స్టూడెంట్లు సైన్స్ పై పట్టు సాధించాలి : ఆదర్శ్ సురభి

  • వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి టౌన్, వెలుగు: గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైన్స్ పై పట్టు సాధించాలని, వారిని టీచర్లు ప్రోత్సహించాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు సరైన సైన్స్  కిట్స్  అందుబాటులో లేకపోవడంతో సబ్జెక్ట్ లో వెనుకబడి పోతుంటారన్నారు. 

సైన్స్  పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా టీచర్లు చొరవ తీసుకోవాలన్నారు. స్టూడెంట్లలో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జిల్లాలోని  అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ కిట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా విద్యాపరంగా వనపర్తి జిల్లా ముందు ఉందని, వైజ్ఞానిక పరంగా ముందంజలో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. జిల్లా విద్యార్థులు భవిష్యత్తులో ఐఐటీ, ఎయిమ్స్  వంటి కాలేజీల్లో సీట్లు సంపాదించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 

డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ మూడు రోజుల పాటు సైన్స్  ఫెయిర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ 12వ ఇన్స్పిరేషన్  అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని డిసెంబర్  మొదటి వారంలో జరిగే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కు పంపిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఇన్స్పిరేషన్  అవార్డుల్లో మొదటి స్థానం పొందిన వారికి స్కాలర్ షిప్  వస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లను కలెక్టర్  పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్  చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, జిల్లా సైన్స్  ఆఫీసర్  శ్రీనివాస్  పాల్గొన్నారు.

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలి

దివ్యాంగులు అన్నిరంగాల్లో  రాణించాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడా పోటీలను కలెక్టర్​ ప్రారంభించారు. ట్రై సైకిల్ రేస్, చెస్, క్యారమ్, షార్ట్ పుట్  పోటీలను తిలకించారు. విజేతలకు డిసెంబర్ 3 న జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. డీడబ్ల్యూవో లక్ష్మమ్మ, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, మున్సిపల్  కమిషనర్  పూర్ణచందర్, తహసీల్దార్  రమేశ్ రెడ్డి పాల్గొన్నారు.