మాదాపూర్ లో బోర్దు తిప్పేసిన మరో కంపెనీ..రూ.700 కోట్ల భారీ మోసం

  • బోర్డు తిప్పేసిన డీకేజెడ్ సొల్యూషన్ సంస్థ
  • 10 రోజుల క్రితమేసీసీఎస్​లో  బాధితుల ఫిర్యాదు
  • పట్టించుకోకపోవడంతో సీసీఎస్ ఆఫీస్ ముందు ధర్నా

బషీర్​బాగ్, వెలుగు: హైదారాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న డీకేజెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ రూ. 700 కోట్ల భారీ మోసానికి పాల్పడింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి.. దాదాపు30 వేల మంది నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితులు శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

అసలేం జరిగిందంటే..

చెన్నైకి చెందిన ఆషిఫాక్ రహిల్, ఏపీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ 2018లో మాదాపూర్ లో డీకేజెడ్ సొల్యూషన్స్ పేరిట  ఆఫీస్ ఓపెన్ చేశారు. తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ పై 10 నుంచి 12 శాతం వరకు లాభాలు ఇస్తామని తెలిపారు. నిజమేనని నమ్మిన పలువులు ఇన్వెస్ట్ మెంట్ చేశారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది లక్ష నుంచి 50 లక్షల వరకు డిపాజిట్ చేశారు. ఇలా మొత్తం 700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు.  మొదట లాభాలు ఇచ్చి నమ్మకం కలిగించారు. అయితే, గత నెలలో సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఆఫీసుకి తాళాలు వేసి ఎండీలు ఇద్దరు పరారయ్యారు. దాంతో బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసికొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.