- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు
- ఎమర్జెన్సీ మినహా సేవలు బంద్
- న్యాయం చేయాలని డిమాండ్
- డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు
- ట్రెయినీ డాక్టర్ బాడీలో ఎముకలు విరగలేదన్న పోలీసులు
న్యూఢిల్లీ: కోల్‌కతా జూనియర్ డాక్టర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని వైద్యులు శనివారం నిరసనకు దిగారు. ఉదయం ఆరు గంటలకే డాక్టర్లతో పాటు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి 24 గంటల దీక్షలో కూర్చున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపు మేరకు అత్యవసర సేవలు మినహా ఓపీడీ, నాన్ ఎమర్జెన్సీ సర్వీసులన్నీ నిలిపివేశారు.
దీంతో పలుచోట్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని గురుతేజ్ బహుదుర్, రామ్మనోహర్ లోహియా, డీడీయూతో పాటు ఎయిమ్స్‌లోనూ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆర్జీ కర్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని ఉరి తీయాలని, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, అస్సాం, తమిళనాడు, ఏపీ, బెంగాల్, కర్నాటకతో పాటు అన్ని రాష్ట్రాల్లో డాక్టర్లు, సిబ్బంది నిరసన ర్యాలీలు చేపట్టారు.
కాగా, ఈ దీక్షకు విదేశాల్లో కూడా మద్దతు లభించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడ నిరసన తెలిపారు. యూకేలోని కొంతమంది ఇండియన్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు వైద్యుల దీక్షకు మద్దతు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్లోనూ 2వేల మంది హెల్త్ వర్కర్లు విధులు బహిష్కరించి డాక్టర్లకు మద్దతు తెలిపారు.
కమిటీ వేస్తాం.. దీక్ష విరమించండి: కేంద్రండాక్టర్ల నిరసనపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. నిరసన దీక్ష విరమించాలని డాక్టర్లు, సిబ్బందిని కోరింది. వైద్యుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలు పునరుద్ధరించాలని కోరింది. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకావాలని కోరింది. అయినప్పటికీ.. వైద్యులు మాత్రం తమ నిరసన దీక్ష కొనసాగించారు.
నడ్డాతో డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధుల భేటీ
ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ప్రతినిధులు శనివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. వర్క్ ప్లేసుల్లో డాక్టర్లు, సిబ్బందికి కల్పించాల్సిన రక్షణ చర్యలపై తమ డిమాండ్లను వివరించారు. డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించి రక్షణ చర్యలు తీసుకుంటామని ప్రతినిధులకు జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్: పోలీసులు
ట్రెయినీ డాక్టర్ డెడ్‌బాడీలో 150 మిల్లీ గ్రాముల వీర్యం దొరికిందని వస్తున్న వార్తలో నిజంలేదంటూ కోల్‌కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ ట్విస్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అంతా ఉత్తిదే అని కొట్టిపారేశారు. మృతురాలి పేరెంట్స్ కొందరు డాక్టర్ల పేర్లు సీబీఐకి ఇచ్చారంటూ పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక పవర్ ఫుల్ పొలిటీషన్ కొడుకు ఉన్నాడని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారన్నారు. అవన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. ‘‘మేజిస్ట్రేట్ ముందు పోస్టుమార్టం జరిగింది. మొత్తం వీడియో రికార్డ్ చేశాం. శరీరంలో ఎముకలు విరగలేదు. గ్యాంగ్ రేప్ జరిగిందని కొందరు వార్తలు రాశారు. వారికి ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పుడు అసహజ మరణంగా కేసు నమోదు చేయడం సర్వసాధారణం. దీనిని తప్పుబడుతూ పోలీసులను కొందరు బద్నాం చేస్తున్నరు’’ అని వినేశ్ గోయల్ చెప్పారు.
మాజీ ప్రిన్సిపాల్‌ను విచారించిన సీబీఐ
ఆర్జీ కర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, వరుసగా రెండో రోజు శనివారం కూడా సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. కోల్‌కతా సీజీవో కాంప్లెక్స్‌లోని సీబీఐ సిటీ ఆఫీస్‌లో ఆయనను విచారిస్తున్నారు. సందీప్‌ను శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పోలీసుల బందోబస్తు మధ్య సీబీఐ ఆఫీస్‌కు తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల దాకా విచారించారు. తర్వాత శనివారం ఉదయం 10:30 గంటలకు మళ్లీ క్వశ్చనింగ్ చేశారు. ఘటన విషయం తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? ముందు ఎవరు చూశారు? మృతురాలి ఫ్యామిలీకి ఎవరు సమాచారం ఇచ్చారు? ఏమని చెప్పారు? హాస్పిటల్లో ఆమె ఎవరితోనైనా గొడవ పడిందా? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మమత రిజైన్ చేయాలి : నిర్భయ తల్లి ఆశా దేవి డిమాండ్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని నిర్భయ తల్లి ఆశా దేవి డిమాండ్ చేశారు. ‘‘ప్రజల దృష్టి మరల్చేందుకు మమతా బెనర్జీ ట్రై చేస్తున్నరు. నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతున్నది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే సీఎం నిరసన తెలపడమేంటి? మృతురాలి కుటుంబానికి న్యాయంచేసే అధికారం ఆమె చేతిలో ఉంది. దోషులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఆమెనే రాజకీయాలు చేస్తున్నది’’ అని ఆశాదేవి విమర్శించారు.