ఆకలేసినప్పుడల్లా జుట్టే ఆహారం.. పొట్టలో క్రికెట్ బంతి తయారయ్యింది

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల బాలిక కడుపులో క్రికెట్‌ బంతి పరిమాణంలో ఉన్న జుట్టును వైద్యులు విజయవంతంగా తొలగించారు. బాధిత బాలిక 'ట్రైకోఫాగియా' అనే వింత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి ఉన్న వారికి జుట్టు తినే అలవాటు ఉంటుందని.. దానిని 'రాపన్‌జెల్ సిండ్రోమ్‌'గా పిలుస్తారని పేర్కొన్నారు. 

బాధితురాలికి గత రెండేళ్లుగా అతనికి ఆకలి లేకపోవడం, తరచూ వాంతులు చేసుకోవడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. దాంతో, ఈ ఘటన వెలుగు చూసింది. గతంలోనూ పలు ఆస్పత్రులకు తిప్పినట్లు బాలిక తల్లిదండ్రులు వెల్లడించారు. వారు సమస్యను గుర్తించకపోగా.. గ్యాస్ట్రిటిస్‌గా చికిత్స అందించినట్లు తెలిపారు. చివరకు నగరంలోని ఆస్టర్స్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు ఆమెకు ట్రైకోబెజోర్ అని నిర్ధారించారు. ఎక్కువగా ఈ సమస్య పెద్దవారిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే 8 ఏళ్ల బాలికలో ఇలాంటి సమస్య కనిపించడం అరుదైన ఘటనని వైద్యులు తెలిపారు. 

రెండున్నర గంటలు శ్రమించి.. 

బాలికకు లాపరోటమీ అని కూడా పిలువబడే ఓపెన్ అబ్డామినల్ సర్జరీ చేయాల్సి వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. హెయిర్‌ బాల్‌ పెద్దగా, జిగటగా ఉన్నందున ఎండోస్కోపీ చేసేందుకు కష్టమైందని తెలిపారు. మొత్తం రెండున్నర గంటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. సర్జరీ అనంతరం బాలికకు ప్రత్యేకంగా ఆహారంతో పాటు కౌన్సెలింగ్‌ సైతం ఇస్తున్నట్లు వైద్యులు వివరించారు.