దీపావళి ఐదు రోజుల పండుగ.. ఈ ఐదురోజుల్లో ఆ ఒక్కరోజు నువ్వుల నూనెతో తలస్నానం చేస్తే..

దీపావళి పండుగ అనగానే దీపాల వెలుగులు, టపాసుల మోతలు, భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, నోరూరించే స్వీట్లు కళ్ల ముందు ఫ్లాష్​లైట్స్​వెలుగులో మెరుపులు కురిపిస్తాయి! ఈ పండుగ నాడు కులమత భేదం లేకుండా అందరూ టపాసులు కాలుస్తారు. రాత్రి పూట ఆకాశంలో మిణుకు మిణుకుమనే నక్షత్రాలతో పాటు మిరుమిట్లు గొలిపే కాంతులు చూస్తుంటే భలే ఉంటుంది.

నరక చతుర్ధశి, దీపావళి మాత్రమే పర్వదినాలుగా చేసుకుంటారు ఎక్కువమంది. కానీ ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. అయితే ఇలా చేసుకోవడం దక్షిణాదిన తక్కువే కానీ, ఉత్తరాదిన మాత్రం ఐదు రోజులు ఘనంగా జరుపుకుంటారు. అందులో మొదటి రోజు ధనత్రయోదశి (ధంతేరస్), రెండో రోజు నరకచతుర్దశి (చోటీ దివాలీ), మూడోరోజు దీపావళి, నాలుగో రోజు బలి పాడ్యమి (గోవర్థన పూజ), చివరి రోజు భగినీ హస్త భోజనం (భాయి ధూజ్​) అనే పేర్లతో వేడుకలు జరుగుతాయి. ఆ వేడుకల వివరాల్లోకి వెళ్తే..

ధన త్రయోదశి: అమృతం కోసం దేవతలు పాలకడలిని చిలుకుతున్నప్పుడు శ్రీమహాలక్షీ ఉద్భవించింది. భార్యగా స్వీకరించిన మహావిష్ణువు ఆమెను ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అందుకే మొదటి రోజును ధన త్రయోదశిగా చేసుకుంటారు. ఆ రోజున కొంత బంగారం అయినా కొంటారు. అయితే... లక్ష్మీ నివాస స్థానం అయిన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్కు చేరుతుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజున లక్ష్మీ పూజ చేస్తారు.

నరక చతుర్దశి: నరకాసుర సంహారం జరిగిన రోజు ఇది. ఈ రోజున ఇళ్లు, వాకిళ్లను చక్కగా అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. నీళ్లలో గంగాదేవి, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారట! అందుకే నువ్వుల నూనెతో తలస్నానం చేయాలని పెద్దలు చెప్తారు.అంతే కాదు.. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో వచ్చి బలి చక్రవర్తిని మూడడుగుల నేల అడిగి, ఆయన్ని పాతాళానికి అణచివేసిన రోజు కూడా ఇదేనని చెప్తారు.

దీపావళి: ప్రతి యుగంలోనూ దీపావళి ప్రత్యేకమైన రోజే. కృత యుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి. త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు వెళ్లిన రోజు దీపావళి. ద్వాపరయుగం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చినరోజు దీపావళి అని పురాణాలు చెప్తున్నాయి. సాయంత్రం ఏ ఇంటి వాకిలి ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లో సిరిసంపదలనిచ్చే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని నమ్ముతారు.

బలి పాడ్యమి: విష్ణుమూర్తి పాతాళానికి బలి చక్రవర్తిని అణచివేశాక, మళ్లీ తిరిగి భూమ్మీదకు వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. మహారాష్ట్రలో ఈ రోజును ‘నవ దివస్​’గా చెప్తారు. ఈ రోజున బలికి పూజలు చేస్తారు. గుజరాతీ వాళ్లకు ఇది మన ఉగాది పండుగలాగ అన్నమాట!  నందగోపాలుడు గోవర్ధన గిరిని ఎత్తి రేపల్లె ప్రజలను కాపాడిన రోజు కూడా ఇదేనని గోవర్ధన పూజ చేస్తారు.

భగినీ హస్త భోజనం: సోదర ప్రేమకు గుర్తుగా రక్షాబంధన్​ చేసుకోవడం తెలిసిందే. అదే ప్రేమానురాగాలను గుర్తుచేసుకుంటూ కార్తీకమాసంలో కూడా పండుగ చేసుకుంటారు. దాన్నే భగినీ హస్త భోజనం అంటారు. ‘భగిని’ అంటే సోదరి. సోదరి పెట్టే భోజనం కాబట్టి ‘భగినీ హస్త భోజనం’ అంటారు. దీపావళి వేడుకలు చేసుకునే ఐదు రోజుల్లో చివరి రోజు ఈ వేడుక చేస్తారు.

ఈ రోజున  అక్కాచెల్లెళ్ల ఇంటికి అన్నదమ్ములు వెళ్తారు. సోదరుల నుదుట బొట్టు పెట్టి, భోజనం వడ్డిస్తారు. భోజనం చేసిన సోదరులు బహుమతులిచ్చి అక్కాచెల్లెళ్లను ఆశీర్వదిస్తారు. ఈ వేడుకను ఉత్తర భారతదేశంలో ‘భయ్యా ధూజ్​’ పేరుతో చేసుకుంటారు. దీన్నే ‘భాయ్​ దూజ్’​ అని కూడా అంటారు. దక్షిణాదిన ఈ ఆచారం కొన్ని చోట్ల మాత్రమే జరుపుకుంటారు.