బోధన్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు

  •     ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి 
  •     జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  రోగులకు సూచించారు. ఆదివారం బోధన్ లో ఆయన డయాలసిస్​ కేంద్రాన్ని  ప్రారంభించారు. 

కలెక్టర్ డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రోజూ ఇరవై మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని , ఒకేసారి ఏడుగురు రోగులకు కూడా డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ కు డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషంట్లను పలకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి మాట్లాడారు. 

అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ..  రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని డాక్టర్లకు సూచించారు.  డాక్టర్ల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు.  వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు.  వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ కె. గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఆర్ఎంఓ డాక్టర్ అబ్దుల్ రహీం ఉన్నారు.