దీపావళికి సిండికేట్ సెగ

  • పర్మిషన్ల పేరుతో వసూళ్లు
  • నల్లగొండ, సూర్యాపేట, కోదాడ కేంద్రంగా వసూళ్లకు పాల్పడుతున్న సిండికేట్ ముఠా
  • ధరలను పెంచుతున్న దుకాణాదారులు
  • అధిక ధరలతో దీపావళికి మోత మొగుతున్న పటాకులు

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. దీపావళి అంటేనే ఇంటిల్లిపాది జరుపుకొనే పండగ. కానీ, ఇలాంటి పండుగ సామాన్య ప్రజలకు గుదిబండగా మారుతోంది. పటాకులు కొనాలంటే గుండె గుబేల్ మంటోంది. హోల్‌‌‌సేల్‌‌ ముసుగులో ప్రజలను వ్యాపారులు దోచుకుంటున్నారు. అందరూ సిండికేట్‌‌ అయిపోయి ధరలను అమాంతంగా పెంచేశారు.

 జిల్లాలోని కొంతమంది డీలర్లు అనుమతుల పేరిట దుకాణాదారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో పుట్టగొడుగులుగా దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. సిండికేట్ గా మారి ఆఫీసర్లకు ముడుపులు సమర్పించుకొని అధిక ధరలకు పటాకులు విక్రయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. 

రూ.100 కోట్లకుపైగా వ్యాపారం..

సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఏటా రూ.100 కోట్లకు పైగా పటాకుల వ్యాపారం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా రూల్స్ అమలు కావడం లేదు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో దాదాపు 550కు పైగా గతేడాది అధికారులు అనుమతులు జారీ చేశారు. కానీ, ఈ రెండు జిల్లాల్లో 2 వేలకు పైగా అనధికారిక దుకాణాలు ఏర్పాటు చేసి దీపావళికి రెండు రోజుల ముందు అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

పర్మిషన్ పేరుతో వసూళ్లు..

పటాకులు విక్రయించే షాపులకు పర్మిషన్ పేరుతో భారీగా ముడుపులు అందిస్తున్నట్లు సమాచారం. ఈ దందాలో వ్యాపారస్తులతోపాటు అధికారులు కూడా ఉండడంతో ప్రత్యేక రేట్లు పెట్టి మరి దోచుకుంటున్నారు. తాత్కాలిక దుకాణాదారులు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో దుకాణానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారని వ్యాపారస్తులు బహిరంగంగా చెబుతున్నారు.

 సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఒక డీలర్ సిండికేట్ ఏర్పాటు చేసి పర్మిషన్ అన్నీ తానే ఇప్పిస్తానంటూ చక్రం తిప్పుతున్నాడు. ఏడాదిపాటు పటాకులు అమ్మే సదరు డీలర్ పర్మనెంట్ లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తూ ఆఫీసర్లను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కోదాడ పట్టణంలో దీపావళి సందర్భంగా మొత్తం 18 పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దుకాణాల ఏర్పాటు కోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ.75 వేలు వసూళ్లు చేస్తున్నారు.  

రూల్స్ పక్కకు పెడుతున్న ఆఫీసర్లు..

పెట్రోల్ బంకులు, స్కూల్స్ లేని ప్రదేశాల్లో పటాకులు అమ్మేందుకు ఏర్పాటు చేయాలి. కానీ, రూల్స్ పక్కకు పెట్టి మరి దుకాణాలకు ఆఫీసర్లు పర్మిషన్స్ ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాలకు సమీపంలోనే పెట్రోల్ బంకులు ఉండడం గమనార్హం. మరో పక్క కోదాడ, నల్లగొండలో సైతం జనావాసాల మధ్య దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.