బీజేపీ ట్యాక్స్ టెర్రరిజం : కొనగాల మహేష్

పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులను నయానో భయానో లొంగదీసుకోవడానికి ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఇష్టారీతిన వాడుతున్నారు.  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఈడీ, ఐటీ వ్యవస్థలు రోజురోజుకు తమ గౌరవాన్ని కోల్పోతున్నాయి.  సోషల్ మీడియాలో ఈడీ, ఐటీ  డిపార్ట్​మెంట్ ​ఆఫీసర్ల పేరుతో  కామెడీ రీల్స్ చేసి జనాల్ని ఎంటర్​టైన్​ చేసే స్థాయికి ఆ సంస్థల  గౌరవ ప్రతిష్టలు పడిపోయాయి. దానికి ముమ్మాటికి మోదీ వైఖరే కారణం. ఈ సంస్థలను తన చెప్పుచేతల్లో ఉంచుకుని వాడటం, అలాగే ఈ సంస్థల్లో పనిచేసే  కొంతమంది మోదీ తాబేదార్లు ఈ దుస్థితికి కారణం. మోదీ చేతుల్లో కీలుబొమ్మల్లాగ మారి, ఆయన తాన అంటే తందానా అన్నట్టు రాజకీయ కక్షసాధింపు చర్యలకు కొంతమంది అధికారులు ఆయుధాల్లా ఉపయోగపడుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి దేశవ్యాప్తంగా వస్తున్న విశేష  ప్రజాస్పందనను చూసి ఓటమి భయంతో మోదీ కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కోలేక దొడ్డిదారిన ఐటీ డిపార్ట్​మెంట్​ను అడ్డుపెట్టుకొని, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మొదలైన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా కీలక సమయం. 

గత  రెండు నెలలుగా వివిధ రూపాల్లో  కాంగ్రెస్ పార్టీకి నోటీసులిస్తూ  వేధిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈక్వల్ & లెవెల్  ప్లేయింగ్  గ్రౌండ్ ఉండాలి.  అప్పుడే  దాన్ని ప్రజాస్వామ్యం అంటాం. కానీ, ఈ దేశంలో  ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.  కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేయకుండా ఖాతాలు స్తంభింపజేశారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం సమాయత్తం కాకుండా అడ్డుకోవడం,  ప్రచార సామగ్రి కొనుగోలు చేయకుండా, కనీసం కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లు ఐటీ అధికారులు తీసేసుకున్నారు.  బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ మోదీ వికృతానందాన్ని పొందుతున్నారు.

మోదీ సర్కారు ద్వంద్వ నీతి

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29(సి) ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా తమ తమ ఆదాయ, వ్యయాలను ఇన్​కమ్​ టాక్స్​ డిపార్ట్​మెంట్​కు అందజేయాల్సి ఉంటుంది. దానిని ఎలక్షన్ కమిషన్ వారి అధికారిక వెబ్​సైట్ లో  ప్రజల సౌకర్యం కోసం ఉంచడం జరుగుతోంది.  అయితే,  కాంగ్రెస్  పార్టీ 2017-–18 నుంచి 2020-–21 కాలానికి సంబంధించిన కేవలం రూ.14 లక్షల రూపాయలకు దాతలు ఎవరో పేరు, అడ్రస్ సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉండగా,  మాకు రూ.1,823.08 కోట్లు పెనాల్టీని వడ్డీతో  కలిపి  కట్టాలని ఇన్​కమ్​ టాక్స్ డిపార్ట్​మెంట్​ నోటీస్ ఇచ్చింది. 

ఇదే నిబంధన కింద, బీజేపీ 2017-–18 నుంచి 2020-–21 కాలానికి సంబంధించిన దాదాపు రూ.43 కోట్ల రూపాయలకు దాతల పేర్లు, అడ్రస్, వివరాలు వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీకి వర్తించిన ఇదే ఆదాయపన్ను చట్టాన్ని బీజేపీ వారికి వర్తింప చేస్తే,   రూ.4,617.58 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ఒకే ఆదాయపన్ను చట్టం అమల్లో ఉంది. అది బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. 

బీజేపీ కోసమో మోదీ కోసమో ప్రత్యేక ఆదాయపన్ను చట్టం లేదు. కానీ, మోదీ చెప్పు చేతల్లో పనిచేస్తున్న ఇనకమ్​ టాక్స్ డిపార్ట్​మెంట్​ అధికారులు బీజేపీ వైపు తొంగి చూడట్లేదు. ఆ పార్టీకి నోటీసులు ఇవ్వట్లేదు. వారి ఖాతాలను స్తంభింపచేయటం లేదు. తాజాగా,  2014-–15 సం. రూ.663 కోట్లు, 2015–-16 సం. రూ. 664 కోట్లు, 2016-–17 సం. రూ.417 కోట్లు మొత్తంగా రూ. 3,567 కోట్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.  ప్రధానిగా మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి?.

ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్​

దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బయటపడ్డ ఎలక్టోరల్ బాండ్ల స్కామ్​లో 8,200 కోట్ల రూపాయలు బీజేపీ సేకరించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్​ అని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ మిగతా ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిపై మాట్లాడినా ఐటీ శాఖలో చలనం లేదు. సాక్షాత్తు మన దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ భర్త, ఆర్థికవేత్త  పరకాల ప్రభాకర్ ఈ బాండ్ల స్కామ్​ ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అని ఒప్పుకున్నారు.

 “చందా దేవో - దందా లేవో” ఇదే బీజేపీ మూల సూత్రంపై  దేశంలో  పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి వారి నుంచి ఎలక్టోరల్ బాండ్ల పేరుతో  కోట్ల  రూపాయల చందాలు వసూలు చేసిన బీజేపీకి, ఆదాయ పనులు శాఖ ఎలాంటి నోటీసు ఇవ్వకపోవడం గమనార్హం. ఎంతపెద్ద అవినీతిపరులైన, నేరస్థులైన బీజేపీలో చేరగానే పునీతులౌతున్నారు. గతంలో సీబీఐ,  ప్రఫుల్ పటేల్ పై చేసిన అభియోగాలను, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో  కలిసి బీజేపీలో చేరగానే ఉపసంహరించుకుంది. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హిమంత బిశ్వాస్​శర్మ, ముకుల్ రాయ్, అశోక్ చవాన్, నారాయణ రాణె, సువేంద్ అధికారి మొదలగు నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు బీజేపీలో చేరగానే మాయమైపోయాయి. కాగా, నాడు ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించిన ఘనచరిత్ర భారతదేశానికి ఉంది.

కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే ఆలోచన

పదేండ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్  మొదలయినంక రూ. 3,567 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచన తప్ప మరేమీ కాదు.  దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీని అప్పిలేట్ ట్రిబ్యునల్,  హైకోర్టు,  సుప్రీంకోర్టు అంటూ కోర్టుల చుట్టూ తిప్పుతూ మోదీకి పరోక్షంగా ఐటీ శాఖ సహకరిస్తోంది. తెలంగాణ ప్రజ లందరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి  అత్యధిక  స్థానాలలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, మోదీ చెర  నుంచి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం.

మోదీ నిరంకుశ పాలన

ప్రధాని మోదీ నిరంకుశ పాలన, ఈడీ, ఐటీలను ఉపయోగించి ఎన్నికల సమీపిస్తున్నవేళ ప్రతిపక్షాలను ఇబ్బందులు గురిచేస్తున్న విషయం సరిహద్దులు దాటి అమెరికా దాకా పాకింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ప్రతినిధి ఆంటోనియో ‘ప్రజల హక్కులను, రాజకీయ హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని’, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఐటీ డిపార్ట్​మెంట్​  ఫ్రీజ్ చేసిన విషయమై అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నుంచి నానాటికి వేధింపులు పెరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఎన్నికలు ముగిసేవరకు నోటీసులపై తీవ్ర చర్యలకు పూనుకోమని ఐటీ శాఖ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచి ఐటీ శాఖ అధికారులు డ్రా చేసుకున్న మొత్తం రూ.135 కోట్లు తిరిగి ఇస్తారా లేదా అనేది తేలలేదు.  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీ, ఐటీ సంస్థలలో పనిచేస్తూ, వ్యవస్థ గౌరవాన్ని దిగజారుస్తున్న మోదీ అనుయాయులైన కొంతమంది అధికారుల మీద రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన విధంగా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే  తీవ్రమైన చర్యలు ఉంటాయి. 

- డాక్టర్. కొనగాల మహేష్,
 అధికార ప్రతినిధి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ

 

  • Beta
Beta feature
  • Beta
Beta feature