భారతీయ పండుగల్లో దీపావళి (Diwali 2023)ది ప్రత్యేక స్థానం. దీపావళి రోజు ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజిస్తారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు పంచుతూ ఆహ్లాదకరంగా పండుగ వేడుకలు జరుపుకుంటారు. దీపావళి అనగానే ముఖ్యంగా పిల్లల్లో ఎనలేని ఉత్సాహం వస్తుంది. దానికి ప్రధాన కారణం టపాసులే. అయితే పటాకులు కాల్చడంపై పిల్లలకు అవగాహన లేక ఎంతోమంది గాయాల పాలవుతున్నారు. పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. ఇప్పుడు ఆ జాగ్రత్తలేవో తెలుసుకుందాం, , ,
పటాకులు కాల్చేటప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయి. బాణసంచాలను ఇంటిలో కాల్చకూడదు. ఇంటికి దూరంగా బహిరంగ ప్రదేశాలలో కాల్చడం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. పటాకులు కొన్నిసార్లు పేలకుండా ఆగిపోతాయి. వాటిని వెంటనే వెళ్లి పట్టుకోవడం లాంటివి చేయకూడదు. ముందుగా వాటిపై నీటిని పోయడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. అల్కహాల్, శానిటైజర్‌లను వాడాక పటాకులను వెలిగించకూడదు. దీపావళి రోజు శానిటైజర్ వాడకపోవడం మంచిది. పటాకుల పైన ఇచ్చిన సలహాలు సూచనలను ఖచ్చితంగా చదివి పాటించాలి. మంటలు అంటుకునే ప్రదేశాలు, కరెంటు తీగలు, ఎండు గడ్డి, పూరి గుడిసెలు ఉన్న ప్రదేశాలలో పటాకులు కాల్చకూడదు. పటాకులను కాల్చి రోడ్డు మీద పడేయడంతో దారి వెంట వెళ్లే వారికి ప్రమాదం కలగవచ్చు.
రాకెట్లు, సుతిల్ బాంబులుచ చిచ్చుబుడ్లు కాలుస్తుంటే భలే అనిసిస్తుంది. కాని అవి కాల్చేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే పిల్లలు, పెద్దలు పటాకులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
ALSO READ : Diwali Special : పండగొచ్చింది కదా.. ఇంటి డెకరేషన్ ట్రెడిషనల్గా
క్రాకర్స్ కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దవాళ్లు పక్కన నిలబడి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కాల్చుకొనే ప్రమాదం ఉంటుంది.
- పటాకులు కాల్చేటప్పుడు కాటన్ డ్రస్ లనే వేసుకోవాలి. దీపాలకు దూరంగా నిలబడాలి.
- గడ్డివాములు, పశువుల పాకలు, గుడిసెలు, పెట్రోల్ బంక్ ల దగ్గర పటాకులు కాల్చొద్దు.
- వెలిగించాక కాలని వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం చేయవద్దు. ఒక్కోసారి అవి చేతిలోకి తీసుకోగానే పేలే ప్రమాదం ఉంది.
- నీళ్ల బకెట్ పక్కన పెట్టుకోవాలి... చెప్పులు వేసుకొని బాంబులు కాల్చాలి.
- బాంబులు కాల్చేటప్పుడు... కాల్చిన తరువాత చేతులను ముక్కులో, నోట్లో పెట్టుకోవద్దు.
- అగ్గిపుల్లలకు బదులు కొవ్వొత్తులు, అగర బత్తులతో పటాకులు వెలిగించాలి.
- సర్టిఫైడ్ షాపుల నుంచే పటాకులు కొనాలి..గ్యాస్ స్టవ్, కిరోసిన్ పొయ్యిల దగ్గర వాటిని పెట్టకూడదు. జేబుల్లో పటాకులు పెట్టుకొని తిరగొద్దు.
- పండుగరోజు మట్టి దీపాలతో పాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని అలంకరిస్తారు. కాబట్టి అలంకరించే లైట్ల వైర్లు సరిగా ఉన్నాయా.. లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి.
- బట్టలపై నిప్పురవ్వలు పడితే అవి రాజుకోకుండా వెంటనే ఒంటిపై దుప్పటి కప్పాలి. లేదా నేలపై అటు ఇటూ దొర్లించాలి.
- చేతులకు శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించడం, క్రాకర్స్ కాల్చడం వంటివి చేయవద్దు. ఒకవేళ అలా చేస్తే చేతులకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది టపాసులు కాల్చేటప్పుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం మంచిది. తద్వారా నిప్పు రవ్వలు కళ్లలో పడకుండా ఉంటుంది.
- మద్యం సేవిస్తూ బాణసంచా కాల్చవద్దు. మద్యానికి మండే గుణం ఉంటుందనే విషయం మరవద్దు.
- గాజు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.