ఇంద్ర ధనస్సులోని ఏడు రంగుల్ని భూమిపైకి దింపే పండుగ హోలీ.. చిన్నా పెద్దా అంతా కలిసి రంగుల్లో మునిగితేలే సంబురం. కానీ, ఆ సంతోషం ఎప్పటికీ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే హోలీ సందర్భంగా చల్లుకునే రంగుల్లో అనేక రసాయనాలు కలుస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి హానికరమైనవి. ఈ రంగు వల్ల కళ్లు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి..
హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచి రంగుల సందడి మొదలవుతుంది. గతంలో చిన్నా పెద్దా అంతా కలిసి రకరకాల పూలు, రంగులు తయారు చేసి పండుగ రోజు చల్లుకునేవాళ్లు. తర్వాతి కాలంలో రసాయన రంగులు; న రంగులు మార్కెట్లోకి వచ్చాయి. కానీ, ఆ రంగులతో ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. మార్కెట్ లో ఎక్కువగా కాపర్ సల్ఫేట్ (ఆకుపచ్చ), రీ సల్ఫేట్ (ఎరుపు), క్యాల్షియం క్రోమియం(పర్పుల్), లెడ్ ఆక్సైడ్ బ్రోమైడ్ (సిల్వర్) రంగులు అమ్ముడవుతున్నాయి.
ఇవన్నీ దుస్తులపై రంగులద్దడానికి ఉపయోగించేవి. వీటిని శరీరంపై పూసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ రసాయన రంగులు నీటితో కలిసి భూమిలోకి ఇంకిపోతే పర్యావరణం కూడా కలుషితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. రసాయన రంగులు చల్లుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వాళ్లు సూచిస్తున్నారు.
వీళ్లపై చల్లొద్దు
* కొందరు ఈ రసాయన రంగుల గురించి తెలిసే వేడుకలకు దూరంగా ఉంటారు. ఇంకొందరు అలర్జీ వల్ల రంగులకు దూరంగా ఉంటారు. అలాంటి వాళ్లను కూడా వదలకుండా స్నేహితులు, బంధువులు రంగులు చల్లుతుంటారు. వాళ్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటారు. అలా చేయడం సరికాదు.
* పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లపై, అత్యవసర విధులు నిర్వర్తించే ఉద్యోగులపై రంగునీళ్లు చల్లి ఇబ్బంది పెట్టొద్దు.
* హోలీ ముసుగులో ఆకతాయి కుర్రకారు హద్దు మీరుతుంటారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, వాహనాల్లో వెళ్లే వాళ్లపై రంగులు చల్లడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గొడవలకు దారి తీస్తుంది.
* పళ్లకు రంగులు పూయడం, బురద నీటిలో ఎత్తికుదేయడం ఆ లాంటివి వికృత చేష్టలు చేయకూడదు.
* పిల్లల ఒంటిపై రంగులను శుభ్రం చేసుకునేందుకు ఈతకు వెళ్లి ప్రమాదాలు బారిన పడుతుంటారు. కాబట్టి పెద్దలు వాళ్లను ఓ కంట కనిపెట్టడం మంచిది.
ప్రమాదంతో ఆటలా?
ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసే ఈ రంగులు ఎంతో విషతుల్యమైనవి. ఇవి ఎంత కడిగినా శరీరాన్ని వదలవు. రోజుల తరబడి ఉంటాయి. అంతేకాక అనేక రకాల చర్మవ్యాధులకు కారణమవుతాయి. రంగుల పొడి కళ్లలో పడితే కంటి సమస్యలు, నోట్లోకి వెళ్తే కాలేయం దెబ్బతినడం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అందుకే ప్రమాదకరమైన ఈ రంగులతో ఆడుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
* రంగులు నేరుగా ముఖంపై పడకుండా చల్లాలి.
౦ కళ్లకు హాని జరగకుండా అద్దాలు పెట్టుకోవడం మంచిది.
౦ హోలీ ఆడిన వెంటనే రంగులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆరగంట పాటు తలస్నానం చేయాలి.
౦ శరీరానికి మాయిశ్చరైజర్ ఆయిల్, సన్ స్క్రీన్ లేపనాలను రాసుకుంటే
రంగుల ప్రభావం ఎక్కువ ఉండదు.
౦ రంగుల ప్రభావంతో వెంట్రుకలు పొడిబారతాయి.
* తలలో దద్దుర్లు. దురద వస్తాయి. దాంతో వెంట్రుకలు తెల్లగా మారుతాయి. అందుకే రంగులు చల్లుకునేటప్పుడు టోపీలు పెట్టుకోవడం మంచిది.
సహజ రంగులకు ఇవే..
సహజంగా దొరికే కొన్ని పూలు, చెట్ల బెరడులు, ఆకులు, పండ్లతో రంగులను తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఏ హానీ కలగదు. మోదుగ, కొన్ని రకాల బంతి పూలతో కాషాయం, పసుపుపచ్చ రంగులు తయారుచేసుకోవచ్చు. గోరింటాకు, గుంటగలగరాకు ఆకుపచ్చ రంగునిస్తాయి. ఎర్రచందనం పొడితో ఎరుపు రంగులు తయారుచేసుకోవచ్చు.