ట్రస్టుబోర్డు ఏర్పాటు ఎన్నడు?

  • గతంలో పట్టించుకోని బీఆర్​ఎస్​ సర్కారు..  14 ఏళ్లుగా ఆశావహుల నిరీక్షణ

భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ట్రస్టుబోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. చాలా ప్రసిద్ధి పొందిన భద్రాచల రాముల గుడికి పాలకవర్గం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత  రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆలయ ట్రస్ట్​బోర్డ్​ ఏర్పాటు గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. స్థానిక పార్టీ నేతలు  అప్పటి ప్రభుత్వ పెద్దలను కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం దక్కలేదు.  చాలామంది ఆశావహులు ఈ పదవుల కోసం ఎదురుచూపులు చూసి విసిగిపోయారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో   2010 నవంబరు 26న చివరి సారి భద్రాచలం ఆలయానికి కురిచేటి పాండురంగారావు అధ్యక్షులుగా ట్రస్టుబోర్డు ఏర్పడింది.  ఈ పాలకవర్గం 2012 నవంబరు 25 వరకు కొనసాగింది. ఆతర్వాత ఆలయానికి ట్రస్ట్​బోర్డు లేదు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేయడం మొదలుపెట్టింది.  రాష్ట్రంలోని  ప్రధాన దేవాలయాలకు పాలకవర్గాలను కూడా  ఏర్పాటు చేస్తారన్న ఆశాభావంతో  ఆ పార్టీ  లీడర్లు ఉన్నారు.  

ఇప్పటి వరకు 13 పాలకమండళ్లు

 భద్రాచలంలో  శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాన్ని 17వ శతాబ్ధంలో భక్త రామదాసు నిర్మించారు. 1960లో ఈ ఆలయం  ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పటి దేవాదాయ శాఖమంత్రి  కల్లూరి చంద్రమౌళిఆలయానికి మొదటి చైర్మన్​గా  వ్యవహరించారు. ఆ తర్వాత బండి శోభనాచలం, ఎన్​.యతిరాజారావు, అల్లూరి మూర్తిరాజు, కోనేరు నాగేశ్వరరావు, బోళ్ల వెంకటేశ్వర్లు, కత్తుల శాంతయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కురిచేటి పాండురంగారావు  ట్రస్టుబోర్డు చైర్మన్లుగా పనిచేశారు. పాలకవర్గా పదవీకాలం తొలుత మూడేళ్లుండగా.. ఆతర్వాత     ఏడాది తగ్గించారు.  కొంతకాలానికి దాన్ని  రెండేళ్లకు పెంచారు.

 తెలంగాణ ఆవిర్భవించాక ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటే జరగలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రచారం జరుగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి  టీటీడీ తరహాలో కమిటీని ఏర్పాటు చేయాలని  సీఎం రేవంత్​రెడ్డి ఎండోమెంట్​ ఆఫీసర్లను ఆదేశించారు. భద్రాచలం దేవస్థానానికి కూడా ఆలయ అభివృద్ధికి  అవసరమయ్యే భూ సేకరణ కోసం రూ.60.20కోట్లు సీఎం రిలీజ్​ చేశారు.  ఆలయ అభివృద్ధితో పాటు పాలకవర్గ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందని లీడర్లు చెప్తున్నారు.  

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్ష పదవిని చాలామంది లీడర్లు ఆశిస్తున్నారు. వారంతా  జిల్లా మంత్రుల  ద్వారా తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  సూచించిన వారికే ఈ పదవి దక్కనుంది. దీంతో ఆశావహులు వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.  గతంలో ట్రస్టుబోర్డు సభ్యులుగా పనిచేసిన వారు, ఇటీవల ఎన్నికల్లో యాక్టివ్​గా పనిచేసిన లీడర్లు పదవి మీద ఆశలు 
పెంచుకుంటున్నారు.