ఎల్ఆర్ఎస్​లో అక్రమాలకు తావివ్వొద్దు

  • హెచ్ఎండీఏ పరిధిలోమరింత జాగ్రత్తగా ఉండాలి: మంత్రి పొంగులేటి
  • మూడు నెలల్లో అప్లికేషన్లు క్లియర్​చేయాలి​
  • ప్రభుత్వ భూములు ప్రైవేట్​వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వొద్దు
  • భూపాలపల్లి నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ 

హైదరాబాద్/భూపాలపల్లి/ఖమ్మం, వెలుగు: ఎల్ఆర్ఎస్​లో అక్రమాలకు తావివ్వొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. హెచ్‌‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని.. ఈ జిల్లాల్లో లేఅవుట్ ల క్రమబద్ధీకరణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. శనివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి.. అక్కడి కలెక్టరేట్​నుంచి ఎల్ఆర్ఎస్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 

లక్షలాది మంది కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఎల్‌‌ఆర్‌‌ఎస్ ప్రక్రియను స్పీడప్​ చేయాలని కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్ధీకరణ జరగాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం 2020 అక్టోబర్ 31 వరకు 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు  స్వీకరించిందని.. కానీ, గత నాలుగేండ్లుగా అవి పరిష్కారానికి నోచుకోలేదన్నారు.

వాటి పరిష్కారానికి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలన్నారు. ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని తెలిపారు. 

హెల్ప్​డెస్క్​లు ఏర్పాటు చేసుకోవాలి

ఎల్‌‌ఆర్‌‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లీనరీ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్​లు వెంటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎల్అర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు తక్షణమే శిక్షణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. 

అప్లికేషన్ల స్క్రూటినీ పక్కాగా జరగాలి: భట్టి

ఎల్​ఆర్​ఎస్​ అప్లికేషన్ల స్క్రూటినీ పక్కాగా చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందన్నారు. భూపాలపల్లి కలెక్టరేట్​నుంచి మంత్రి పొంగులేటి రివ్యూ చేయగా.. ఖమ్మం కలెక్టరేట్ నుంచి​డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు.​ అప్లికేషన్ల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సపోర్ట్ సిస్టమ్​ను పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.