హెల్త్ : అరుగుదలే ఆరోగ్యం!

కొందరికి శరీరంలోని కొన్ని అవయవాల గురించి తక్కువ అవగాహన ఉంటుంది. అలాంటి అవయవాల్లో కిడ్నీ(మూత్రపిండం) ఒకటి. చాలామందికి కిడ్నీ సమస్య వచ్చిందని తెలిస్తే ఎన్నో భయాలు, అపోహలు చుట్టుముట్టేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే దీని గురించి అవేర్​నెస్ తక్కువనే చెప్పాలి. అందువల్ల ట్రీట్​మెంట్​కి దూరమై కొందరు, ఆలస్యమై కొందరు... ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

అలాంటి పరిస్థితులు రాకూడదంటే కిడ్నీ హెల్త్​ గురించి అవగాహన అవసరం. అందుకే ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్​ నెఫ్రాలజీ(ఐఎస్​ఎన్)’, ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్​ ఆఫ్​ కిడ్నీ ఫౌండేషన్స్(ఐఎఫ్​కెఎఫ్​)’ కలిసి ప్రతి ఏటా మార్చి14న ‘వరల్డ్ కిడ్నీ డే’ జరుపుతున్నాయి. ఈ సందర్భంగా కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు డాక్టర్​ రంగనాథ్​ మాటల్లో... 

శరీరంలోని అన్ని అవయవాలు యాక్టివ్​గా ఉంటేనే శారీరకం​గా హెల్దీగా ఉన్నట్టు. శరీరంలోని అన్ని అవయవాలు ఎప్పటికప్పుడు వాటి పనులు సరైన టైంకి పూర్తి చేస్తుండాలి. అప్పుడే ఆరోగ్యం​ బాగుంటుంది. అందులో భాగంగా కీలకమైన అవయవాల్లో ఒకటైన కిడ్నీ గురించి అందరికీ అవేర్​నెస్​ ఉండాలి. ఎందుకంటే కిడ్నీ సమస్య అనేది కూడా క్యాన్సర్​ లాంటిదే.

క్యాన్సర్​లానే వ్యాధి ముదిరేవరకు లక్షణాలు బయటపడవు. అందుకే దీన్ని ‘సైలంట్​ కిల్లర్’ అంటారు. కిడ్నీని ‘ఫిల్టరింగ్ ఆర్గాన్’ అంటారు. వీపు కింది భాగంలో రెండు వైపులా రెండు కిడ్నీలు ఉంటాయి. అవి ముదురు ఎరుపు రంగులో చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వాటికి అతుక్కుని ఉన్న ట్యూబ్​లాంటి నిర్మాణాలు బ్లాడర్(మూత్రాశయం)​కి కనెక్ట్​ అయి ఉంటాయి. కిడ్నీలు మొత్తం నాలుగు రకాల పనులు చేస్తాయి. అవి..  

వ్యర్థాలను వడకట్టి

రోజూ మనం తినే తిండిలో శరీరానికి పనికొచ్చే వాటిని ఉంచి, పనికిరాని టాక్సిన్స్​ని వడపోస్తాయి కిడ్నీలు. అవి మూత్రం రూపంలో బయటకుపోతాయి. మనం రోజూ తినే తిండిలో కొంత పనికొచ్చేవి, మరికొంత పనికిరాని పదార్థాలు ఉంటాయి. అలా పనికిరాని వాటిని కిడ్నీలు ఎలిమినేట్ చేస్తాయి. 

రక్తం తయారీలో... 

మన శరీరంలో బ్లడ్ తయారీకి 70 – 80 శాతం కిడ్నీ సపోర్ట్ అవసరం. కిడ్నీ నుంచి విడుదలయ్యే హార్మోన్లు బ్లడ్ తయారీలో కీలకంగా పనిచేస్తాయి. అందుకే కిడ్నీలు పాడైన వాళ్లందరిలోనూ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంటుంది. 

ఎలక్ట్రోలైట్స్, యాసిడ్స్ బ్యాలెన్స్​కు

మన శరీరంలో లవణాలు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసేది కిడ్నీలే. వేసవి కాలంలో శరీరంలోని లవణాలు మూత్రం, చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతాయి. ఈ పరిస్థితిలో కిడ్నీల పాత్రే కీలకం. ఒంట్లో లవణాల శాతం తగ్గకుండా ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. 

ఎముకల ఎదుగుదలలో...

కిడ్నీలు ఎముకల ఎదుగుదలకి సాయం చేస్తాయి. ఎముకలకు అవసరమైన క్యాల్షియం, పాస్ఫరస్​లు ఒంటికి పట్టాలంటే కిడ్నీలు బాగా పనిచేయాలి. లేకపోతే బయట నుంచి ఎంత క్యాల్షియం, పాస్ఫరస్​లు ఇచ్చినా ఎముకల్లో ఎదుగుదల ఉండదు. అందుకే ఎముకలు ఎదుగుదల బాగుండాలంటే కిడ్నీ ఫంక్షన్ సరిగా ఉండాలి. 

కిడ్నీలు పాడయ్యేది ఇందుకే!

ఇప్పుడున్న పరిస్థితుల్లో కిడ్నీలు పాడవ్వడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి డయాబెటిస్. రెండోది బీపీ. ఉదాహరణకు ఒక వంద మంది కిడ్నీ పేషెంట్లను తీసుకుంటే వాళ్లలో 40 శాతం డయాబెటిస్ వల్ల, మరో40 శాతం బీపీ వల్ల, మిగతా 20 శాతం మందికి ఇతర కారణాల వల్ల కిడ్నీలు పాడవుతుంటాయి. వాటిలో ఆటోసోమల్ డామినెంట్​ పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్​ (ఎడీపీకేడీ) ఒకటి.

ఇది వారసత్వంగా వస్తుంది. అలాగే  పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం. బరువుతగ్గడం కోసం కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ వాడటం వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఇలాంటి కేసులు నెలకు రెండుమూడు నమోదవుతున్నాయి. అలాగే నీళ్లు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్​కి గురైనప్పుడు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాకుండా మాటిమాటికి కిడ్నీల్లో రాళ్లు తయారవ్వడం, తయారైన రాళ్లు కిడ్నీ ఫంక్షన్​ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా కిడ్నీలు పాడవుతాయి. 

జీవన విధానం​లో మార్పులు

ఒకప్పుడు అరవై దాటిన వాళ్లలో మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు 40 ఏండ్లు నిండని వాళ్లలో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. అందుకు కారణం ఇప్పుడున్న జీవన విధానం​. దీనివల్లే 40 శాతం మంది యువతీయువకుల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. రాత్రిళ్లు నిద్రపోకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల పొద్దున్నే బీపీ పెరుగుతుంది. లైఫ్ స్టైల్​ వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది.

దానివల్ల కిడ్నీపై ఒత్తిడి పడుతుంది. అలాగే.. పాతికేండ్లు నిండిన వాళ్లలో బీపీ ఉండి,  మందులు వాడాల్సి వస్తే... ఒకసారి వాడడం మొదలుపెడితే జీవితకాలం వాడాలని మందులు వాడరు కొందరు. అలా వాడకుండా ఉన్నా దాదాపు మూడేండ్ల వరకు బాగానే ఉంటారు. కానీ, ఆ తర్వాత ఏడాదికి కిడ్నీలు పాడవుతాయి. ఎందుకంటే ఆ హైపర్ టెన్షన్ ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. లైఫ్​ స్టైల్​ మార్పుల వల్ల మొదట బీపీ వస్తుంది. తద్వారా కిడ్నీ ఎఫెక్ట్​ అవుతుంది. యంగ్ ఏజ్​లో వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటివే.

పరిష్కారం మన చేతుల్లోనే..

కిడ్నీలను కాపాడుకోగలిగే అవకాశం మన చేతుల్లోనే 90 శాతం ఉంది. ఎందుకంటే కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయో దాదాపు ఇక్కడ చెప్పాను. వాటి గురించి అవగాహన వచ్చింది కాబట్టి స్వతహాగా కొన్నింటికి దూరంగా ఉండగలిగితే కిడ్నీ హెల్త్​ కాపాడుకోవచ్చు. ముఖ్యంగా బీపీ, షుగర్​ రాకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఉన్నవాళ్లు వాటిని కంట్రోల్​ చేయాలి.

పెయిన్​ కిల్లర్స్, అనవసరమైన మెడిసిన్స్ తీసుకోవద్దు. ఈ జాగ్రత్తలతో పాటు.. కల్తీ ఫుడ్​ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి ఫుడ్ తిన్నా.. దాన్ని కిడ్నీ ఫిల్టర్ చేయగలగాలి. అన్​హెల్దీ ఫుడ్ వల్ల కిడ్నీ మీద భారం ఎక్కువగా పడుతుంది. వాటిని ఫిల్టర్ చేయడంలో కిడ్నీ ఫెయిల్ అవుతుంది. కొందరు హెల్దీ డైట్ తీసుకున్నా వాళ్లలో కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందంటే.. కారణం పంట పండించడానికి వాడే పెస్టిసైడ్స్. కాబట్టి రసాయనాలు వాడని కూరగాయలు వండుకుని తినాలి.

తాజా పండ్లు తినాలి. నిజానికి తిన్న ఫుడ్​ అరిగితే సగం సమస్యలు రావు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.. ‘‘ఫలానా ఫుడ్ తింటే కిడ్నీ హెల్దీగా ఉంటుంది. కిడ్నీ హెల్త్ కోసం ఫలానా పుడ్ తినండి’’ అని కొందరు చెప్తుంటారు. కిడ్నీ స్పెషలిస్ట్​గా డాక్టర్లు చెప్పేది ఏంటంటే... తేలికగా అరిగే ఫుడ్​ తినాలి. రక్తంలో ఈజీగా కలిసిపోయే పదార్థాలు ఫుడ్​లో ఉండాలి. ముఖ్యంగా పెస్టిసైడ్స్ వాడని కూరగాయలు తినాలి.

వంటకు వాడే పసుపు, కారం వంటి వాటిల్లో కల్తీ బాగా జరుగుతోంది. కాబట్టి కల్తీ లేని పదార్థాలు వాడాలి. కల్తీ లేకపోతే అవి తేలికగా జీర్ణమై, రక్తంలో కలుస్తాయి. అదే కల్తీ పదార్థాలు అయితే అరగని పదార్థాలన్నీ కిడ్నీల్లో ఫిల్టర్​ కాకుండా అక్కడే ఆగిపోయి, పేరుకుపోతాయి. కిడ్నీ అనేది జల్లెడలాగ ఉంటుంది. ఫుడ్​ని జల్లెడ పట్టిన తర్వాత వేస్ట్ అంతా మూత్రం రూపంలో బయటకు వెళ్తుంది.

వడపోతకు వీలుకాని పదార్థాలు అక్కడే ఉండిపోతాయి. కొన్ని రకాల పండ్లు మాత్రం ఇందుకు భిన్నంగా పనిచేస్తాయి. నిమ్మ, ఆరెంజ్, కమలా వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను ‘క్లెన్సింగ్ ఏజెంట్స్’ అంటారు. అంటే.. ఇవి కిడ్నీలను శుభ్రం చేయగలవు. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్లకు, యూరిన్ ఇన్​ఫెక్షన్స్ ఉన్న వాళ్లకు ఇవి ఉపయోగం. అలాంటి వాళ్లకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి కాపాడతాయి. అన్నింటికంటే ముఖ్యమైనది నీళ్లు. శరీరానికి సరిపడా నీళ్లు తాగితే.. ఒంట్లో చెత్త ఉన్నా సరే అది బయటకు కొట్టుకుపోతుంది. అలాకాకుండా హెల్దీ ఫుడ్ తింటున్నాం కదా అని నీళ్లు తక్కువగా తాగితే.. ఆ ఫుడ్​లోని టాక్సిన్స్ ఫిల్టర్ కావు. ఫిల్టర్ కావాలంటే సరిపడా నీళ్లు అవసరం. 

లక్షణాలు కనపడవు!

కిడ్నీలో ప్రాబ్లమ్ ఉన్నా 80 శాతం లక్షణాలు బయటకు కనిపించవు. ఉద్యోగాలు చేసేవాళ్లు ఏడాదికొకసారి మెడికల్ చెకప్​ చేయించుకుంటారు. అలా టెస్ట్​ చేయించుకున్నప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే స్పెషలిస్ట్​ దగ్గరకు వెళ్లమని జనరల్ ఫిజిషియన్ సజెస్ట్ చేస్తారు. క్రియాటిన్ అనేది మూడు లేదా నాలుగుకి వచ్చేవరకు ప్రాబ్లమ్ ఉందని తెలియదు. 

అందుకే కిడ్నీని ‘సైలంట్​ కిల్లర్’ అంటారు. క్యాన్సర్​ లాగే ముదిరిపోయే దాకా సమస్య బయటపడదు. కానీ, కొన్నిసార్లు.. కొన్ని లక్షణాలు చూసి పసిగట్టొచ్చు. అవి... బీపీ లేదా షుగర్ ఉన్న వాళ్లలో ఆకలి తగ్గిపోవడం, రోజంతా వాంతి వచ్చినట్టు ఉండడం, శరీరమంతటా దురద రావడం, పడుకుంటే కూర్చోవాలి అనిపించడం, నడుస్తుంటే ఆయాసం రావడం, ఒళ్లంతా దురద, కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి.

ఇంకా ముదిరితే కాళ్ల వాపులు వస్తాయి. ఇంకొంచెం ముదిరితే యూరిన్ సమస్య. అయితే చివరి ఈ రెండు లక్షణాలు వస్తే తప్ప డాక్టర్​ దగ్గరకి వెళ్లాలని అనుకోరు కొందరు. ఎందుకంటే మిగతా లక్షణాలు వేరే సమస్యకు కూడా కారణం కావొచ్చు. కానీ అవి వచ్చినప్పుడే అలర్ట్​ కావాలి. ఏ ఏజ్​ వాళ్లలో అయినా మొదట కనిపించే లక్షణాలు ఇవే. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వేరే భాగాల మీద పడి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే.. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లకు మాత్రమే నొప్పి వస్తుంది. మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకు ఇలాగే సైలంట్​గా ఎఫెక్ట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి.

సింపుల్​ టెస్ట్​లు

కిడ్నీల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి టెస్ట్​లు చేస్తారు. ఆ టెస్ట్​ల్లో కిడ్నీలు ఎంత హెల్దీగా ఉన్నాయో తెలిసిపోతుంది. కిడ్నీకి సంబంధించిన టెస్ట్​లు రెండు ఉంటాయి. ఒకటి క్రియాటిన్ టెస్ట్. ఇది రెగ్యులర్​గా చేస్తుంటారు. రెండోది యూరిన్ ఆల్బుమిన్ టెస్ట్. అది యూరిన్​లో ప్రొటీన్ పోతుందా? లేదా? అని తెలుసుకునేందుకు చేస్తారు.

ఒకవేళ ప్రొటీన్ పోతుందంటే కిడ్నీల మీద లోడ్​ ఎక్కువైందని అర్థం. ఆ స్టేజ్​లో ఏ లక్షణాలూ ఉండవు. ఆ లోడ్ ఏంటి? అంటే.. బీపీ, షుగర్, ఇతర మందులు వంటివేవైనా కావచ్చు. అవి ఆ మనిషికి పడట్లేదు. కాబట్టి లోడ్ పడుతుంది. దీనికి బ్లడ్ టెస్ట్​ అవసరం లేదు. యూరిన్​ ఆల్బుమిన్​ టెస్ట్​లో తెలిసిపోతుంది. నలభై ఏండ్లు దాటిన వాళ్లు ఈ టెస్ట్​లు ఆరునెలలకు ఒకసారి కచ్చితంగా చేయించుకోవాలి. 

చికిత్సలు

కిడ్నీ ఎంత వరకు డ్యామేజ్​ అయింది అనేదాన్ని బట్టి ట్రీట్​మెంట్ ఉంటుంది. మొదటి నాలుగు దశలు ఒకలా, ఐదో దశ మరోలా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్లకు మొదటి దశలో అవగాహన కలిగిస్తాం. రెండు, మూడు, నాలుగో దశల్లో ఉన్నవాళ్లకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. ఏసీ ఇన్​హిబిటర్స్, డెఫాక్లిఫాజోన్​, బీపీ కంట్రోల్ చేసే మెడిసిన్స్, ఇన్ఫెక్షన్​ కంట్రోలింగ్ మెడిసిన్స్ వంటివి కామన్​గా వాడతాం. ఐదో దశలో ఉన్నవాళ్లకు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్ వంటివి చేస్తారు. డయాలసిస్​లో బ్లడ్, పెరిటోనియల్ అని రెండు రకాలు ఉంటాయి. ఈ నాలుగు దశల్లో ఉన్నవాళ్లకు బేసిక్ ట్రీట్​మెంట్స్ అందాలి. అదే ఈ ఏడాది థీమ్​. 

డయాలసిస్

కిడ్నీ ప్రాబ్లమ్ అనగానే డయాలసిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే, ఇది అందరికీ అవసరం ఉండదు. మొదటి నాలుగు స్టేజీల్లో సైలంట్​గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంటుంది. అయితే, రెండు కిడ్నీలు ఒక్కోటి 50 శాతం పనిచేస్తాయనుకుంటే.. మొత్తం నూరు శాతం అవి రెండూ చేయగలవు. ఈ రెండూ కలిపి 90 శాతం డ్యామేజ్ అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు ఉండవు.

ఎందుకంటే కిడ్నీల్లో పది శాతం పనిచేసినా శరీరంలో ఎలాంటి తేడా కనిపించదు. 90 శాతానికి మించి డ్యామేజ్ అయితే మాత్రం హాస్పిటల్​ అడ్మిషన్​ అవసరం పడుతుంది. పేషెంట్​ పరిస్థితిని బట్టి డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్​లలో ఏదో ఒకటి చేస్తారు. ఇది స్టేజ్5 కిడ్నీ ప్రాబ్లమ్​లో జరుగుతుంది. డోనర్ లేకపోతే డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది బతికినన్నాళ్లూ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే డ్యామేజ్ అయింది తిరిగి రాదు కాబట్టి. 

అడ్వాన్స్డ్​ టెక్నాలజీ

అడ్వాన్స్డ్​ టెక్నాలజీలు డయాలసిస్​, కిడ్నీ ట్రాన్స్​ప్లాంటేషన్స్ రెండింటిలోనూ వచ్చాయి. ఇప్పుడు ఆన్– ​లైన్​ హీమోడయా ఫిల్టరేషన్(హెచ్​డిఎఫ్) చేస్తున్నారు. ఇది రెగ్యులర్​ డయాలసిస్​లా ఉండదు.   మామూలుగా డయాలసిస్ అంటే.. కిడ్నీలో ఉండే వ్యర్ధాలను మెషిన్ ద్వారా తీసేస్తారు. ఇలా చేయడం వల్ల కొంతమేరకే వ్యర్ధాలను తీయగలుగుతుంది.

కిడ్నీ చేసినంత బాగా ఆ ప్రాసెస్​ జరగదు. అందుకని కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇది ఇంతకుముందటి మెషిన్​ కంటే కొంచెం బెటర్​గా ఉంటుంది. ఇందులో 80 శాతం టాక్సిన్స్​ని క్లీన్ చేస్తుంది. ట్రాన్స్​ప్లాంట్​ విషయానికొస్తే.. ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇందులో పాడైన కిడ్నీ తీసి, వేరే కిడ్నీ పెడతారు. ఇప్పుడు అలా కాకుండా, లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయొచ్చు. అది కూడా రొబోటిక్ సర్జరీ. డోనర్ నుంచి కిడ్నీ తీయడానికి 4–5 సెంటిమీటర్లు మాత్రమే కట్​ చేస్తారు. కుట్లు వేశాక వారంలోపే వాళ్లు నార్మల్​గా పనులు చేసుకోవచ్చు. ఇంతకుముందు12 – 15 సెంటీమీటర్లు గాటు పెట్టేవాళ్లు. దానివల్ల కోలుకునేందుకు చాలా 
రోజులు పట్టేది. 

టొమాటో, పాలకూర, పాలు..

టొమాటో, పాలకూర, పాలు వంటి వాటిల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిమాటికి కిడ్నీల్లో రాళ్లు వస్తున్నాయంటే.. కొన్ని బ్లడ్ టెస్ట్​లు చేస్తారు. ఆ టెస్ట్​ల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి యూరిక్ యాసిడ్ కారణమైతే.. వాళ్లు టొమాటో, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, మాంసాహారం, డైరీ ప్రొడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తినడం తగ్గించాలి.

ఎందుకంటే వాటిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వాళ్లకు అప్పటికే యూరిక్ యాసిడ్ పేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్​ ఎక్కువగా తింటే.. అది మరీ పెరిగిపోయి త్వరగా స్టోన్స్ తయారవుతాయి. అందుకని స్టోన్స్ ఉన్నవాళ్లకు లేదా వాటిని తీయించుకున్నవాళ్లకు వీటిని తినడం తగ్గించమని చెప్తారు. అంతేకానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేని వాళ్లు హాయిగా తినొచ్చు. అవి ఆరోగ్యానికి మంచిది. ఒక్కొక్కరి బాడీ తీరు ఒక్కోలా ఉంటుంది. కొందరికి యూరిక్ యాసిడ్ నిలిచిపోతుంటుంది. అలాంటివాళ్లు తినకూడదు. 

వరల్డ్ కిడ్నీ డే

ప్రతి ఏడాది కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మార్చి14న ‘వరల్డ్ కిడ్నీ డే’ జరుపుతున్నారు. ఏడాదికి ఒక థీమ్​ తీసుకుని అవగాహన కల్పిస్తుంటారు. ఈ ఏడాది థీమ్.. ‘కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ – అడ్వాన్సింగ్​ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టిమల్ మెడికేషన్ ప్రాక్టీస్’. దీని అర్థం... కిడ్నీ సమస్య వచ్చిన ప్రతి ఒక్కరికీ చికిత్స అందుబాటులో ఉండాలి.

దానికి వాడాల్సిన మెడిసిన్స్​ కూడా స్టాండర్డ్​గా ఉండాలి. దీనివల్ల ఎంతమంది కిడ్నీ సమస్యలు ఉన్న పేషెంట్స్ ఉన్నారనేది ప్రభుత్వాల​కి తెలుస్తుంది. దాంతో ఎక్కడ? ఎంతమంది? ఉన్నారనేది తెలిస్తే వాళ్లకోసం వైద్య పరమైన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. అందులో బీపీ, షుగర్ వచ్చినవాళ్లకు కొన్ని మెడికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి పక్కన పెడితే, నార్మల్​గా కిడ్నీ ప్రాబ్లమ్​కి కావాల్సిన మెడికేషన్ అందాలి. మినిమమ్ గ్యారెంటీలాగ ఈ ట్రీట్​మెంట్ ప్రతి ఒక్కరికీ అందాలి. 

సింగిల్ కిడ్నీ చాలా?

కిడ్నీలు రెండూ కలిసి పనిచేస్తాయి. అయితే, ఒకటి డ్యామేజ్ అయితే మరొకటి దాని పని కూడా కలిపి చేస్తుంది. అంటే.. ఒక్కటే పని పూర్తి చేస్తుంది. అది 40 శాతం డ్యామేజ్ అయ్యేవరకు లక్షణాలు బయటపెట్టదు. దాంతో ఒక కిడ్నీ ఏ కారణం చేత ఎఫెక్ట్ అయిందో, అదే కారణంతో రెండోది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. స్టోన్స్ రావడం, క్యాన్సర్ వంటివి.

కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ కిడ్నీల్లో రెండు రకాలు ఉంటుంది. కిడ్నీ పాడైన వ్యక్తికి హెల్దీ కండిషన్​లో ఉన్న మరో వ్యక్తి కిడ్నీ పెడతారు. దాంతో వందేండ్లయినా బతకొచ్చు. అలాకాకుండా కొందరికీ కిడ్నీల్లో రాళ్లు ఉండి, చీము పడతాయి. అప్పుడు ఒక కిడ్నీ తీసేస్తారు. అప్పుడు సింగిల్ కిడ్నీ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్లలో మిగిలిన కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టుకతో ఒక కిడ్నీ ఉన్నవాళ్లకు కూడా ఏంకాదు. 

ఇంటర్వ్యూ : మనీష పరిమి