ఉటాలో 97 ఏళ్ల బామ్మ హైస్కూల్ డిప్లొమా సంపాదించింది..

జీవితంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు చేయలేకపోతే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే కొందరు తమ శక్తికి మించిన పనులను వయసు మళ్లిన తర్వాత అయినా పూర్తి చేసేందుకు సిద్ధపడతారు. ఈ బామ్మ కూడా అంతే.. సెంచరీ కొట్టబోయే వయసులో తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. 

ఉతాహ్​కి చెందిన క్యాథరిన్​ కోల్ వయసు ఇప్పుడు 97 ఏండ్లు. ఈ వయసులో హైస్కూల్​ గ్రాడ్యుయేషన్​ వేడుకలో డిప్లొమా అందుకుంది. సెంచరీ కొట్టడానికి ఇంకా మూడేండ్లు ఉన్న టైంలో చదువుకున్న ఈ బామ్మను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది! నిజానికి క్యాథరిన్​కు చిన్నప్పట్నించీ చదువుకోవడమంటే చాలా ఇష్టం. అలానే ఆమె హాయిగా చదువుకుంటోంది కూడా. కానీ సడెన్​గా ఆమె తాత చనిపోయాడు. ఆయన అంత్యక్రియలు చేసిన రోజు ఆమె ఇంగ్లిష్​ క్రెడిట్​ అనే కోర్స్​ పూర్తయ్యేందుకు రాయాల్సిన ఫైనల్​ టెస్ట్​ రోజు ఒకటే అయ్యింది.

దాంతో ఆమె చదువుకు బ్రేక్​ పడింది. తాత చావుతో ఆ కుటుంబానికి సపోర్ట్​గా ఉండాల్సి వచ్చింది క్యాథరిన్​కు. దాంతో చదువుకోవాలనే ఆశను చంపుకుని 1940 నుంచి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంది. అలా ఏండ్లు గడిచిపోయాయి. కానీ ఎప్పటికైనా సరే చదువుకోవాల్సిందే అనుకుంది. అందుకని గత కొన్నేండ్లుగా టాబియోనా పబ్లిక్​ స్కూల్​లో స్టూడెంట్స్​తో కలిసి రీడింగ్​ స్కిల్స్​ పెంచుకుంది.

దానికి సంబంధించి ఎగ్జామ్​ పెడితే అందులో ఆమె క్వాలిఫై అయింది. అలా ఆమె 97 ఏండ్ల వయసులో డిప్లొమా అందుకుంది. అప్పుడు ఉద్వేగానికి గురైన ఆమె ‘‘నా జీవితం​ మొత్తం నేను కోరుకున్నది ఇదే. ఈ జీవితంలో ఇది సాధించలేనేమో అనుకున్నా. కానీ, ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పని లేదు” అంది కోల్.