తగ్గేదేలే .. ముందుకెళ్లని డిజిటల్ ​ఫీల్డ్ సర్వే ప్రక్రియ

  • యాప్​ డౌన్​లోడ్​ చేసుకోని ఏఈవోలు
  • మెమోలు ఇచ్చినా వెనక్కితగ్గేదిలేదని ప్రకటన 
  • షోకాజ్​ నోటీసులు ఇస్తామంటున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో వ్యవసాయ భూముల డిజిటల్​ ఫీల్డ్ సర్వే ప్రక్రియ ముందుకు పడడం లేదు. ఉన్నతాధికారుల నుంచి మెమోలు వస్తున్నా, షోకాజ్​ నోటీసులిస్తామని బెదిరిస్తున్నా, అగ్రికల్చర్​ ఎక్స్​ టెన్షన్​ ఆఫీసర్లు (ఏఈవోలు) వెనక్కి తగ్గడం లేదు. తమకు సహాయకులను ఇస్తే తప్ప సర్వేకు సంబంధించి యాప్​ డౌన్​ లోడ్​ చేసుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. 

వెంటనే యాప్​ డౌన్​ లోడ్​ చేసుకొని, సర్వే ప్రారంభించకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కాంట్రాక్ట్ బేసిస్​ పై పనిచేస్తున్న ఏఈవోలపై వ్యవసాయ శాఖ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రెగ్యులర్​ ఏఈవోలు వారికి అండగా ఉంటున్నట్టు ప్రకటించారు. తాజాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏజెన్సీలకు సర్వే సంగతి అప్పగిస్తే, వారితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని ఏఈవోలు చెబుతున్నారు. 

ఇబ్బందులు గుర్తించాలి.. 

ఖమ్మం జిల్లాలో 129 మంది ఏఈవోలు ఉండగా, అందులో 16 మంది కాంట్రాక్ట్ బేసిస్​ పై పనిచేస్తున్నారు. 108 మంది రెగ్యులర్​ ఏఈవోలు ఉండగా, ఇంకో ఐదుగురు ఆత్మా సిబ్బంది ఏఈవోలుగా పనిచేస్తున్నారు. వీళ్లందరూ డిజిటల్ క్రాప్​ సర్వే (డీసీఎస్​) యాప్​ డౌన్​ లోడ్​ చేసుకొని గతనెల 24 నుంచి సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలో కాకుండా, ఏఈవోలు మాత్రమే సర్వే చేయాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంపై మండిపడుతున్నారు.

 తాము పైలట్ ప్రాజెక్టుగా 5వేల ఎకరాల్లో సర్వే చేసిన సమయంలో ఆరుగురు ఏఈవోలకు 90రోజులకు పైగా సమయం పట్టిందని చెబుతున్నారు. ఇప్పుడు ఒక్కో క్లస్టర్​ లో కనీసం 5వేలకు పైగా ఎకరాలు ఉండగా, ప్రతి సర్వే నంబర్​కు, అందులో ఉన్న బై నంబర్లకు 25 మీటర్ల దూరంలో మాత్రమే యాప్​ పరిగణనలోకి తీసుకుంటుందని, దీని వల్ల ఒక్కో ఏఈవో సర్వే పూర్తి చేయడానికి ఏడాదిన్నర పడుతుందని వివరిస్తున్నారు. తమకు గ్రామ స్థాయిలో సహాయకులను ఇస్తే తప్పించి సర్వే చేసేది లేదని తేల్చిచెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గుర్తించకుండా తమపై ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదని ఏఈవోలు చెబుతున్నారు. 

ఈనెల వేతనాలు వస్తాయా.. రావా?

గతంలో ఆయా క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల దగ్గరకు వెళ్తే ఆ రోజు డ్యూటీకి హాజరైనట్టుగా ఏఈవోలకు హాజరు వేసేవారు. ఇప్పుడు సర్వే సంగతి తెరపైకి వచ్చిన తర్వాత యాప్​ లోనే లింక్​ ద్వారా అటెండెన్స్​ వేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. దీంతో ఈనెల 7 నుంచి ఏఈవోలకు సర్వే చేయకపోవడం వల్ల ఆబ్సెంట్ అయినట్టుగా రికార్డు అవుతోంది. ప్రభుత్వం చెబుతున్న మిగిలిన అన్ని పనులు చేస్తున్నప్పటికీ, సర్వే ఒక్కటి చేయకపోవడం వల్ల గైర్హాజరు అయినట్టుగా చెప్పడాన్ని ఏఈవోలు తప్పుబడుతున్నారు. ప్రతినెలా 22న ఏఈవోలకు సంబంధించిన శాలరీ ప్రాసెస్​ ను అధికారులు మొదలుపెడతారు.

 మరో రోజు గడిస్తే ఈ నెల వేతనాలు వస్తాయా.. లేవా అనేది తేలనుంది. రెగ్యులర్​ ఏఈవోలకు రూ.40వేల వరకు వేతనాలు ఉండగా, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి రూ.16 వేలు మాత్రమే శాలరీ ఇస్తున్నారు. ఒకవేళ తాము సర్వే చేయకపోవడం వల్ల ప్రభుత్వం తమ ఉద్యోగాల నుంచి తొలగించే పరిస్థితి వచ్చినా, వెనుకడుగు వేసేది లేదని కాంట్రాక్ట్ ఏఈవోలు అంటుండగా, అలా తొలగిస్తే ఊరుకునేది లేదని రెగ్యులర్​ ఏఈవోలు వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.