- ఎన్సీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడంపై అమిత్ షా ఫైర్
న్యూఢిల్లీ: అధికారం కావాలన్న దురాశతో దేశ ఐక్యత, భద్రతను పణంగా పట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. వచ్చే నెలలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)తో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్‌కు ఆయన శుక్రవారం ‘ఎక్స్’ లో ప్రశ్నలు సంధించారు.
జమ్మూకాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే సపరేట్ ఫ్లాగ్ ఎగురవేస్తామని హామీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆర్టికల్ 370, 35ఏని తిరిగి తీసుకొస్తామని ఎన్సీ చెప్పింది.. దానికి మద్దతు ఇస్తారా..? పాక్‌తో మాట్లాడి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా? పాక్‌తో వాణిజ్యం(ఎల్‌ఓసీ దాటి) ప్రారంభించాలని ఎన్సీ తీసుకున్న నిర్ణయం వల్ల సరిహద్దులో టెర్రరిజాన్ని పెరగడానికి కాంగ్రెస్, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నట్లా..? రాళ్ల దాడికి పాల్పడే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పదవుల్లో తిరిగి చేర్చుకోవడం ద్వారా లోయలో మళ్లీ టెర్రరిజాన్ని, షట్‌డౌన్ల శకాన్ని తిరిగి తీసుకురావడాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందా..? అని అమిత్ షా ప్రశ్నించారు.