దోమల నియంత్రణకు కృషి చేయాలి : రవీందర్ నాయక్

  •     పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​  రవీందర్​ నాయక్​ పిలుపు
  •     బంజారాహిల్స్ గవర్నమెంట్​స్కూల్​లో డెంగ్యూపై అవగాహన

హైదరాబాద్, వెలుగు : దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి గురువారం ఆయన బంజారాహిల్స్ లో పర్యటించారు. పీహెచ్​సీ, ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాల్లో దోమలు, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా నివారణపై అవగాహన కల్పించారు. బంజారాహిల్స్ గవర్నమెంట్​స్కూలులో ఏర్పాటు చేసిన డెంగ్యూ అవగాహన కార్యక్రమంలో రవీందర్ నాయక్ పాల్గొని మాట్లాడారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని చెప్పారు. అనంతరం ఎన్​బీటీ నగర్ లో డెంగ్యూ బాధితుల ఇండ్లను సందర్శించారు. తగు సూచనలు చేశారు. డెంగ్యూ టెస్టులు ఎక్కడ చేయించుకుంటున్నారు? ఎప్పటి నుంచి డెంగ్యూతో బాధపడుతున్నారు తదితర వివరాలు తెలుసుకున్నారు. బంజారాహిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోజువారీ ఓపీలు, జ్వరం, డెంగ్యూ కేసుల రికార్డులను పరిశీలించారు.

దోమల నివారణకు, డెంగ్యూ తదితర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కు వివరించారు. ఆయన వెంట ఖైరతాబాద్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ రజిని, ఏఈలు ఉన్నారు.

235 స్కూళ్లలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులు పూర్తి : కలెక్టర్ అనుదీప్​

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో ప్రత్యేక అధికారులు, డిప్యూటీ డీఈఓలు, డిప్యూటీ ఐఓఎస్, డీఈలతో సమీక్షించారు. జిల్లాలో 384 స్కూళ్లలో  పనులు చేపట్టగా, ఇప్పటివరకు 235 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన చోట్ల త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.