బంగారానికి రంగు.. రూపు..

బంగారం రకరకాల క్వాలిటీల్లో, రంగుల్లో దొరుకుతుందనే విషయం చాలామందికి తెలియదు. కానీ.. అదే వాస్తవం. ప్యూర్ బంగారంతో ఆభరణాలను చేయడం చాలా కష్టం. అందుకే బంగారంలో కొన్ని లోహాలు కలుపుతుంటారు. అలా కలిపే లోహాల క్వాంటిటీ బట్టి బంగారం క్వాలిటీ, లోహాల కలర్​ని బట్టి రంగు మారుతుంటాయి. అందుకే 22కే, 18కే, రోజ్‌‌ గోల్డ్, ఎల్లో గోల్డ్.. ఇలా రకరకాలుగా బంగారు నగలు ఉంటాయి.

క్వాలిటీ బట్టి.. 

బంగారం, డైమండ్స్​ లాంటి వాటి క్వాలిటీని క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్లు ఉంటే అది మేలిమి బంగారం అని అర్థం. అందులో 99.9 శాతం బంగారం ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైన బంగారం పసుపు రంగులో మెరుస్తుంటుంది. అది చాలా ఫ్లెక్సిబుల్​గా ఉంటుంది. దాన్ని వేళ్లతో కూడా వంచొచ్చు. ఇతర లోహాలు కలిపినప్పుడు గట్టిపడుతుంది. 
24 క్యారెట్​: ఇది స్వచ్ఛమైన బంగారం. ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇలాంటి బంగారాన్ని కొంటుంటారు. 
22 క్యారెట్​ : ఇందులో 92 శాతం బంగారం, 8 శాతం ఇతర లోహాలు కలుపుతారు. మన దేశంలో ఎక్కువగా ఇలాంటి బంగారంతోనే నగలు చేయించుకుంటారు. 

18 క్యారెట్లు: ఇందులో 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు ఉంటాయి. దీంతో చేసిన ఆభరణాలు చాలా గట్టిగా ఉంటాయి. చిన్న చిన్న గొలుసులు, బ్రేస్​లెట్లు లాంటివి ఇలాంటి బంగారంతోనే చేస్తారు. 
14 క్యారెట్లు: ఇందులో 58శాతం బంగారం, 42శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఇలాంటి బంగారాన్ని చాలా తక్కువగా వాడతారు. చవకగా బంగారు ఆభరణాలు చేయించుకోవాలి అనుకునేవాళ్లు మాత్రమే ఇలాంటి గోల్డ్​ వాడతారు.

రంగు రంగుల బంగారం 

ఆభరణాలు చేయడానికి వీలుగా బంగారాన్ని మార్చేందుకు అందులో కలిపే వివిధ లోహాలను బట్టి  రంగు​ మారుతుంటుంది. బంగారంలో ఎక్కువగా వెండి, రాగి, జింక్, పల్లాడియం, నికెల్ లాంటివి కలుపుతారు. 

ఎల్లో గోల్డ్​ 

స్వచ్ఛమైన బంగారానికి వెండి, రాగి లేదా జింక్‌‌ కలిపి దీన్ని తయారుచేస్తారు. ఇలాంటి బంగారాన్ని మన దగ్గర ఎక్కువగా ఇష్టపడతారు. పైగా ఈ బంగారంతో ఎలాంటి అలర్జీలు రావు. బంగారు ఆభరణాలు, నాణేలు ఎక్కువగా ఇలాంటి బంగారంతోనే తయారుచేస్తారు. 

వైట్ గోల్డ్

బంగారంలో ప్లాటినం (పల్లాడియం), కొద్దిమొత్తంలో నికెల్, జింక్‌‌ కలిపితే అది తెల్ల బంగారంగా మారుతుంది. పసుపు రంగు బంగారంతో పోలిస్తే వైట్ గోల్డ్​ మన్నికైనది. స్క్రాచెస్​ తక్కువగా పడతాయి. అందుకే డైమండ్ జువెలరీ తయారీలో దీన్ని ఎక్కువగా వాడతారు. మిగతా వాటితో పోలిస్తే.. దీని ధర కూడా ఎక్కువే. అయితే.. మన దగ్గర ఇలాంటి బంగారం వాడకం చాలా తక్కువ. 

రోజ్ గోల్డ్

దీన్ని పింక్​ గోల్డ్​ అని కూడా పిలుస్తారు. బంగారంలో వెండి, రాగిని కలపడం వల్ల ఈ రంగు వస్తుంది. ఇందులో తక్కువ ధరకు దొరికే రాగిని ఎక్కువగా కలపడం వల్ల ఈ వేరియంట్ బంగారం ఇతర రంగులతో పోల్చితే కాస్త బడ్జెట్-ఫ్రెండ్లీ. అంతేకాకుండా మన్నిక కూడా ఎక్కువే. 18 క్యారెట్ల వేరియెంట్​లో 22.5 శాతం రాగి, 2.75 శాతం వెండి కలిపితే పింక్​ కలర్​లోకి మారుతుంది.
 
గ్రీన్​ గోల్డ్​

ఆకుపచ్చ బంగారాన్ని ‘ఎలెక్ట్రమ్’ అని కూడా పిలుస్తారు. బంగారంలో వెండి కలిపితే ఈ రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు కొద్దిమొత్తంలో రాగిని కూడా కలుపుతారు. ఆకుపచ్చ రంగుని ఇచ్చేది మాత్రం వెండే. పచ్చ బంగారాన్ని ప్రాచీన ప్రజలు క్రీస్తుపూర్వం 860 ఏండ్ల నాటికే వాడడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఇది పూర్తి ఆకుపచ్చగా కాకుండా ఆకుపచ్చ, పసుపు రంగులు కలిపినట్టు ఉంటుంది. 

ఆకుపచ్చ రంగు కోసం బంగారంలో కాడ్మియం అనే మూలకాన్ని కలుపుతుంటారు. కానీ.. కాడ్మియం అత్యంత విషపూరితం. అందుకే ముదురు ఆకుపచ్చ రంగు రావాలి అనుకున్నప్పుడే దీన్ని కొద్ది మొత్తంలో కలుపుతున్నారు.18 క్యారెట్ల వేరియెంట్​లో 15 శాతం వెండి, 6 శాతం రాగి, 4 శాతం కాడ్మియం కలిపితే ముదురు ఆకుపచ్చ రంగు వస్తుంది. 

గ్రే గోల్డ్

బంగారానికి బూడిద రంగు ఇచ్చేందుకు పల్లాడియం ఎక్కువగా కలుపుతారు. కొందరు బడ్జెట్ తగ్గించుకునేందుకు పల్లాడియంకు బదులు మాంగనీస్, వెండి, రాగి కలపి బూడిద రంగు వచ్చేలా చేస్తారు. ఇందులోనే గ్రేవైట్​ కలర్ వేరియెంట్​​ రావడానికి 18 క్యారెట్ల బంగారంలో17 శాతం ఐరన్​, 8 శాతం రాగి కలుపుతారు. 

స్పాంగోల్డ్

బంగారు–రాగి మిశ్రమాలను విపరీతంగా బాగా వేడి చేస్తే.. దానికి ఒకరకమైన మెరుపు వస్తుంది. ఉపరితలం చాలా మృదువుగా ఉంటుంది. ఆ తర్వాత చల్లబరిచి బంగారానికి పాలిష్ చేసి, వేడి నూనెలో 150–200 డిగ్రీల సెల్సియస్ మధ్య 10 నిమిషాలు ఉడికిస్తారు. ఆ తర్వాత వెంటనే 2 డిగ్రీల సెల్సియస్‌‌కు చల్లబరుస్తారు. అప్పుడు స్పాంగోల్డ్ తయారవుతుంది. ఇందులో 76.5 శాతం బంగారం, 19 శాతం రాగి, 5 శాతం అల్యూమినియం ఉంటాయి. చూడ్డానికి ఇది పసుపు రంగులో ఉన్నా బాగా మెరుస్తుంటుంది. అల్యూమినియం వల్ల కొంత గులాబీ రంగులో కూడా కనిపిస్తుంది. 

పర్పుల్ గోల్డ్

ఈ వేరియెంట్​ బంగారానికి పెళుసుదనం ఎక్కువ. ఆభరణంలో మొత్తం బంగారం కంటెంట్ 79 శాతం ఉంటుంది. దీన్ని  సంప్రదాయ ఆభరణాల్లో రత్నాల్లా కనిపించేందుకు వాడతారు. 

బ్లూ గోల్డ్

ఇండియం లేదా గేలియంని బంగారంలో కలిపితే ఈ వేరియెంట్​​ వస్తుంది. ఇందులో 46 శాతం బంగారం ఉంటే 54  శాతం ఇండియం ఉంటుంది. 

నల్ల బంగారం

ఈ రకమైన బంగారాన్ని సాధారణంగా ఆభరణాల్లో డిజైన్ల కోసం వాడతారు. ఇందులో 25శాతం కొబాల్ట్, 75 శాతం బంగారం ఉంటుంది. బంగారం మీద బ్లాక్ ఆక్సైడ్ పూత ఏర్పడడం వల్ల నల్లగా కనిపిస్తుంది. రాగి, టైటానియం, ఇనుము కలిపి కూడా ఇలాంటి నల్ల బంగారం తయారుచేయొచ్చు.