హెల్దీగా ఉండాలన్నా హైడ్రేటెడ్ గా ఉండాలన్నా నీళ్లు సరిపోను తాగాలి. నీళ్లు తాగితే ఒంట్లోని వేడి తగ్గడమే కాదు టాక్సిన్లు బయటికి పోతాయి. అంతేకాదు, చర్మం ఫ్రెష్ గా కనిపిస్తుంది కూడా. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు తాగొద్దు. ఉదాహరణకు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఫుడ్ త్వరగా జీర్ణం కాదు. అలాగే ఏదైనా పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం కూడా మంచి అలవాటు కాదంటోంది క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శ్వేతా మహదిక్.
హైడ్రేట్ గా ఉండేందుకు నీళ్లు తాగడంతో పాటు పండ్లు కూడా తినాలి. విటమిన్ల లోపం, కొన్ని రకాల చర్మ సమస్యలు రాకుండా ఉండడానికి పండ్లు తప్పనిసరి. అయితే, పండ్లు తిన్నవెంటనే నీళ్లు తాగొద్దు. ఎందుకంటే... చాలావరకు పండ్లలో నీళ్లు ఎక్కువ ఉంటాయి. దాంతో పండ్లు తిన్నప్పుడు ఒంట్లో నీళ్ల శాతం పెరుగుతుంది. అలాంటప్పుడు నీళ్లు తాగితే వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
గ్యాస్ సమస్య..
మామూలుగానే పండ్లలో ఘగర్, ఈస్ట్ అనే ఫంగస్ ఎక్కువ ఉంటాయి. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే పొట్టలోని యాసిడ్స్ పలుచనైతాయి. దాంతో ఈస్ట్ సంఖ్య పెరిగి, కార్బన్ -డై-యాక్సెడ్, ఆల్కహాల్ లెవల్స్ ఎక్కువైతాయి. దీనివల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది.
పీహెచ్ వాల్యూ మారుతుంది..
వాటరెలన్, మస్క్ మెలన్, కీరదోస, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీళ్ల కంటెంట్ ఎక్కువ. ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణాశయంలోని పీహెచ్ లెవల్స్లో తేడా వస్తుంది. పండ్లలోని నీళ్ల వల్ల పొట్టలోని పీహెచ్ మరింత అసిడిక్ అవుతుంది.
ఆలస్యంగా అరుగుతుంది..
పండ్లు తినగానే నీళ్లు తాగితే పోషకాల్ని గ్రహించడం, జీర్ణం అవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా అసిడిటీ సమస్య వస్తుంది. ఇలాంటి సమస్య రావొద్దంటే ఏదైనా తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల వరకు నీళ్లు తాగొద్దు. తిన్నది అరగాలంటే జీర్ణాశయంలోని ఎంజైమ్లు చాలా అవసరం. అయితే, నీళ్లు తాగితే జీర్ణ రసాలు పలుచన అవుతాయి. దాంతో అవి జీర్ణం చేసే ఎంజైమ్ లను ఉత్పత్తి చేయలేవు. అలాంటప్పుడు కడుపులో మంట, అసిడిటీ వంటివి ఇబ్బంది పెడతాయి.
షుగర్ లెవల్స్ పెరుగుతాయి..
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే చాలా వరకు ఫుడ్ జీర్ణం కాదు. జీర్ణం కాని ఫుడ్ ఫ్యాట్ గామారి, ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో బ్లడ్ షుగర్ ఎక్కువై, డయాబెటిస్, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.