యూపీఎస్ స్కీమ్ పై ఉద్యోగుల్లో నిరాశ​

‘ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసాన్నిచ్చే పథకం’ అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్ణించారు. నిజంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంత గొప్పదా?  పాత పెన్షన్ విధానం కన్నా మెరుగైనదా అని వివరంగా పరిశీలిస్తే యూనిఫైడ్ పెన్షన్ విధానం ఏ రకంగా చూసినా పాత పెన్షన్ విధానం కన్నా మెరుగైనది కాదు. అందుకనే కార్మిక , ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంగా యూపీఎస్ ను తిరస్కరిస్తూ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని కోరుతున్నారు. పాత పెన్షన్ విధానానికి, జాతీయ పెన్షన్ విధానానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మధ్యే మార్గంగా ఉంటుందనీ ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్​గా పిలిచే పాత పెన్షన్ విధానం 1920 నాటికి ఉన్న కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కు ప్రత్యామ్నాయంగా రూపొందింది. 1957లో  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తప్పనిసరిగా ఈ పెన్షన్ ను అమలు చేశారు.  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధానాన్ని అనుసరించాయి.  సుప్రీంకోర్టు 1982లో డిఎస్ నకార కేసులో తీర్పునిస్తూ ‘ఉద్యోగికి వయస్సు పైబడి, మానసిక, శారీరక శక్తులు సన్నగిల్లి, ఆదా చేసిన సొమ్ముపై ఆధారపడి బతకాల్సిన స్థితిలో ఆర్థిక భద్రతనిచ్చేదే పెన్షన్’  అంటూ ‘ఇది యజమాని ఇచ్చే భిక్ష కాదు.  పరిహారపు చెల్లింపు అంతకన్నా కాదు, అది సామాజిక భద్రతా చర్య’ అని చెప్పింది.

ఏకీకృత పెన్షన్‌‌ పథకం

ఈ విధానం జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌‌పీఎస్)‌‌తో పోలిస్తే.. ఏకీకృత పెన్షన్ విధానం  (యూపీఎస్)‌‌ ఉద్యోగులకు పెన్షన్​ హామీని పెంచుతూ.. గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలకు భరోసా ఇవ్వనుంది.  కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్‌‌ అయ్యేవారికి పదవీ విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్‌‌ పే+డీఏ మొత్తం సగటులో 50% పింఛన్‌‌గా వస్తుంది. కనీసం 10 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకుని,  రిటైర్‌‌ అయ్యేవారికి వారి సర్వీసు కాలాన్ని బట్టి పింఛన్‌‌ వస్తుంది.  ఇది 25 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారితో పోలిస్తే.. తక్కువగా ఉంటుంది. అంటే.. పెన్షన్​ హామీ కనీసం రూ.10 వేలుగా ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే.. పెన్షన్‌‌లో 60% ఆయన/ఆమె కుటుంబ సభ్యులకు నెలవారీ పెన్షన్​గా అందుతుంది.  డీఆర్‌‌ కూడా లభిస్తుంది.  ఉద్యోగి రిటైర్‌‌ అయ్యాక  గ్రాట్యుటీతోపాటు అదనపు ప్రయోజనాలుంటాయి. 

జాతీయ పెన్షన్‌‌ పథకం

అటల్‌‌ బిహారీ వాజ్‌‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కొత్త పెన్షన్ విధానాన్ని (జాతీయ పెన్షన్ విధానం) అమల్లోకి వచ్చింది. ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంతమొత్తం వెచ్చించడం.. చివరకు వచ్చే పెన్షన్‌‌ చాలా తక్కువగా.. కొన్ని సందర్భాల్లో వితంతు, వృద్ధాప్య పింఛన్ల కంటే తక్కువగా ఉంటుంది.  ఈ పెన్షన్‌‌ స్కీమ్‌‌ను కేంద్రంలో జాతీయ పింఛన్‌‌ పథకం(ఎన్‌‌పీఎస్‌‌)గా.. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌‌ స్కీమ్‌‌ (సీపీఎస్‌‌)గా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10% ఉద్యోగి, 10% ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. తర్వాత ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచారు. ఈ మొత్తాన్ని 100% ఎస్‌‌బీఐ, యూటీఐ, ఎల్‌‌ఐసీ షేర్లలో పెట్టేవారు. షేర్‌‌ విలువను బట్టి పెన్షన్‌‌లో రిటర్న్స్‌‌ చేరేవి.  

రిటైర్‌‌ అయ్యాక.. పొదుపు చేసిన దాంట్లో 60% ఏక మొత్తం‌‌గా ఇస్తారు. మిగతా దాంట్లో 40శాతాన్ని నెలవారీగా సమాన విలువగట్టి పెన్షన్​గా అందజేస్తారు. అంటే.. తీసుకునే జీతానికి.. చివరి బేసిక్‌‌ పేతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ. సర్వీసును బట్టి.. కొన్ని సందర్భాల్లో రూ.2వేలు.. అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు.  యూపీఎస్‌‌ కుటుంబ పెన్షన్‌‌ కింద 60శాతం పెన్షన్‌‌ అంటే 50శాతంలో 60శాతం.  అంటే 25ఏళ్ల సర్వీసు కలిగిన వ్యక్తి రిటైరైతే చివరి వేతనంలో 30శాతం అని అర్థం. కనీస పెన్షన్‌‌ రూ.10వేలు కలిగిన ఉద్యోగులకు అందులో 60శాతం ఉంటుంది. అంటే రూ.6వేలు వస్తుంది. కనీస పెన్షన్‌‌ రూ.10వేలు అనేది కేవలం పదవీ విరమణ చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అది కుటుంబ పెన్షన్‌‌గా రాదు. కానీ పెన్షనర్‌‌ రిటైరైన తర్వాత ఏడేళ్లులోగా లేదా 67ఏళ్ళ వయస్సుకు ముందుగా మరణిస్తే ఆ వ్యక్తి చివరి వేతనంలో 50శాతం కుటుంబ పెన్షన్‌‌గా ఒపిఎస్‌‌ కింద వస్తుంది. ఆ తర్వాత కుటుంబ పెన్షన్‌‌ చివరి వేతనంలో 30శాతంగా ఉంటుంది.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

 ఒపిఎస్‌‌లో పెన్షనర్‌‌ లేదా కుటుంబ పెన్షనర్‌‌ 80 ఏండ్ల వయస్సు పూర్తి చేసుకుంటే అదనంగా 20శాతం పెన్షన్‌‌, 85ఏండ్లు పూర్తి చేసుకుంటే 30శాతం, 90ఏండ్లు పూర్తి చేసుకుంటే 40శాతం, 95ఏండ్లు పూర్తి చేసుకుంటే 50శాతం, వందేండ్లు పూర్తి చేసుకుంటే వంద శాతం ఇస్తారు. అదనపు పెన్షన్‌‌కు అదే డీఏ కూడా ఇస్తారు. యూపీఎస్‌‌లో ఈ అదనపు పెన్షన్‌‌ అందుబాటులో లేదు.  వేతన కమిషన్‌‌ సిఫార్సులు అమలు జరిగినప్పుడల్లా ఒపిఎస్‌‌లో పెన్షన్‌‌,  కుటుంబ పెన్షన్‌‌,  కనీస పెన్షన్‌‌ సవరించబడుతుంది. యూపీఎస్‌‌లో ఇలాంటి హామీ లేదు. పెన్షన్‌‌ కమ్యూటేషన్‌‌ అంటే 40శాతం పెన్షన్‌‌ను ముందుగానే తీసుకోవడం ఒపిఎస్‌‌లో  ఉంది.  యూపీఎస్‌‌లో లేదు. మరణించిన లేదా ఇన్‌‌వాలిడ్‌‌గా మారిన ఉద్యోగులందరూ ఎన్‌‌పిఎస్‌‌లో అన్‌‌ఫిట్‌‌ అవుతారు. ఏకీకృత పెన్షన్ విధానంలో ప్రభుత్వ వాటాను 18 శాతానికి పెంచడంతో ఖజానాకు పెన్షన్ నిధులు భారంగా మారనున్నాయి. 

అదే సమయంలో పెట్టుబడిదారీ వర్గాలకు, అంతర్జాతీయ పెట్టుబడులకు నిధుల లభ్యత పెరుగడంతో వారికే లాభం కలుగుతుంది. అందువల్ల నాన్‌‌ కంట్రిబ్యూటరీ డిఫైన్డ్‌‌ అస్యూర్డ్‌‌ పాత పెన్షన్‌‌ పథకాన్ని పునరుద్ధరించాలని, ఏకీకృత పెన్షన్ విధానం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీలు ఇచ్చింది. ఆ మేరకు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసింది.  కర్నాటక,  తెలంగాణ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది . ఈ నేపథ్యంలో ఏకీకృత పెన్షన్ విధానానికిదేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ ఆందోళనకుసిద్ధమవుతున్నాయి.

ALSO READ : ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : సునీత కుంచాల

పాత పెన్షన్‌‌ విధానమే మేలు

ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండానే భవిష్యత్‌‌కు (ఓపీఎస్)‌‌ పాత పెన్షన్‌‌ విధానం భద్రత కల్పిస్తుంది. పెన్షన్‌‌దారుడు మరణిస్తే.. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా.. పూర్తి పెన్షన్‌‌ వస్తుంది. పాత పెన్షన్‌‌ పథకం కోసం ఉద్యోగి జీతంలో ఎలాంటి కోతలు ఉండవు. ఒక ఉద్యోగి రిటైర్‌‌ అయ్యే సమయానికి చివరి నెలలో తీసుకున్న బేసిక్‌‌ వేతనంలో 50శాతాన్ని నెలసరి పెన్షన్​గా నిర్ధారిస్తారు.  దీంతోపాటు.. కరువు భత్యం(డీఏ) ఉంటుంది. ప్రభుత్వో ద్యోగులకు ఎప్పుడు డీఏ పెరిగినా.. అది పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్‌‌)గా వస్తుంది.

 వేతన సవరణ కమిషన్‌‌(పీఆర్సీ) సిఫా రసులు కూడా అమలవుతాయి. ఈ విధానంలో పెన్షన్‌‌ మొత్తం క్రమంగా పెరిగే అవకాశాలుంటాయి.  డీఏ, పీఆర్సీ ఎంత శాతం పెరిగితే.. పెన్షన్​ మొత్తం కూడా అంతే శాతం పెరిగేది. ఈ పథకానికి అనుబంధంగా సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్‌‌) వంటివి పదవీ విరమణ ప్రయోజనాలుగా ఉండేవి. పాత పెన్షన్‌‌ విధానంలో ఓ ఉద్యోగి రిటైర్‌‌ అయ్యాక రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ వచ్చేది. ఓపీఎస్‌‌ అనేది ప్రభుత్వ ఖజానా నుంచి అందేది. పెన్ష నర్‌‌ చనిపోతే.. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయిలో  పెన్షన్​ ప్రయోజ నాలు అందేవి. పాత పెన్షన్‌‌ విధానంలో ఇంటి నిర్మాణానికి, పిల్లల పెండ్లికి పీఎఫ్‌‌ నుంచి విత్‌‌డ్రాకు వెసులుబాటు ఉంటుంది. 




కే. వేణుగోపాల్ 
పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్