దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అవిశ్వాసం

సియోల్: సౌత్ కొరియాలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. మంగళవారం ఎమర్జెన్సీ విధించి, కేవలం ఆరు గంటల్లోనే దాన్ని ఎత్తేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆయన పదవికే ఎసరు పెట్టింది. దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు.. బుధవారం పార్లమెంట్‎లో అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రెసిడెంట్ పదవికి యూన్ సుక్ యోల్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశాయి. 

అభిశంసన తీర్మానంపై శుక్రవారం ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆరోపిస్తూ మంగళవారం సాయంత్రం యూన్‌ సుక్‌ యోల్‌ దేశంలో 'మార్షల్‌ లా' విధించారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం డెమొక్రాటిక్ పార్టీ, 5 చిన్న ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. వెంటనే 190 మంది సభ్యులతో  పార్లమెంట్ సమావేశం నిర్వహించి.. ఎమర్జెన్సీ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి. దానిని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.