దీపావళి అంటేనే వెలుగుల పండగ. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఈ పండగంటే ఎంతో ఇష్టం. దీపాలు, టపాకాయలు, విద్యుత్ దీపాల అలంకరణలు, పూజలు, అందమైన రంగవల్లులు.. ఇవన్నీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని తెచ్చి పెడతాయి. ఇంత ప్రత్యేకమైన పండగకు మీ ఇంటిని అంతే స్పెషల్‌గా తీర్చిదిద్దకపోతే ఎలా చెప్పండి?. ప్రతి ఏడు జరుపుకునే పండుగ అయినా కొత్తగా చేసుకోవాలని ఉంటుంది. కదా! అందుకే.. మీకోసం సూపర్ డెకరేషన్ ఐడియాస్ తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వీటిపై ఓ లుక్కేయండి. నచ్చితే ఫాలో అయిపోండి.
పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపుతుంది. ఇంటిల్లిపాదిని కలుపుతుంది. కొత్త ఆశలు, ఆలోచనలను తెప్పిస్తుంది. ఈసారి కూడా దీపావళి పండుగ ఆనందాల్ని మోసుకుని వస్తోంది.దీపావళి పండగ అంటేనే.. దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అందుకు తగినట్లుగా ముందు ఇంటిని సర్దుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడంతోనే.. అప్పటి వరకూ ఉన్న పాత రూపురేఖలు మారతాయి
గుమ్మాల అలంకరణ
పండగకు ముందు రోజే.. గుమ్మాలు, తలుపులను పూలతో అలకరించుకోండి. పండగ వేళ పూలను మించిన డెకరేషన్ దేనితోనూ రాదు. మామూలుగా కాకుండా మామిడాకులతో చిలకలు, రకరకాల డిజైన్స్ చేసి మధ్య మధ్యలో పెడితే ఇంటికి కొత్త లుక్ వస్తుంది.
ప్లాస్టిక్ లైట్లు వద్దు
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఇంటా, బయటా వెలుగులు పూయిస్తాయి. అయితే ఈ మధ్య అందరూ ఎనర్జీ లైట్లు, వామ్ లైట్లు వాడటం మామూలైంది. వాటికి బదులుగా మట్టి దీపాలు వాడటమే మంచిది. దీపావళి నాడు మీ ఇంటిని అందమైన దీపాలు, రంగురంగుల లైట్లతో అలంకరించండి. మట్టి దీపాలకు మీకు నచ్చిన రంగులతో పెయింట్ చేసి ఉంచితే.. అవి మరింత ఆకర్షణగా ఉంటాయి ఇవి అద్భుతంగా కనిపిస్తాయి. దీపాలను టెంపరరీగా కాకుండా కడిగి దాచుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. వాటిపైడిజైన్లు కూడా వేసుకోవచ్చు. రోడ్డు పక్కన పేద వ్యాపారుల నుండి దీపాలను కొంటే వాళ్లు కూడా పండుగ హాయిగా జరుపుకుంటారు కదా.
వాకిట్లో రంగుల ముగ్గులు
ఇంటిముందు రంగుల ముగ్గులు వేయకుండా దీపావళి స్టార్ట్ కాదు . పండగ రోజు దీపాలు పెట్టేందుకు వీలుగా రకరకాల రంగులతో, పూలతో ముగ్గులు వేయండి. వాటిలో దీపాలు పెడితే లుక్ సూపర్‌గా ఉంటుంది.కాబట్టి రంగుల ఎంపికలో తగ్గారు. ఆయిల్ పెయింటింగ్లు ఎన్ని వేసినా అందంగా ఉండవు. అందుకే. పువ్వులు, సుద్దముక్కలు, పసుపు, కుంకుమలతో ముగ్గులు..డిజైన్లు వేయాలి.
రీసైక్లింగ్..
దీపావళికి చాలా మంది కొత్త సామాన్లు కొంటారు. అయితే వాటికన్నాముందు ఇంట్లో ఉన్న పాతవాటిని రీసైకిల్ చేయాలి. బట్టలను, కుర్చీలను వస్తువులను కస్టమైజ్ చేయడంద్వారా వాటికి కొత్త లుక్ ఇవ్వొచ్చు.
స్వీట్లు...
క్రాకర్స్ ఆకారంలో ఉండే వెరైటీ స్వీట్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. వాటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
గోడలపై మరకలు ఇలా మాయం
దీపావళి నాడు ఎక్కువ మంది పిట్ట గోడలపై దీపాలు పెడతారు. అలా పెట్టినప్పుడు దీపాల నుంచి నూనె కారి.. గోడలపై పడి మరకలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. దివ్వెల కింద ఆకు వేసి, అందులో కాస్త ఇసుకను పోసి, వాటిపై దివ్వెలు పెట్టి.. దీపాలు వెలిగించండి. అప్పుడు నూనెతో ఇబ్బంది ఉండదు. ఒకవేళ కారినా దాన్ని ఇసుక పీల్చుకుంటుంది.
ఫ్లోటింగ్ క్యాండిల్స్
ఈ పండుగ కోసం ప్రత్యేకంగా ఫ్లోటింగ్ క్యాండిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇత్తడి ఉర్లీలో పూలను అందంగా పేర్చి, ఆ మధ్యలో ఇలా ఫ్లోటింగ్ క్యాండిల్స్‌ను వెలిగించి పెట్టండి. హాల్లో దీనిని పెట్టుకుంటే దీపపు కాంతులతో ఇల్లు వెలిగి పోతుంది. మనసుకూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
రంగు కాగితాలతో డిజైన్స్
కలర్ పేపర్స్ తెచ్చి.. పేపర్ పువ్వులు, దీపాలుగా కత్తిరించండి. వాటిని తోరణాల మాదిరిగా దారానికి అంటించి వేలాడదీయండి. ఇంకా.. ఈ పేపర్లతో రకరకాల లాంతర్ డిజైన్లు తయారు చేసి.. వాటి లోపల లైట్లు అమర్చండి. ఇలా చేస్తే.. మీ ఇంటి లుక్కే మారిపోతుంది.