మద్దతు ధరతోపాటే బోనస్​

  • తరుగు, కడ్తా తీస్తే సీరియస్​ యాక్షన్​
  •  జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి 

నిజామాబాద్/ఎడపల్లి​, వెలుగు: కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మిన రైతులకు మద్దతుధరతో పాటు బోనస్​కలిపి రశీదులు ఇస్తామని జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బోనస్​ విషయంలో రైతులు ఎలాంటి అపొహలకు గురి కావద్దన్నారు. ధాన్యాన్ని కాంటా వేసిన తర్వాత వడ్లను తరలించడానికి ముందే అగ్రికల్చర్​ ఆఫీసర్​ సంతకంతో బిల్లు రైతుల చేతికి అందిస్తున్నట్టు తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని బోధన్, ఆర్మూర్​, రూరల్​ సెగ్మెంట్లలో పర్యటించి వడ్ల కొనుగోళ్లు పరిశీలించారు. అనంతరం నిజామాబాద్​కలెక్టరేట్​లో ఆయన ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

వడ్ల కొనుగోలులో దళారులకు తావులేదన్నారు. తరుగు, కడ్తా పేరుతో కోత పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్​ ఇచ్చారు. ప్రతి కొనుగోలు సెంటర్​ వద్ద సూపర్​వైజింగ్​ఆఫీసర్​ను నియమించాలని, రైతుల నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించాలని ఆదేశించారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన తప్పులు రిపీట్​ కావొద్దన్నారు. డిఫాల్ట్​ లిస్టులోలేని రైస్​ మిల్లులకు మాత్రమే వడ్లు పంపాలని సూచించారు.

 మిల్లింగ్​ చేసిన వెంటనే బియ్యం పౌరసరఫరాల గోదాంకు చేరేలా ఏర్పాట్లు చేయాలన్నారు.  జనవరి నుంచి రేషన్​ కార్డులకు సన్నబియ్యం సరఫరా చేయనున్నందున ప్రతి గింజ విలువైనదేనన్నారు. లెవీ టార్గెట్​కు విఘాతం కలిగించే మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్​వోఆర్​) ప్రయోగించాలన్నారు. డిఫాల్ట్​ మిల్లర్లపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై తనకు రిపోర్ట్​ ఇవ్వాలన్నారు. 

అక్రమాలు లేకుండా రైతుభరోసా

కాంగ్రెస్​, టీడీపీ ప్రభుత్వాలు 75 ఏండ్లలో రూ.60 వేల కోట్ల అప్పులు చేస్తే పదేండ్ల బీఆర్​ఎస్​ సర్కారు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని మంత్రి దుయ్యబట్టారు. కేసీఆర్​ చేసిన అప్పులపై ప్రతి నెలా రూ.6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. తీవ్రమైన ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్,మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రూ.500 లకు వంట గ్యాస్, రైతులకు పంట రుణాల మాఫీ అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. అర్హులైన రైతులకు త్వరలోనే రైతు భరోసా అందిస్తామన్నారు. సుమారు 20 వేల కోట్లతో మొదటివిడతలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రతిపక్షాలు కుట్రతో సీఎం రేవంత్​రెడ్డి సర్కారును బదనామ్​ చేస్తున్నాయన్నారు.

 ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, డాక్టర్​ భూపతిరెడ్డి, పైడి రాకేశ్​ ​రెడ్డి, కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఐడీసీఎంఎస్​ చైర్మన్​ తారాచంద్​, ఉర్దూ అకాడెమీ చైర్మన్​ తాహెర్​, అదనపు కలెక్టర్లు​ అంకిత్​, కిరణ్​కుమార్​, బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో, నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

రింగ్​ రోడ్​ లీజుకిచ్చి   రైతుబంధు ఇచ్చారు

అబద్ధమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా : జూపల్లి రాష్ట్రానికి అక్షయపాత్రలా ఇన్​కం తెచ్చిపెట్టే ఔటర్​ రింగ్​ రోడ్​ కాంట్రాక్ట్​ను 35 ఏండ్ల కాలానికి  అగ్గువకు గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ లీజుకిచ్చిందని  మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.  ఆ సొమ్మును అసెంబ్లీ ఎలక్షన్​కు ముందు రైతుబంధు కింద చెల్లించి గొప్పలు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. ఇది అబద్ధమని కేసీఆర్​, కేటీఆర్​ నిరూపిస్తే మంత్రి పదవికి రిజైన్​ చేస్తానని సవాల్​ చేశారు. గురువారం డిచ్​పల్లి మండలంలోని మెట్రాజ్​పల్లిలో వడ్ల కొనుగోలు సెంటర్​ విజిట్​ చేసిన ఆయన  మాట్లాడారు. 

ఔటర్​ రోడ్​ ఇన్​కం ఇప్పుడు యాడాదికి రూ.700 కోట్లు ఉంది. మరో సంవత్సరం రూ.వెయ్యి కోట్లు తరువాతి ఏడు రూ.2 వేల కోట్లకు పెరుగుతుంది. అంటే ఐదేండ్ల కాలంలో సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు చేర్చే అక్షయపాత్ర అది. అంతటి ఇన్​కం తెచ్చిపెట్టే రింగ్​ రోడ్​ను 35 సంవత్సరాల కాంట్రాక్టుపై కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని జూపల్లి నిందించారు.  గుట్టలు, పుట్టలు, కోటీశ్వరులకు రూ.25 వేల కోట్లను రైతుబంధు పేరుతో ప్రజల సొత్తను దరాదత్తం చేశారని విమర్శించారు.