తెలంగాణ కిచెన్..కరకరా శ్నాకింగ్​

కొన్ని శ్నాక్​ వెరైటీలను ఇంట్లో చేసుకుని తినడం కంటే బయట కొనుక్కుని తినడమే బెటర్​ అనుకుంటారు కొందరు. కానీ కొంచెం ఓపిక చేసుకుంటే కొనుక్కున్న వాటికంటే టేస్టీగా, హెల్దీగా ఇంట్లోనే వండుకోవచ్చు. అలాంటి రుచుల్లో కొన్ని వెరైటీలు మీ ముందుకు వచ్చేశాయ్​. 

బ్రెడ్​ చికెన్​ పాకెట్స్​

కావలసినవి : 

చికెన్​ స్టఫింగ్​కు...
బోన్​లెస్​ చికెన్​ (బ్రెస్ట్​) - 300 గ్రాములు
నూనె - రెండు టేబుల్​ స్పూన్స్​
వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్​ స్పూన్​
ఉప్పు - ఒక టీ స్పూన్​
పసుపు - అర టీస్పూన్​
ఎండుమిర్చి తునకలు - ఒక టీస్పూన్​
కశ్మీరి కారం - ఒక టీస్పూన్​
నల్లమిరియాల పొడి - ఒక టీస్పూన్​
ధనియాల పొడి - ఒక టీస్పూన్​
గరం మసాలా - అర టీస్పూన్​
క్యాప్సికమ్​ (సన్నగా, నిలువుగా తరిగి) - ఒకటి
ఉల్లిపాయ(సన్నగా, నిలువుగా తరిగి) - ఒకటి
సోయా సాస్​ - ఒక టీస్పూన్​
టొమాటో (సన్నగా నిలువుగా తరిగి) - ఒకటి

పాకెట్స్​ కోసం...

బ్రెడ్​ స్లయిస్​లు - రెండు 
కోడి గుడ్లు - రెండు, 
ఉప్పు - పావు టీస్పూన్​
మిరియాల పొడి - పావు టీస్పూన్​
నూనె - వేగించడానికి సరిపడా

సాస్​ కోసం...

మయోనీస్​ - నాలుగు టేబుల్​ స్పూన్లు
టొమాటో కెచప్​ - రెండు టేబుల్​ స్పూన్లు
రెడ్​ చిల్లీ సాస్​ - ఒక టేబుల్​ స్పూన్​
మిరియాల పొడి - పావు టీస్పూన్​
ఉప్పు - పావు టీస్పూన్​
లెట్టూస్​ - సరిపడా

తయారీ

స్టఫింగ్​ చికెన్​  :  ఓ మాదిరి మంట మీద పాన్​ వేడిచేసి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు అంటే 30 సెకన్లు వేగించాలి. అందులో పొడవుగా తరిగిన చికెన్​ ముక్కలు వేసి ఒక నిమిషం గరిటెతో అటుఇటు కదపాలి. తరువాత​ ఉప్పు,​ పసుపు, ఎండుమిర్చి తునకలు​,​ కశ్మీరి కారం, నల్లమిరియాల పొడి​, ధనియాల పొడి​, గరం మసాలా​ వేసి కలపాలి. ఓ మాదిరి మంటమీద రెండు నిమిషాలు వేగించి, పాన్​ మీద మూతపెట్టి ఆరు నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత క్యాప్సికమ్​, ఉల్లిగడ్డ తరుగు వేసి కలిపి ఒక నిమిషం ఉడికించాలి. అందులో ఒక టీస్పూన్​ సోయాసాస్​ వేసి కలిపాక టొమాటో తరుగు వేసి ఒకసారి గరిటెతో కలిపి, స్టవ్ ఆపేయాలి. 

బ్రెడ్​ పాకెట్స్​ : బ్రెడ్​ ముక్కలు తీసుకుని వాటి చుట్టూ ఉన్న బ్రౌన్​ పార్ట్​ తీసేయాలి. కట్​ చేసిన బ్రెడ్​ ముక్కలను ఒకదాని మీద ఒకటి పెట్టి చపాతీ కర్రతో నెమ్మదిగా నాలుగువైపులా వత్తాలి. తరువాత గుండ్రటి మూతను బ్రెడ్​ మీద పెట్టి గుండ్రటి బ్రెడ్​ పాకెట్స్​ కట్​ చేయాలి. అలా ఆరు బ్రెడ్​ పాకెట్స్​ తయారుచేయాలి.
వెడల్పాటి గిన్నెలో కోడి గుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి​ వేసి బాగా కలిసేలా గిలక్కొట్టాలి. 
తర్వాత.. బ్రెడ్​ స్లయిస్​ల చివర్లు కట్​ చేసి పెట్టుకున్న బ్రౌన్​ పార్ట్​ని మిక్సీ జార్​లో వేసి గ్రైండ్​ చేస్తే బ్రెడ్​క్రంబ్స్ రెడీ అవుతాయి. 

గుండ్రంగా కట్​ చేసిన బ్రెడ్​ ముక్కని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచాలి. కోడిగుడ్డు మిశ్రమం బ్రెడ్​ అంతా బాగా అంటుకోవాలి. ఆ బ్రెడ్​ ముక్కలను బ్రెడ్​క్రంబ్స్​లో ముంచాలి. అన్ని బ్రెడ్ పాకెట్స్​కి బ్రెడ్​క్రంబ్స్​ కోట్​ వేయడం అయ్యాక కళాయిలో నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కాక మంట తగ్గించి బ్రెడ్​ పాకెట్స్​వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేగించాలి. వేగించేటప్పుడు వాటిమీద నెమ్మదిగా గరిటెతో వత్తాలి. 

అచ్చం పూరీలు పొంగినట్టు పొంగుతాయి. రెండు వైపులా సమంగా వేగించాలి. వాటికి అంటుకున్న నూనె పోయేందుకు వాటిని చిల్లుల గిన్నెలో వేయాలి. బ్రెడ్​ పాకెట్స్​కు నూనె వదిలాక మయోనీస్​, టొమాటో కెచప్​, రెడ్​ చిల్లీ సాస్​​, మిరియాల పొడి​, ఉప్పు​ వేసి బాగా కలపాలి. బ్రెడ్ పాకెట్​ను తీసుకుని మధ్యకు రెండు భాగాలుగా కోస్తే పాకెట్​ రెడీ. ఒక్కో పాకెట్​లో స్పూన్​తో తయారుచేసుకున్న సాస్​ కొంచెం రాయాలి. లెట్టూస్​ పరిచి పైన చికెన్​ ఫిల్లింగ్ పెడితే బ్రెడ్​ చికెన్​ పాకెట్స్​ రెడీ. వీటిని టీ టైం​ లేదా పార్టీ స్నాక్​గా చేసుకుంటే ఎంజాయ్​ చేయొచ్చు.

క్లబ్​ శాండ్​విచ్​ 

కావలసినవి :

చికెన్​ (బోన్​లెస్​) - 300 గ్రాములు
ఉప్పు - కొంచెం
వెనిగర్​ - ఒక టేబుల్​ స్పూన్​
సోయాసాస్​ - మూడు టేబుల్​ స్పూన్లు
నల్ల మిరియాల పొడి - ఒక టీస్పూన్​ 
వెల్లుల్లి పేస్ట్​ - కొంచెం
మయోనీస్​ - ముప్పావు కప్పు
కోడి గుడ్లు - రెండు
నూనె - రెండు టేబుల్​ స్పూన్లు
చిల్లీ గార్లిక్​ సాస్ లేదా కెచప్​, చీజ్​ - తగినంత
టొమాటో (గుండ్రంగా తరిగి) - ఒకటి
కీర దోస (గుండ్రంగా తరిగి) - ఒకటి

తయారీ : ఉప్పు, వెల్లుల్లి పేస్ట్​ వేసి ఉడికించిన చికెన్​లో వెనిగర్, సోయాసాస్​, ​నల్ల మిరియాల పొడి, మయోనీస్​ వేయాలి. అవన్నీ బాగా కలిపి పక్కన పెట్టాలి.ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన కార్చాలి. అందులో చిటికెడు ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్​లా వేసి రెండువైపులా కాల్చాలి. తరువాత ఆమ్లెట్​ను నాలుగు భాగాలుగా కట్​ చేయాలి. గ్రిల్​ పాన్​కు నూనె రాసి, బ్రెడ్​ స్లయిస్​లను గ్రిల్​ చేయాలి. 

తరువాత మూడు బ్రెడ్ స్లయిస్​లకు​ చుట్టూరా ఉన్న బ్రౌన్​ పార్ట్​ కట్​ చేయాలి. ఒక బ్రెడ్​ స్లయిస్​ మీద మయోనీస్​ పూసి, ఉడికించిన చికెన్​ను సమంగా పరవాలి. ఇంకో బ్రెడ్​ స్లయిస్​ మీద చిల్లీ గార్లిక్​ సాస్​ లేదా కెచప్​ పూసి, ఆమ్లెట్ ముక్క​, గుండ్రంగా తరిగిన​ టొమాటో ముక్క, నాలుగు మూలల నాలుగు కీరా ముక్కలు పెట్టాలి. మరో బ్రెడ్​ స్లయిస్​ మీద మయోనీస్​, చిల్లీ గార్లిక్​ సాస్​ వేసి సమంగా పరవాలి. చికెన్​ పెట్టిన బ్రెడ్​ స్లయిస్​ మీద బ్రెడ్​ సైజ్​ చీజ్​ ముక్క పెట్టి, దానిపైన టొమాటో, కీర పెట్టిన బ్రెడ్​ స్లయిస్​ వెల్లకిలా ఉంచాలి. దానిమీద మయోనీస్​, చిల్లీ గార్లిక్ సాస్​ రాసిన బ్రెడ్​ స్లయిస్​ను బోర్లించాలి. ఆ తరువాత బ్రెడ్​ను శాండ్​విచ్​ షేప్​లో కట్​ చేస్తే రెస్టారెంట్​ స్టయిల్​ క్లబ్​ శాండ్​విచ్​ రెడీ.  


పొటాటో ట్విస్టర్​​ సమోసా

కావలసినవి :  

ఆలుగడ్డ (మీడియం సైజ్​)- ఐదు
క్యారెట్​ తరుగు  - రెండు టేబుల్​ స్పూన్లు
క్యాప్సికమ్​ తరుగు - రెండు టేబుల్​ స్పూన్లు
కొత్తిమీర తరుగు- ఒక టేబుల్​ స్పూన్​
పచ్చిమిర్చి తరుగు - ఒకటి లేదా రెండు
ఉప్పు - ఒక టీస్పూన్​ లేదా రుచికి తగినంత
ధనియాల పొడి - ఒక టేబుల్​ స్పూన్​
పసుపు - అర టీస్పూన్​
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్​
కారం - ఒక టీస్పూన్​
కార్న్​ ఫ్లోర్​ - రెండు టేబుల్​ స్పూన్లు
మైదా - రెండు కప్పులు
ఉప్పు - అర టీస్పూన్​ లేదా రుచికి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్​
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు - పిండి ముద్ద కలిపేందుకు సరిపడా
నూనె - వేగించేందుకు సరిపడా
చికెన్​ పౌడర్​ - ఒక టీస్పూన్​ (ఆప్షనల్)

తయారీ :  ఒక గిన్నెలో మైదా, నెయ్యి, జీలకర్ర, ఉప్పు వేసి సరిపడా నీళ్లుపోసి ముద్ద చేయాలి. క్లాత్​​ వేసి అర గంట నానబెట్టాలి. ఆలుగడ్డను తురిమి ఒకగిన్నెలో వేయాలి. అందులో క్యారెట్​, క్యాప్సికమ్​ తరుగు వేయాలి. ఉప్పు, మిగతా మసాలాలు, కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి.నానబెట్టిన పిండిని రెండు సమ భాగాలుగా చేయాలి. వాటిని చపాతీల్లా వత్తాలి. తరువాత ఒక సమోసా బేస్​ మీద తయారుచేసుకున్న ఆలుగడ్డ మసాలా మిశ్రమం పరవాలి. దాని మీద రెండో సమోసా బేస్​తో మూయాలి. చపాతీ కర్రతో నెమ్మదిగా అవి రెండూ అతుక్కుపోయేలా వత్తాలి. తరువాత కత్తితో పదును ఉన్న వైపు కాకుండా మరోవైపు నుంచి పైనుంచి కింద పొర వరకు సమంగా కట్​ అయ్యేలా సమోసా బేస్​ పైనుంచి కిందకు నిలువుగా రెండు అర్ధభాగాలుగా కట్​ చేయాలి. తరువాత ఒక్కో దాన్ని అడ్డంగా ఆరు ముక్కలుగా కట్​ చేయాలి.
 

తరువాత ఒక్కో ర్యాప్​ రెండు చివర్లు పట్టుకుని నెమ్మదిగా ట్విస్ట్​ చేయాలి. అది డిజైన్​లా వస్తుంది. అన్నీ ఇలా చేసుకున్నాక వేడి నూనెలో వేసి వేగించాలి. సర్వింగ్ ప్లేట్​లో సమోసా ట్విస్టర్​లను అందంగా అమర్చి సాస్​ లేదా చట్నీతో తింటే నోట్లో రుచి కూడా వంపులు తిరుగుతూ పలకరిస్తుంది.

బేక్​డ్​ పకోడి

కావలసినవి : 

క్యారెట్​ (పెద్దది) - ఒకటి, ఆలుగడ్డ (చిన్నది) - ఒకటి
అల్లం ముక్క - చిన్నది, సముద్రపు ఉప్పు​ 
ఆనియన్​ పౌడర్​ - ఒక్కో టీస్పూన్​, నల్ల మిరియాల పొడి - కొంచెం, జీలకర్ర - అర టీస్పూన్​, గరం మసాలా - ఒక టీ స్పూన్​, కొత్తిమీర తరుగు - కొంచెం
శనగపిండి - ముప్పావు కప్పు

తయారీ  ;  క్యారెట్​, ఆలుగడ్డల పొట్టు తీసి తురమాలి. అవి పక్కా ఆర్గానిక్​వి అయితే పొట్టు తీయకుండానే తురమొచ్చు. అల్లం తురమాలి. శనగపిండి తప్ప మిగతా అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేయాలి. తరువాత వాటి మీద శనగపిండిని ఉండలు లేకుండా జల్లించి చేతితో అవన్నీ బాగా కలిసిపోయేలా కలపాలి.బేకింగ్​ ట్రే మీద పర్చ్​మంట్​ పేపర్​ పరిచి, శనగపిండి మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా వాటి మీద పెట్టాలి. 

పాటీస్​లా కావాలనుకుంటే ఆ ఉండల్ని కొద్దిగా వత్తితే సరిపోతుంది. ఒవెన్​ను 25 నిమిషాలు (200  నుంచి 240 సెంటిగ్రేడ్​ వరకు)​ హీట్ చేయాలి. అన్ని ఒవెన్​లు ఒకేలా ఉండవు. అందుకని మీ ఒవెన్​కు ఏ టెంపరేచర్​ సెట్​ అవుతుందో చూసుకుని అంతే పెట్టుకోవాలి. తరువాత ఒవెన్​లో బేకింగ్ ట్రే పెట్టాలి. బేక్​డ్​ పకోడీ టేస్టీగా రావాలంటే గుర్తుంచుకోవాల్సింది పకోడీ మాడకుండా చూసుకోవాలి. అదెలా తెలుస్తుందంటే పకోడీ చివర్లు క్రిస్పీగా అయ్యేవరకు ఉంచితే చాలు. వీఈటిని స్టార్టర్​, శ్నాక్​లా తినేయొచ్చు.