ఓటింగ్​​ శాతం పెంపుపై యంత్రాంగం ఫోకస్​

  • అత్యల్పంగా నమోదైన కేంద్రాలపై ​స్పెషల్​ నజర్​
  • స్వీప్​ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు
  • కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ 

కామారెడ్డి, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటింగ్​ శాతాన్నిపెంచడంపై జిల్లా యంత్రాంగం ఫోకస్​ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్​ నమోదైన కేంద్రాలను గుర్తించి వీటి పరిధిలోని ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 50 శాతం పోలింగ్​ నమోదైన కేంద్రాలను గుర్తించారు. ఈ పోలింగ్​ కేంద్రాల్లో సిస్టమెటిక్​ ఓటర్స్​ ఎడ్యుకేషన్​ అండ్​ ఎలక్టోరల్​ పార్టీసిపేషన్​ (స్వీప్​) ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1,049 పోలింగ్​ కేంద్రాలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 83.16 శాతం, జుక్కల్​లో 81.86 శాతం, బాన్సువాడలో 81.26 శాతం, కామారెడ్డిలో 74.86 శాతం పోలింగ్​ నమోదైంది.  వీటి పరిధిలోని 10  పోలింగ్​ కేంద్రాల్లో అత్యల్పంగా ఓటింగ్​ శాతం నమోదైంది. ఈ పోలింగ్​ కేంద్రాల్లో పార్లమెంట్​ఎన్నికల్లో పోలింగ్​ శాతాన్ని పెంచాలని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో జిల్లా యంత్రాంగం 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. ఓటర్లందరూ ఓటుహక్కు వినియోగించుకోవడం, ఈవీఎంల వినియోగంపై స్వీప్​ ద్వారా ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులు, కాలేజీల్లో యువతకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

కలెక్టర్​, ఎస్పీ చొరవ

పోలింగ్​ శాతం పెంచడంపై కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​, ఎస్పీ సింధూ శర్మ స్పెషల్ ఫోకస్​ పెట్టారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ ​కాలనీలో (255 పోలింగ్​ కేంద్రం), వడ్డెర కాలనీలో (214 పోలింగ్​ కేంద్రం)లో స్థానికులతో మీటింగ్​ నిర్వహించి  ఓటుహక్కు ఆవశ్యకతను వివరించారు. ఆయా కేంద్రాల్లో ఓటింగ్​ శాతం తక్కువగా ఉండడానికి కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కిరాయిదారులు, ఇతర ఏరియాల్లో ఉంటున్న వారు ఓటేసేందుకు రాకపోవడంతో తక్కువ ఓటింగ్​ నమోదైందని అభిప్రాయానికి వచ్చారు.

ఒకే ఇంట్లోని వ్యక్తులకు వేర్వేరు పోలింగ్​ కేంద్రాల్లో ఓట్లు రావడం, చనిపోయిన వ్యక్తులతో పాటు, కొందరికి రెండు చోట్ల ఓట్లు ఉండడం కూడా పోలింగ్​ శాతం తగ్గడానికి కారణాలుగా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదై ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు. 80 ఏండ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేసేలా అవగాహన కల్పిస్తున్నారు.

గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఇలా..

2019 పార్లమెంట్​ ఎన్నికల్లో జహీరాబాద్​ సెగ్మెంట్​లో 69.67 శాతం ఓటింగ్​ శాతం నమోదైంది. 14,97,992 మంది ఓటర్లకు గాను 10,43,704 మంది మాత్రమే ఓట్లేశారు. ఈ సారి కామారెడ్డి నియోజకవర్గంలో 2,54,271 మంది, ఎల్లారెడ్డిలో 2,21,790, జుక్కల్​లో 2,01,230, బాన్సువాడలో 1,95,394 మంది ఓటర్లున్నారు. వీరంతా ఓటు వేసేలా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.