సూర్యాపేటలో చల్లారని అవిశ్వాస చిచ్చు

  • సూర్యాపేటలో చల్లారని అవిశ్వాస చిచ్చు
  • కౌన్సిలర్​ గండూరి పావని ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్ల ధర్నా
  • వారిపై చైర్​పర్సన్ అన్నపూర్ణ, బీఆర్ఎస్ నాయకుల దాడి

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయినప్పటికీ, ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఆదివారం అసమ్మతి కౌన్సిలర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అవిశ్వాసం వీగిపోవడానికి 45వ వార్డు కౌన్సిలర్​గండూరి పావని కారణమంటూ 31 మంది అసమ్మతి కౌన్సిలర్లు నిరసనకు దిగారు. పావని ఇంటిపై దుమ్మెతి పోసి, కోడి గుడ్లు విసిరారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టిన తర్వాత అమ్ముడు పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి జగదీశ్​రెడ్డిని తిట్టి, పార్టీలో నుంచి బయటికి వచ్చేసిన పావని రూ.50 లక్షలకు అమ్ముడుపోయారని, కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి కౌన్సిలర్​ను ప్రలోభాలకు గురిచేసి, అవిశ్వాసం విగిపోయేలా చేశారని ఆరోపించారు. కౌన్సిలర్​పావని అక్కడి రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలంటూ.. పావని ఇంటి లోపలికి వెళ్లేందుకు అసమ్మతి కౌన్సిలర్లు ప్రత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కౌన్సిలర్​పావనిని ఇంట్లోకి పంపించేశారు. ఆగ్రహానికి లోనైన అసమ్మతి కౌన్సిలర్లు పావని వెంటనే బయటికి రావాలంటూ ఇంటి ముందు బైఠాయించారు.

అదే టైంలో కౌన్సిలర్​పావనికి మద్దతుగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చైర్ పర్సన్ అన్నపూర్ణ, ఆమె అనుచరులు 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిలారెడ్డిపై దాడిచేశారు. ఆమె తలకు గాయాలయ్యాయి. అందరినీ బొంద పెడతామంటూ బీఆర్ఎస్​ నాయకులు వార్నింగ్ ఇవ్వడంతో, అసమ్మతి కౌన్సిలర్లు ఎదురుదాడికి దిగారు. పోలీసులు అడ్డుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అసమ్మతి కౌన్సిలర్లు, కౌన్సిలర్​పావని, బీఆర్ఎస్​నాయకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్​లో లో ఫిర్యాదు చేసుకున్నారు. దాడిలో గాయపడిన నిఖిలను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..

పేట మున్సిపాలిటీలోని కౌన్సిలర్ల సంఖ్య 48. చైర్​పర్సన్​అన్నపూర్ణ, వైస్​చైర్మన్​పుట్టా కిశోర్​పై పెట్టిన అవిశ్వాసం నెగ్గాలంటే 32 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. ఉన్న 30 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలోని 16 మంది చైర్​పర్సన్, వైస్​చైర్మన్​పై అసమ్మతితో ఉన్నారు. వారు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల కౌన్సిలర్ల మద్దతు కూడగట్టారు. అలా 32 మంది కౌన్సిలర్లు కలిసి అవిశ్వాసానికి తెరలేపారు. అయితే బీఎస్పీకి చెందిన 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ చివరి నిమిషంలో మీటింగ్​కు వెళ్లకపోవడంతో అవిశ్వాసం వీగింది. 

చైర్మన్ పదవి ఇవ్వనందుకే ఓటింగ్​కు వెళ్లలేదు

అగ్రవర్ణాలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం ఇష్టం లేకనే తాను అవి శ్వాస తీర్మాన సమావేశానికి దూరంగా ఉన్నానని కౌన్సిలర్​గండూరి పావని కృపాకర్ తెలిపారు. తనకు చైర్​పర్సన్​పదవి ఇవ్వాలని అడిగానని, అందుకు నిరాకరించడంతోనే మద్దతు విరమించుకున్నట్లు స్పష్టం చేశా రు. తన ఇంటిపై అమానుషంగా దాడి చేశారని, బాధ్యులను శిక్షించాలని కోరారు. త్వరలోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెల్లడించారు.