డిజిటల్ అరెస్ట్ అంటే ఆగం ఎందుకు?

డిజిటల్ అరెస్ట్ అంటే ఆగం అయిపోతున్నారు. తప్పు చేస్తున్నవారు, చేయనివారు అందరూ భయపడిపోతున్నారు.  నేరం చేసేవారికి ఇదో అవకాశంగా డబ్బు సంపాదించుకునే మార్గం అయిపోతున్నది. భారతదేశంలో సైబర్ క్రైమ్స్​ పెరిగిపోయాయి. సైబర్ మోసగాండ్లు చాలా పకడ్బందీగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో ప్రస్తుతం సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాల భయం చాలామందిలో ఉన్నది. మనీ లాండరింగ్, అక్రమ సంపాదన,  అక్రమ ఆస్తులు,  బ్లాక్​మనీ,  నకిలీ మందుల విక్రయం ఇలా ఒక్కటి ఏందీ!  ప్రతి విషయం ఈ నేరగాండ్లకు తెలుసు!

ఈడీ, సీబీఐ, ఐటీశాఖల పేర్ల మీద సదరు వ్యక్తులకు ఈ మోసగాళ్లు ముందు ఫోన్ చేస్తారు. వీరికి ఇందుకోసం ఒక సెటప్ ఉంటుంది.  ఒక స్టూడియో కూడా ఉంటుంది.  వీడియో కాల్ చేస్తారు.  ఫుల్ యూనిఫాంలో నకిలీ అధికారులు కూర్చుని ఉంటారు. మీ బయోడేటా, మీపై ఆరోపణల చిట్టా, మీ బ్యాంక్ ఖాతాల గురించి ముందుగానే  వీళ్ళు సమాచారం తెలుసుకుంటారు.  ఫోన్ చేసి మీకు సంబంధించిన విషయాలన్నీ మాట్లాడతారు.  అధికారుల పేరిట మిమ్మల్ని లైన్ లో గంటల తరబడి ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తారు.  అరెస్ట్ భయం చూపుతారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, రిలీజ్​ చేయాలంటే డబ్బులు కావాలని బేరం ఆడతారు.

దర్యాప్తు ఏజెన్సీల బూచి!
ఈ నెల సీబీఐ, ఈడీ ఆఫీసర్స్​  అని చెప్పి బిహార్ రాష్ట్రం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అభయ్ నారాయణ్ రాయ్ కు ఫోన్ వచ్చింది. ముంబైలోని ఫలాన బ్యాంకులో మీ ఖాతాలో అక్రమ అమౌంట్ ఉందని చెప్పారు.  ఆయనను ట్రాప్ చేసి 4.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ మోసగాడు తన 123 ఖాతాలలో వారంపాటు  ట్రాన్స్ఫర్  చేయించుకున్నారు. డాక్టర్ అభయ్​ ఎందుకు వీరికి భయపడ్డాడో  తెలియదు! డాక్టర్ దాచుకున్న డబ్బు అక్రమ ఆర్జనతోనే వచ్చిందా?  తెలియదు. 

డబ్బంతా ట్రాన్స్ఫర్ అయ్యాక సదరు మోసగాడికి ఫోన్ చేస్తే  ఖతం స్విచ్డ్ ఆఫ్.  అప్పుడు ఆయన మేల్కొని మోసపోయానని భావించి ఫిర్యాదు చేశాడు.  ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. సామాన్యులు ఒక్క బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే  కేవైసీ నింపుతూ  ఆగం అవుతాం, ఆధార్ కార్డు,  చేతివేలి ముద్రలు ఇలా ఎన్నో నిబంధనలు పూర్తిచేయాలి.   ఫోన్  కనెక్షన్ కు అంతే గోస!  మరి ఈ డాక్టర్ ను ట్రాప్ చేసిన మోసగానికి 123 బ్యాంకు ఖాతాలు ఏంటి?  ఇదంతా  వ్యవస్థాపరమైన లోపాలు వెల్లడి చేస్తూ షాక్​కు గురిచేస్తోంది. 

ఎందుకు భయపడాలి?
అక్రమ, అవినీతి సంపాదన ఉన్నోడి సంగతి వేరుగాని కష్టపడి సంపాదించుకునేవాళ్ళు కూడా ఈ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పటికి ఫ్రాడ్స్ కు భయపడడం ఎందుకు?  సీబీఐ, ఐటీ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల పేరుమీద ఫోన్ లు వస్తే  ఎటువంటి మోసాలకు పాల్పడనివారు ఎందుకు భయపడాలి అని తమను తాము ప్రశ్నించుకోవాలి.  మనం ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి లంచం ఎందుకు ఇవ్వాలి?   నేరుగా చట్టంకు పట్టి ఇవ్వొచ్చు కదా! మన దగ్గర తప్పు లేనప్పుడు అనవసరంగా  భయపడకూడదు.  బిహార్ లో ఆ డాక్టర్ ఐఎంఏ అధ్యక్షుడిగా ఉండి కూడా మోసగాళ్లు బారినపడ్డారు. 

కోల్​కతాలో జరిగిన జూనియర్​ వైద్యురాలి హత్య, అత్యాచారం లాంటి ఘోర సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నది. ఈ నేపథ్యంలో డాక్టర్ భయపడి నాలుగున్నర కోట్లు కోల్పోవడం ఆందోళనకరం. డబ్బు సంపాదనకు అక్రమాలకు పాల్పడకూడదు. ప్రధానంగా అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం  ఈ డిజిటల్ అరెస్ట్ లు అన్నీ ఫేక్.  డిజిటల్​ అరెస్టు అనేది చట్టబద్ధం కాదు.  రాజకీయ నాయకులే ఇప్పుడు దర్యాప్తు ఏజెన్సీలకు భయపడడం మానేశారు!  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డర్నామత్!  డరోమత్ అని ఇచ్చిన నినాదం బాగా పని చేస్తున్నది. తెలంగాణలో కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత అలర్ట్ చేస్తున్నప్పటికి,  జనం మోసపోతూనే ఉన్నారు.  నిజానికి భయం తప్పు చేసేవారికి ఉండాలి.  తప్పు చేయనివారు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. --

చండీగఢ్లో మహిళ ట్రాప్
ఇక గత నెలలో చండీగఢ్​లో ఒక మహిళ కు ఫోన్ చేసి 72 గంటలు డిజిటల్ అరెస్ట్ లో ఉంచుతున్నట్లు పేర్కొని ఆమె బ్లాక్ మెయిల్ చేశారు.  అమె ఖాతా నుంచి 85 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్  చేయించుకున్నారు.  ఆగ్రాలో ఒక సీనియర్  న్యాయవాది అనిల్ గోయల్ కు  ఫోన్ చేసి 48 గంటలు డిజిటల్ అరెస్ట్ లో పెట్టి డబ్బులు అడిగారు. 

న్యాయవాది తెలివిగా వారిని లైన్లో ఉంచి పోలీసులకు పట్టించాడు. ఇలా ఎంతోమంది  ఫ్రాడ్స్  ఈ రోజు,  ప్రస్తుత  ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని, నకిలీ పాస్​పోర్ట్, పోలీస్ కేసు ఉందని,  పోలీస్ లు పిలుస్తున్నారని, వ్యాపారంలో ఫ్రాడ్ చేస్తున్నారని,  ఫలానా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని, భవనం అక్రమంగా కట్టినారని, ఇలా చాలా విషయాలలో తగిన సమాచారం సేకరించి  నేరగాళ్ళు వసూళ్లు చేయడం ఇటీవల ఎక్కువ అయిపోయింది.  ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్​పెరిగిన తర్వాత ఇలాంటి  మోసగాళ్లు, ఫ్రాడ్లు పెరిగిపోయాయి. ఒక్కోసారి సొంత వ్యక్తులే మీ ఏటీఎం కార్డు  దగ్గర పెట్టుకొని  లక్షల రూపాయలు డ్రా చేసుకుంటున్న విషయం కూడా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు.

ఎండి. మునీర్, సీనియర్​ జర్నలిస్ట్