గొర్రెల మందపై కుక్కల దాడి

  • మానేరు డ్యామ్‌‌‌‌‌‌‌‌లో దూకిన జీవాలు 
  • 30 గల్లంతు 
  • 70 గొర్రెలను కాపాడిన మత్స్యకారులు

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం మానేరు పరివాహక ప్రాంతంలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో అవి నీళ్లలో దూకాయి. దీంతో 30 గొర్రెలు గల్లంతయ్యాయి. మైలారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మర్రి తిరుపతి, పేరం ముత్తయ్య, మడికంటి అశోక్  గురువారం గొర్రెలను మేత కోసం మానేరు డ్యాం పరిసర ప్రాంతానికి తోలుకుపోయారు.

మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొర్రెల కాపరులు భోజనం చేస్తుండగా కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దీంతో అవి భయపడి నీళ్లలో దూకాయి. సుమారు 30 గొర్రెలు గల్లంతు కాగా, మరో 70 గొర్రెలను జాలర్ల సాయంతో రక్షించినట్లు బాధితులు తెలిపారు.  గొర్రెలకాపరులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.