పండుగకు తియ్య తియ్యగా వెరైటీ స్వీట్స్.. ఇంట్లోనే క్షణాల్లో తయారీ.. ఎలాగంటే ...

Diwali Special: దీపావళి అంటే వెరైటీ గిఫ్ట్స్, పటాకుల మోతలే కాదు.. నోరూరించే స్వీట్లు కూడా.. అందుకే ఈ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీలు మీ కోసం...ఇప్పుడు మేము చెప్పబోయే స్వీట్స్ తయారు చేయడానికి  పెద్దగా టైం తీసుకోవు. ఈ రెసిపీలకి ఎక్కువ ఇంగ్రెడియెంట్స్ కూడా అవసరం లేదు. మరింకెందుకు ఆలస్యం వంట మొదలు పెట్టి అందరి నోరు తీపి చెయ్యండి.

చుమ్ చుమ్

కావాల్సినవి : 

  • ఆవు పాలు - ఒక లీటరు 
  • చక్కెర - రెండు వందల గ్రాములు
  •  యాలకుల పొడి - ఒక టీ స్పూన్ 

తయారీ

చుమ్ చుమ్ స్వీట్ తయారీకి విరిగిన పాలు కావాలి.. అందుకోసం పాలని బాగా మరిగించి కొంచెం వెనిగర్ లేదా నిమ్మరసం వేస్తే విరిగిపోతాయి. తరువాత పలుచటి క్లాత్ లో విరిగిన పాలను.. పోయాలి. నీళ్లన్నీ పోయేవరకు అంటే దాదాపుగా 45 నిమిషాలు వేలాడదీయాలి. తర్వాత.. గిన్నెలోకి తీసుకుని బాగా మెదపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండలు చేయాలి. పాన్లో చక్కెర వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం పట్టాలి. అందులో యాలకుల పొడి కూడా వేసి తీగ పాకం వచ్చాక విరిగిన పాలతో చేసిన ఉండలు అందులో వేయాలి. ఈ ఉండల్ని పాకంతో లేదా కొబ్బరి పొడి దొర్లించి తింటే పండుగ తియ్యదనం రెట్టింపు అవుతుంది.

చిలగడదుంప (మొరంగడ్డ) జామూన్స్

కావాల్సినవి : 

  • చిలగడదుంపలు (ఉడికించి) పావు కిలో
  •  బ్రెడ్ స్లైసులు - నాలుగు 
  • యాలకుల పొడి- అర టీ స్పూన్ 
  • నూనె... డీప్ ఫ్రైకి సరిపడా
  •  డ్రై ఫ్రూట్స్ తరుగు... కొద్దిగా

 తయారీ

 ఉడికించిన చిలగడదుంపల్ని మెదిపి గిన్నెలో వేయాలి. అందులో డ్రై ఫ్రూట్స్ పలుకులు,యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి. బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి నీళ్లలో ముంచి తీయాలి. నీళ్లన్నీ పిండి వాటి మధ్యలో చిలగడదుంప ఉండలు పెట్టి జామూన్స్ లా చుట్టాలి. వాటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.

 ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం.. పట్టాలి. వేగించిన జామూన్స్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసి, వాటి పైన బెల్లం పాకం వేస్తే నోరూరించే చిలగడదుంప జామూన్ రెడీ..

సెవన్ కప్ స్వీట్

కావాల్సినవి

  • శనగపిండి - ఒక కప్పు
  •  చక్కెర- మూడు కప్పులు
  • పాలు - ఒక కప్పు
  • నెయ్యి - ఒక కప్పు 
  • పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు.

 తయారీ

పాన్ లో నెయ్యి కరిగించి శనగపిండి, పచ్చి కొబ్బరి తురుము, పాలు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మిశ్రమం దగ్గరపడ్డాక నెయ్యి రాసిన ప్లేట్ లో ఆ మిశ్రమాన్ని సమంగా పరవాలి. గట్టి పడిన తర్వాత నచ్చిన షేప్ కట్ చేసుకుంటే సెవన్ కప్ స్వీట్ రుచి చూడటానికి రెడీ..