నిజామాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

  • భార్య ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీకి పిలిచిన పోలీసులు
  • నిజామాబాద్‌లో ఘటన

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌ నగరంలోని రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. సీఐ శ్రీనివాస్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసే దిలీప్‌కు భార్య పూజ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన దిలీప్‌ భార్య, పిల్లలను వేధించేవాడు. విసిగిపోయిన పూజ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎంక్వైరీ కోసం దిలీప్‌ను సోమవారం రెండో పట్టణ పీఎస్‌కు పిలిపించారు.

ఈ క్రమంలో దిలీప్‌ తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో చేతి మణికట్టు కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతడిని జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దిలీప్‌కు డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని, దిలీప్‌పై గతంలోనే రెండు కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు.