అమెరికాలో దీపావళి వేడుకలు..దీపాలు వెలిగించి ప్రారంభిన బైడెన్

  • వైట్ హౌస్‌‌‌‌లో దీపావళి వేడుకలు
  • దీపం వెలిగించి ప్రారంభించిన యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్
  • ఐఎస్ఎస్​ నుంచి సునీత మెసేజ్​

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో మంగళవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్లూరూమ్​లో దీపం వెలిగించి ప్రెసిడెంట్ జో బైడెన్ సంబురాలను ప్రారంభించారు. వేడుకల్లో కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్​లు సహా 600 మందికి పైగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇండియన్ అమెరికన్ ఆస్ట్రొనాట్ సునీతా విలియమ్స్ వీడియో మెసేజ్​లో శుభాకాంక్షలు తెలియజేశారు. 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం బ్లూరూమ్​లో దీపం వెలిగించి ప్రెసిడెంట్ జో బైడెన్ సంబరాలను ప్రారంభించారు. వేడుకల్లో కాంగ్రెస్ సభ్యులు, అధికారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ లు సహా 600 మందికి పైగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ “అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అతిపెద్ద దీపావళి సంబరాలు నిర్వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఒక గొప్ప విషయం ఏంటంటే.. సెనేటర్‌గా, వైస్ ప్రెసిడెంట్‌, కీలక విభాగాల బాధ్యులుగా దక్షిణాసియా -అమెరికన్‌లు నా టీమ్​లో ఉన్నారు. కమలా హారిస్​నుంచి డాక్టర్ మూర్తి వరకు ఎంతో మంది అమెరికా పరిపాలనలో నా నిబద్ధతను నిలబెడుతున్నందుకు గర్వపడుతున్నాను” అని అన్నారు.

 ‘‘ఇండియన్​అమెరికన్లు యూఎస్​లోని అన్ని రాష్ట్రాలను సుసంపన్నం చేశారు. యూఎస్​లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీల్లో వీరు ఒకరు, విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతున్నరు” అని తెలిపారు.

మా నాన్న భారత పండుగలు, కల్చర్ నేర్పించారు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)​లో ఉన్న ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నిమిషం నిడివి గల ఆ వీడియోను ఈ సందర్భంగా వివేక్ హెచ్ మూర్తి ప్రదర్శించారు. “ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్​లో దీపావళి జరుపుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజు, నేను ప్రత్యేకంగా మా నాన్నను మననం చేసుకుంటాను. 

దీపావళి సహా భారతీయ పండుగల గురించి  ఆయన తెలియజేశారు. ఆ సాంస్కృతిక మూలాలను మాకు అందజేశాడు. దీపావళి మంచిని పంచుతుంది.. ఆనందా లను పెంచుతుంది. విభిన్న సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన కుటుంబంలో పెరిగిన మాకు తల్లిదండ్రులు వాటన్నింటిని నేర్పించారు. 

వారికి మేమెంతో రుణపడి ఉన్నాం” అని తన వీడియో సందేశంలో సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో వైస్ ​ప్రెసిడెంట్ కమలా హారిస్‌, జిల్‌ బైడెన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.