం మంది హారిస్ వైపు మొగ్గుచూపుతున్నారు..
మరో స్వింగ్ స్టేట్ నార్త్ కరోలినాలో ట్రంప్ కు 50.4 శాతం మద్దతు లభిస్తే.. హారిస్ 46.8 శాతంతో వెనకబడి ఉన్నారు.
మిగతా స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, మిచిగాన్, నెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లో పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఈ రాష్ట్రాల్లో హారిస్ భారీ ఆధిక్యంలో ఉన్నా.. పోలింగ్ ముందు రోజుకు వచ్చే సరికి.. హారిస్ ఆధిక్యతను భారీ తగ్గించారు ట్రంప్. ఈ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ మధ్య తేడా లేదని.. ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందని చెబుతున్నాయి సర్వేలు. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో 2 శాతంపైనే ఆధిక్యంలో ఉన్న ట్రంప్.. మిగతా స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్ ఆధిపత్యాన్ని తగ్గించటంతో.. ట్రంప్ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

రాయిటర్స్ సర్వేలో ట్రంప్ 44 శాతంతో ముందంజలో ఉంటే.. కమలా హారిస్ 43 శాతంతో స్వల్పతేడాతో వెనకబడి ఉన్నారు. ఈ సర్వే అక్టోబర్ చివరి వారంలో జరిగింది. 
నవంబర్ 5వ తేదీ పోలింగ్ డే రోజుకు కొన్ని గంటల ముందు విడుదల అవుతున్న సర్వేల్లో.. ట్రంప్ అధ్యక్షుడు ఖాయంగా కనిపిస్తుంది..