-
పీఎంఎల్ఏ రూల్స్ పేరుతో ..జీవించే హక్కును దెబ్బతీయొద్దు
-
ట్రయల్ పేరిట వృద్ధుడ్ని ఎన్నిరోజులు జైల్లో ఉంచుతారు?
-
ఈడీని ప్రశ్నించిన బాంబే హైకోర్టు
ముంబై: ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని కఠిన నిబంధనలు వ్యక్తి జీవించే ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా ఉండకూడదని.. సదరు వ్యక్తి వయసు, కండిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. 71 ఏండ్ల వృద్ధుడ్ని మనీలాండరింగ్ కింద అరెస్ట్ చేసి ట్రయల్ పేరిట ఎన్నిరోజులు జైల్లో ఉంచుతారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది.
బ్యాంకు లావాదేవీల స్కామ్ కేసులో పుణెకు చెందిన సూర్యాజీ జాదవ్ అనే వృద్ధుడ్ని 2021 మార్చిలో ఈడీ అదుపులోకి తీసుకుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని, తనకు 71 ఏండ్ల వయసని, క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బాంబే హైకోర్టులో జాదవ్ పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన హైకోర్టు.. “పిటిషనర్‌ను విచారణ పేరిట ఇప్పటికే గరిష్ట శిక్షలో సగం శిక్ష అనుభవించాడు. ఇంకా ఎన్నాళ్లు విచారణ జరపుతారు? అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నం. పీఎంఎల్ఏలోని రూల్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి జీవించే ప్రాథమిక హక్కును భంగం కలిగించేలా ఉండకూడదు” అని పేర్కొంది. జాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ కాపీ శనివారం బయటకు వచ్చింది.