అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్‌ ఎలన్‌ మస్క్‌.. నా గెలుపులో అతడిదే కీ రోల్: ట్రంప్

వాషింగ్టన్: స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‎పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్ షిప్‎ను తిరిగి బేబీ చేతుల్లో పెట్టినట్టు పెట్టాడని.. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది ఎలన్ మస్క్ చేసి చూపించాడని కొనియాడారు. స్టార్ లింక్ ద్వారా ప్రపంచానికి ఇంటర్నెట్ కొత్త టెక్నాలజీని పరిచయం చేశాడని పొగిడారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్‎కు నిర్వచనం ఎలన్ మస్క్ అని అభివర్ణించిన ట్రంప్.. ఎలన్ మస్క్ లాంటి జీనియస్‎లు అమెరికాకు అవసరమని.. అలాంటి వారిని కాపాడుకుంటామని పేర్కొన్నారు. అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్‌ ఎలన్‌ మస్క్‌ అని పొగిడిన ట్రంప్.. నా విజయంలో ఎలన్‌ మస్క్‌దే కీలక పాత్ర అని చెప్పారు. 

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు కావాల్సిన 270 ఎలక్టోరల్ సీట్ల మ్యాజిక్ ఫిగర్‎ను ట్రంప్ రీచ్ అయ్యారు. దీంతో ట్రంప్ విజయం ఖరార్ అయ్యింది. రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందటంతో 2024, నవంబర్ 6 బుధవారం ఫ్లోరిడాలో  ట్రంప్ జాతినుద్దేశించి ప్రసగించారు. 

ఈ సందర్భంగానే మస్క్‎ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాలో కీలకమైన స్వింగ్‌ స్టేట్లలో విజయంపై ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని.. మరోసారి వారి కోసం కోసం పనిచేస్తానని అన్నారు. అమెరికా ప్రజలు పవర్‌ఫుల్‌ తీర్పు ఇచ్చారని.. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు తన ప్రాణాలను కాపాడాడని అన్నారు.

ఘన విజయం అందించిన అమెరికన్లకు ఈ సందర్భంగా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఇది అమెరికన్లు సాధించిన గొప్ప విజయమని అన్నారు. ఆర్ధికంగా అమెరికా తిరిగి కోలుకునేందుకు ఈ విజయం దోహదం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మస్క్ బహిరంగా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మద్దతు ప్రకటించడమే కాకుండా ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం సైతం చేశారు.