కామారెడ్డి, వెలుగు : స్కూల్ఘటనలో రెండు కేసులు నమోదు చేశామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. ఆరేండ్ల స్టూడెంట్‌పై అసభ్యంగా ప్రవర్తించిన కామారెడ్డి లోని జీవదాన్ స్కూల్ పీఈటీ నాగరాజుపై విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బుధవారం టౌన్పోలీస్స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. బాలికపై గాయాలు లేవని, పాప ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. కొందరు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పారు.
మంగళవారం జీవదాన్ స్కూల్‌వద్ద , పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఘటనలపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. మొత్తం నలుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేసిన ఇద్దరిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు పాల్గొన్నారు.
పోలీసు బలగాల మోహరింపుకామారెడ్డిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాతో పాటు నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కాగా కామారెడ్డి జీవదాన్ స్కూల్ ఘటనను నిరసిస్తూ బుధవారం బంద్‌కు పిలుపు ఇవ్వడంతో విద్యా సంస్థలు మూతపడ్డాయి.