పరిచయం: నా గుర్తింపు అదే

వేసేది స్టయిలిష్​​ బట్టలు.. కుట్టించేది సొంతూరిలోని టైలర్ల దగ్గరే. సింప్లిసిటీ, హ్యుమానిటీ, పాపులారిటీ.. అన్నీ కలిస్తే  దిల్జిత్ దొసాంజే. అటు సింగింగ్, ఇటు యాక్టింగ్​తో మెస్మరైజ్ చేస్తున్నాడు. సింగర్​గా దేశవిదేశాల్లో గుర్తింపు ఉంది అతనికి. అంతేనా.. తను చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు ఉండేలా చూసుకుంటాడు. దాదాపు ప్రతి మూవీలో తలపాగాతో, పంజాబీ సిక్కుగా కనిపిస్తాడు. ‘అమర్​సింగ్​ చమ్కీలా’ సినిమాతో ఎక్కువమందికి దగ్గరైన ఈ ఇంట్రెస్టింగ్​ పర్సనాలిటీ గురించి మరిన్ని సంగతులు దిల్జిత్​ మాటల్లోనే...

‘‘మాది పంజాబ్​. జలంధర్​ జిల్లాలోని దొసాంజ్​ కలన్ మా ఊరు. నాన్న బల్బీర్ సింగ్​, పంజాబ్​ రోడ్​వేస్​ ఉద్యోగి. అమ్మ సుఖ్వీందర్ కౌర్, గృహిణి. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. ఇదే మా ఫ్యామిలీ. నా విషయానికొస్తే.. నా బాల్యమంతా దొసాంజ్​ గ్రామంలోనే గడిచింది. నా పదకొండేండ్ల వయసులో లూథియానాలో ఉన్న బంధువుల ఇంటికి పంపించారు మా అమ్మానాన్న. అప్పుడు ‘వెళ్తావా’ అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. అక్కడ నాకు ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ అన్నీ దొరుకుతాయి అనే ఉద్దేశంతో వాళ్లలా చేశారు.

అక్కడికి వెళ్లడం వల్ల నాకు అమ్మానాన్న అనుకున్నవన్నీ దొరికాయి. గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదువుకున్నా. కానీ పేరెంట్స్​తో కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు. వాళ్లకు దూరంగా ఉండడం వల్ల వాళ్లతో అటాచ్​మెంట్ తగ్గిపోయింది. లూధియానాలో మా మేనమామ ఇంట్లో చిన్న రూంలో ఉండేవాడిని. రోజూ స్కూల్​కి వెళ్లి, రావడం నా పని. టైంపాస్​ కోసం చూసేందుకు టీవీ కూడా లేదు. చాలా భారంగా గడిచేవి రోజులు. కానీ, అలా చేసినందుకు నా వాళ్లంటే కోపం లేదు. నిజానికి వాళ్లంటే నాకు చాలా గౌరవం. అందుకే ఎప్పుడైనా ఆ రోజులు గుర్తొస్తే.. చదువుకుని బాగుపడాలనే వాళ్లు నన్ను ఒంటరిగా వదిలేశారని సర్దిచెప్పుకుంటుంటా. 

సంగీతంతో మొదలైన జర్నీ

నేను మొదటిసారి ‘ఇష్క్ దా ఉడా అడా(2003)’ అనే ఆల్బమ్​ రిలీజ్​ చేశా. అది టి–సిరీస్ విభాగం అయిన ఫైన్​టోన్​ క్యాసెట్స్​ రూపంలో వచ్చింది. ఆ ఆల్బమ్​ రిలీజ్ చేసేందుకు ఫైన్​టోన్​కు చెందిన​ రాజీందర్ సింగ్​ అనే ఆయన సాయం చేశాడు. నన్ను పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే, ఆ టైంలో ఆయన నా పేరును ‘దల్జిత్’​ బదులు ‘దిల్జిత్​’గా పలికాడు. దాంతో అదే పేరు కంటిన్యూ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే మొదటి అవకాశంలోనే ఎనిమిది పాటలు పాడేశా. ఆల్బమ్​ టైటిల్ ట్రాక్​ కోసం ఆ పాటలన్నింటినీ మ్యూజిక్ వీడియో చేయించాడు ప్రొడ్యూసర్. ఆ తర్వాత ఏడాది  రెండో ఆల్బమ్ రిలీజ్ చేశా. అది కూడా ఫైన్​టోన్ క్యాసెట్స్ కోసమే. 

అలా 2010 వరకు మ్యూజిక్ ఆల్బమ్స్ మాత్రమే చేస్తూ వచ్చా. ఒకసారి ‘మెల్ కరడె రబ్బా–’ అనే పాట ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం పాడా. ఆ పాటని యాక్టర్ జిమ్మీ షెర్గిల్ మీద షూటింగ్​ చేశారు. అది బాగా కుదరడంతో దాన్ని అదే పేరుతో సినిమాలో కూడా పెట్టారు. 

సినిమాల్లో ‘సింగ్​​’ పాత్రలు

మొదట్నించీ పాటలు ఇష్టం కాబట్టి సినిమా గురించి పట్టించుకోలేదు. కానీ, తర్వాత మ్యూజిక్ నుంచి మూవీస్ వైపు వెళ్లిన పంజాబీ ఆర్టిస్ట్​ల సక్సెస్ చూసి ఆశ్చర్యపోయా. వాళ్లు ఎలా తమ సినిమాలను వాళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు? అనేది తెలుసుకునేందుకు ట్రై చేశా. అయితే, ఆర్థికంగా ఉన్న పరిస్థితుల వల్ల నేను ఆ ఆలోచన విరమించుకున్నా. నాకు నేను సెలబ్రిటీగా చూపించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. పాటలు పాడుతుండడం వల్ల నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. మొదటి సినిమా సరిగా ఆడలేదు.

అయినప్పటికీ మ్యూజిక్‌  పరంగా నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో ఒకే గెటప్​ (సింగ్​​)లానే కనిపిస్తుండడంతో ప్రేక్షకులకి, క్రిటిక్స్​కి ‘ఇతను ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా?’ అనే  డౌట్​ ఉండేది. నిజానికి నా పట్టుదలే నన్ను ఇక్కడి వరకు నడిపించింది. నెమ్మదిగా నా యాక్టింగ్ కెరీర్​ మీద పాజిటివిటీ వచ్చింది. నా కెరీర్​ సక్సెస్​ఫుల్​గా సాగుతుంది అనిపించింది. యాక్టింగ్ నా మొదటి గోల్​ కానప్పటికీ దాన్నుంచి వచ్చే ప్రశంసలు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కెరీర్​ని కంటిన్యూ చేసేలా ఎంకరేజ్ చేశాయి. 

నేను ఈరోజు బాలీవుడ్​లో సినిమాలు చేస్తున్నానంటే అందుకు కారణం పంజాబీ సినిమా. అక్కడ పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టే ఇక్కడి వరకు రాగలిగా. పంజాబీ సినిమాల్లో నా వర్క్ చూసి ఇతర సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ‘అమర్ సింగ్ చమ్కీలా’ సినిమాలో పంజాబీ మ్యుజీషియన్ అమర్ సింగ్ చమ్కీలా పాత్రలో నటించా. సిక్కు​ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు.. యాక్టింగ్​లో నాకంటూ ఒక మార్క్​ క్రియేట్ చేసుకోవడం. దాంతోపాటు ఆన్​ స్క్రీన్​లో పంజాబీలకు గుర్తింపు రావాలని కోరుకోవడం. అందుకే నా వేషధారణ అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. పంజాబీ నటీనటులు సినిమాల్లో తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 

ఎప్పటికీ మ్యుజీషియన్​నే..

స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాడడం అలవాటైంది. చిన్నప్పడే నా సింగింగ్ కెరీర్ స్టార్ట్​ అయింది. కీర్తనలు, లోకల్ గురుద్వారాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాడిని. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నన్ను ఒక సింగర్, లిరిసిస్ట్, యాక్టర్​, ఫిల్మ్​ ప్రొడ్యూసర్ వంటి రకరకాల పొజిషన్స్​లో నిలబెట్టింది. అయితే ఎప్పటికీ నా మొదటి ప్రాధాన్యత సంగీతమే. వృత్తిపరంగా మ్యుజీషియన్​నే నేను. యాక్టింగ్ అనేది నాకు అనుకోకుండా వచ్చిన అవకాశం. అది వచ్చినందుకు సంతోషం. కానీ, మ్యూజిక్ నా జీవితం​. దాంతోనే మొదలయ్యా. దాన్నే ప్రేమిస్తా.

ప్రత్యేకంగా నెట్​వర్క్ పెంచుకునేందుకు ఏం చేయను. ప్రతిరోజూ ఎవరో ఒకరిని పిలవడం, పార్టీలకు వెళ్లడం వంటివి చేయను. నాకు యాక్టింగ్ చేయడం ఇష్టం. అలాగని నా సింగింగ్ కెరీర్​కి యాక్టింగ్​కి సంబంధం లేదు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తేనే యాక్టింగ్ చేస్తా. లేదంటే మ్యూజిక్​ నా ఫస్ట్ ప్రియారిటీ. స్టయిల్ అనేది మ్యూజిక్​ లైఫ్​లో ఒక భాగం. మ్యూజిక్, ఫ్యాషన్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. నా సంపాదనతో బట్టలు, చెప్పులు కొంటా. మందు, సిగరెట్ తాగను. బట్టలు కొంటాను అన్నానని నా దగ్గర పెద్ద వార్డ్​ రోబ్​ లేదు.

అలాగే చెప్పుల కలెక్షన్ కూడా అంతేం ఉండదు. నా బట్టలు, చెప్పులు నా ఫ్యాన్స్​కి ఇస్తుంటా. నేను స్టేజీ మీద వేసుకునే బట్టలు ఇప్పటికీ లూథియానాలోని లోకల్ టైలర్స్​ కుట్టినవే. ఫలానా బ్రాండ్​ వాడాలి అన్న ఆలోచన ఉండదు నాకు. అయితే నాకో వీక్​నెస్ ఉంది. ఇంగ్లిష్​ మాట్లాడటం నాకు అంత బాగా రాదు. ఇంగ్లిష్​ బాగా వస్తే.. ఇంకా సక్సెస్​ కాగలను అనిపిస్తుంది.’’

..తెలియదని చెప్పా

‘దిల్ – లుమినాటి’ టూర్​లో భాగంగా వాంకోవర్​లో ఒక పర్ఫార్మెన్స్ చేశా. దానికి 50 వేల మంది ఫ్యాన్స్ వచ్చారు. అది నా కెరీర్​లోనే కాదు.. పంజాబీ మ్యూజిక్​ చరిత్రలోనే గ్లోబల్​గా​ రీచ్ అయిన ప్రోగ్రాం. అది తెలిసి నేను చాలా ఎమోషనల్ అయ్యా. ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్రాటిట్యూడ్​ తెలుపుతూ ఒక పోస్ట్ చేశా. అలాగే, కాలిఫోర్నియాలో జరిగిన ‘కొయ్​చెల్లా’ మ్యూజిక్ ఈవెంట్​తో మరింత పాపులారిటీ వచ్చింది. ఈ ఈవెంట్​కి పది రోజుల ముందు ఒకతను నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఇది చరిత్ర సృష్టిస్తుంది అనుకుంటున్నారా?’ అని అడిగాడు. అప్పుడు ‘నాకు అది తెలియదు, చెప్పలేను’ అన్నా. కానీ ఆ పర్ఫార్మెన్స్ అయ్యాక రెస్పాన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయా.

తర్వాత అతని ఇంటికి వెళ్లి తను చెప్పిన మాట నిజమైనందుకు ఫ్రీగా ఒక పాట కంపోజ్ చేసి గిఫ్ట్​గా ఇచ్చా. అంతేకాదు.. పదహారు ట్రాక్​లు ఉన్న ఆల్బమ్​కి G.O.A.T అనే టైటిల్ పెట్టా. అవి యాపిల్ మ్యూజిక్ ఇండియా చార్ట్​లో నెంబర్​వన్​ పొజిషన్​లో నిలిచాయి. యూకె ఏసియన్ చార్ట్స్​లో రెండో స్థానం, న్యూజిలాండ్ హాట్ సింగిల్స్13వ స్థానంలో నిలిచాయి. కెనడియన్ చార్ట్​లో మొదటి 20 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. అంతేకాదు.. యూట్యూబ్​లో ఈ పాటలకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 

  •   2016లో బాలీవుడ్​లో ‘ఉడ్తా పంజాబ్​’ సినిమాతో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సినిమాకి బెస్ట్ మేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్​ దక్కింది. ఆ తర్వాత ‘ఫిల్లౌరి, సూర్మ, అర్జున్ పటియాలా, గుడ్ న్యూస్, జోగి’ వంటి సినిమాలు ఏడాదికి రెండు చొప్పున వరసగా రిలీజ్ అయ్యాయి. 
  •      టెలివిజన్​ షోల్లో హోస్ట్​గా చేయడం బాగుంటుంది. ప్రతి వారం డిఫరెంట్​ ఎక్స్​పీరియెన్స్. టీవీలో ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేయడం ఇష్టం. టీవీ ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్​కి కనెక్ట్ అవ్వొచ్చు.
  •      ఏండ్లు గడిచేకొద్దీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది.స్టయిల్​, లుక్స్​కి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ పాపులారిటీ వల్లే ‘మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ’గా దాదాసాహెబ్ పాల్కే ఎక్స్​లెన్స్ అవార్డ్​ అందుకోగలిగా.
  •      పేరున్న చాలా మ్యాగజైన్స్​లో కవర్​ పేజీ మీద నా ఫొటో వచ్చింది. అలాగే న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్​లో నా ఫొటో ఎగ్జిబిల్​ చేశారు. ఆ గుర్తింపు పొందిన మొదటి పంజాబీ ఆర్టిస్ట్​ నేను. 
  •      మేడమ్ టుస్సాడ్స్​లో నా మైనపు విగ్రహం పెట్టారు. ఈ గౌరవం సాధించడం వెనక ఇంట్రెస్టింగ్ విషయం.. తలపాగా ధరించిన సిక్కుని నేనే కావడం. 
  •      2013లో నా పుట్టినరోజు సందర్భంగా ‘సాంజ్ ఫౌండేషన్’ అనే ఎన్జీవో మొదలుపెట్టా. నా పేరులో సగం ‘సాంజ్’​ తీసుకుని ఎన్జీవో పేరు పెట్టా. సాంజ్​ అంటే ‘స్నేహం’ అని అర్థం. ఎన్జీవో ద్వారా అనాథ పిల్లలు, ముసలివాళ్లకు సాయం చేస్తున్నాం. యూత్​ఎంపవర్​మెంట్ కోసం పని చేస్తున్నాం.