భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది! ఆఫీస్‌ నుంచి ఇంటికెళ్లి పిల్లలతో కాసేపు గడిపితే అప్పటివరకు పడ్డ స్ట్రెస్​ అంతా మాయమవుతుంది. ఇదంతా ఒకప్పటి తరం ఆలోచన. కానీ.. ఈ జనరేషన్‌లో కొందరు మాత్రం పిల్లలు లేకపోవడమే బెటర్‌‌ అంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వాళ్లలో కొందరు ‘ఖర్చు ఉండదు. బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అంటుంటే... మరికొందరేమో పర్యావరణానికి మేలు చేస్తున్నాం’ అంటున్నారు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడం చెప్పుకోలేని బాధ. ఇప్పుడు పిల్లలు ఉండడమంటే భరించలేని ఖర్చు! అందుకే ‘డ్యుయల్‌ ఇన్‌కం నో కిడ్స్‌’ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలామంది కపుల్స్‌.

మన దగ్గర 

మన దేశంలో కూడా యువ జంటల్లో డింక్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. దాంతో సంతానోత్పత్తి రేటు క్షీణిస్తోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. ఇది వృద్ధ జనాభాకు దారి తీస్తుంది. ఇప్పుడు చైనా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరగడంతో శ్రామిక శక్తి తగ్గుతుంది. దాంతో ప్రొడక్టివిటీ మీద కూడా ఎఫెక్ట్‌‌‌‌ చూపిస్తుంది. మన దగ్గర1950లో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంది. ఇది1980లో 4.60కి, 2021లో 1.91కి తగ్గింది. 

అయితే.. ఇలా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మెరుగైన శిశుసంరక్షణ లేకపోవడంతో పిల్లలు చనిపోతారనే భయంతో ఎక్కువమందిని కనేవాళ్లు. కానీ.. ఇప్పుడు శిశు మరణాలు తగ్గడంతో ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. కానీ.. కొంతమంది మాత్రం పిల్లల్ని పోషించేందుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లల్ని కనడంలేదు. అలాంటివాళ్లంతా డింక్‌‌‌‌లుగా మారిపోతున్నారు. ముఖ్యంగా మన దగ్గర నగరాల్లోనే ఇలాంటివాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు.