జలుబు, దగ్గు... చలికాలంలో ఎక్కువ మందిని ఇబ్బందిపెడతాయి. వీటిని ఈ సీజన్లో వచ్చిపోయే చిన్నపాటి ఆరోగ్య సమస్యలే అనుకుంటారు చాలామంది. అయితే, నాలుగైదు రోజులకి మించి ఉండే జలుబు, దగ్గు కొన్నిసార్లు సైనసైటిస్ కి దారి తీస్తుంది. చల్లని వాతావరణం, పడనివి తినడం, దుమ్ముధూళి వంటి అలర్జీలు ఈ సమస్యకి కారణమవుతాయి. మందులతో తగ్గిపోయే ఈజబ్బుని నిర్లక్ష్యం చేస్తే సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ సీజన్లో సైనసైటిస్ బారిన పడకుండా ఉండేందుకు చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి చెబుతున్న జాగ్రత్తలివి.
ముఖం మీద సైనసిస్ అనే గాలి గదులు ఉంటాయి. రెండు కళ్ల మధ్య రెండు (ఎథ్మాయిడ్ సైనసిస్), చెక్కిళ్ల దగ్గర (మాక్సిల్లరీ సైనసిస్), నుదుటి వెనకాల రెండు (ఫ్రోంటల్ సైనసిస్), మెదడు భాగంలో (స్పీనాయిడ్ సైనసిస్) రెండు... మొత్తం 8 సైనసిస్లు ఉంటాయి. ఈ సైనసిస్ గదులన్నీ గాలితో నిండి ఉంటాయి. ఇవి ముక్కు లోపలి గోడలని అంటుకుని ఉన్న ఎముకలతో తయారైన టర్బినేట్లలోకి తెరుచుకుని ఉంటాయి. టర్బినేట్లు మనం పీల్చేగాలిని రెగ్యులేట్ చేస్తాయి. గాలి వేడిగా, తేమగా ఉండేలా చేస్తాయి.
సైనసైటిస్ వస్తుందిలా..
సైనసైటిస్ రావడానికి ప్రధాన కారణం సైనస్ గదుల్లో వచ్చే ఇన్ఫెక్షన్. గాలి ఉండాల్సిన సైనసిస్ గదుల్లో చీము, నీటి బుడగలు వంటివి చేరినప్పుడు సైనసైటిస్ వస్తుంది. ముక్కు దూలం వంకరగా ఉన్నాముక్కు రంధ్రాల నుంచి గాలి సరిగా వెళ్లదు. దాంతో ముక్కు రంధ్రాలు దగ్గరకి వస్తాయి. సైనసిస్ గదులు బ్లాక్ అవుతాయి. ముక్కు లోపలకి గాలి వెళ్లకపోవడం వల్ల ఈ గదుల్లో ద్రవాలు విడుదలవుతాయి. దాంతో ముక్కు పట్టేస్తుంది.
కొందరికి చలికాలంలో సైనసైటిస్ రెగ్యులర్ గా వస్తుంది. సమస్య తీవ్రంగా ఉంటే సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో భాగంగా వంకరగా ఉన్న ముక్కు దూలాన్ని సరి చేస్తారు. ముక్కు పక్క గోడల్లో పెరిగిన టర్బెన్ కండని కత్తిరిస్తారు. ఇవేకాకుండా ఫంక్షనల్ ఎండోస్కోపి సైనస్ సర్జరీ ద్వారా సైనస్ గదుల్లో చేరిన లిక్విడ్స్న తీసేస్తారు. సైనసైటిస్ ఉన్నవాళ్లకి స్కిన్ ప్రి టెస్ట్ చేసి వాళ్లకు ఏమేం పడట్లేదో చెబుతారు.
రిస్క్ ని పెంచుతాయి..
అలర్జిక్ రైనైటిస్....
అంటే అలర్జీల వల్ల సైనసైటిస్ రావడం. పొల్యూషన్,చల్లని వాతావరణం, దుమ్ముధూళి, కాస్మొటిక్స్, ఇంట్లో ఉండే దుమ్ముధూళి, పెట్స్ అలర్జీ వంటివి సైనసైటిస్ రిస్క్ ని పెంచుతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్లు...
చలికాలంలో, వర్షాకాలంలో గాలిలో రెస్పిరేటరీ వైరస్లు ఉంటాయి. చల్లని గాలి పీల్చినప్పుడు ఈ వైరస్లు ముక్కులోపలికి వెళ్తాయి. దాంతో ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల (నియోకోకస్, సూడోమోనస్, స్టెఫైలోకోకస్ వంటివి) కూడా ముక్కు పట్టేస్తుంది. ఇవేకాకుండా స్విమ్మింగ్పల్ లో క్లోరిన్ కలిపిన నీళ్లలో ఈతకొట్టడం వల్ల కూడా సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ లక్షణాలు కనిపిస్తాయి..
సైనసైటిస్ తో బాధపడే వాళ్లకి ముక్కు పట్టేస్తుంది. ఒక పక్క లేదా రెండు పక్కల ముక్కు పట్టేస్తుంది. ముక్కు వెనక భాగం నుంచి గొంతులోపలికి ద్రవాలు విడుదలవుతాయి. దాంతో పొడి దగ్గు వస్తుంది. చాలామందికి ముఖమంతా నొప్పి పెడుతుంది. కొందరికి తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ తీవ్రత ఎక్కువైన కొద్దీ తలనొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే, అలర్జిక్ రైనైటిస్ ఉన్నవాళ్లకి వాసన, రుచి తెలియకపోవడం కూడా సైనసైటిస్ సంకేతాలే.
డయాగ్నస్ చేస్తారిలా..
సైనసైటిస్ని డయాగ్నస్ చేయడానికి నాజల్ ఎండోస్కోపి చేస్తారు. సిటీ-స్కాన్ ద్వారా తెలుసుకుంటారు. ఇందులో ఏ సైనసిస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సినవి..
నాజల్ స్ప్రేలు వాడితో సైనసైటిస్ నుంచి కొంత రిలీఫ్ ఉంటుంది. అయితే, యాంటీ బయాటిక్స్ వేసుకుంటే ఈ సమస్య తొందరగా తగ్గిపోతుంది. సైనసైటిస్కి 3 రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. యాంటీ హిస్టమైన్ మందులు కూడా సైనసైటిస్ నుంచి బయట పడేస్తాయి. అయితే, డాక్టర్ సలహాతోనే ఈ మందులు వాడాలి. వీటితో పాటు అలర్జీకి కారణమయ్యే వాటికి, చల్లని ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి.
Also Read :- శరీరంలో మెగ్నీషియం తగ్గితే రోగాలు ఎలా వస్తాయంటే..!