దివ్యాంగులకు సదరం కష్టాలు

  •     స్లాట్లు నిరంతర ప్రక్రియగా మార్చినా ఫలితం లేదు 
  •     నెలల కొద్దీ వెయిట్‌‌  చేస్తున్న దివ్యాంగులు

పెద్దపల్లి, వెలుగు : సదరం స్లాట్ల బుకింగ్‌‌ కు దివ్యాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో స్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం మీ సేవ చుట్టూ నెలల తరబడి తిరిగినా బుక్‌‌  కావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం స్లాట్‌‌  బుకింగ్‌‌ ను నిరంతర ప్రక్రియగా మార్చినా ఫలితం లేకుండా పోయింది.  స్లాట్‌‌  బుక్‌‌  అయినా ఫోన్‌‌ కు మెసేజ్‌‌  రాకపోవడంతో తాము ఎప్పుడు హాస్పిటల్‌‌ కు వెళ్లి టెస్ట్‌‌ లు చేయించుకోవాలో తెలియడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ డేట్​ ఎప్పుడని హాస్పిటళ్లు, డీఆర్‌‌ ‌‌ డీవో, డీఎంహెచ్‌‌ వో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 

బుకింగ్‌‌  సిస్టమ్ మారినా లాభం లేదు 

గతంలో స్లాట్ బుకింగ్‌‌  కోసం ప్రతినెలా డీఆర్డీఏ అధికారులు ప్రకటించిన తేదీల వారీగా దివ్యాంగులు మీసేవా కేంద్రాలకు ఉదయమే వెళ్లేవారు. నెలకు కొన్ని స్లాట్లు కేటాయించడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న మీసేవా కేంద్రాల్లో దివ్యాంగులు బారులుదీరేవారు. స్లాట్లు తక్కువగా ఉండడంతో వెబ్‌‌ సైట్‌‌  ఓపెన్‌‌  అయిన 5 నుంచి 10 నిమిషాల్లో క్లోజ్‌‌  అయ్యేవి. ఇలా ఒక్కో కేంద్రంలో రెండు లేదా మూడు స్లాట్లు మాత్రమే బుక్‌‌  అయ్యేవి. మిగతావారు వచ్చే నెలదాకా వెయిట్‌‌  చూడాల్సి వచ్చేది. కాగా ప్రస్తుత ప్రభుత్వం స్లాట్‌‌  బుకింగ్‌‌  సిస్టంను నిరంతర ప్రక్రియగా మార్చింది.

ఏ రోజైనా వెళ్లి స్లాట్ బుక్​ చేసుకోవచ్చు. ఇలా బుక్‌‌  చేసుకున్న స్లాట్లకు ఫోన్‌‌  మెసేజ్‌‌  రావడం లేదు. దీంతో ఎప్పుడు టెస్ట్‌‌ లు చేసుకోవాలో అర్థంకాని పరిస్థితిలో దివ్యాంగులు ఉంటున్నారు.  మరోవైపు సదరం క్యాంపుల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా వేలాది మంది సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురుచూస్తుండగా ప్రతినెలా 200 నుంచి 250 స్లాట్లు కూడా పరిస్థితి ఉండడం లేదని అధికారులు చెబుతున్నారు.