రోజ్.. రోజ్.. రోజాపూవ్వా.. రంగుల గులాబీలతో మీ మనో భావాలు

గులాబీలను తలచుకోగానే మనసు గుభాళిస్తుంది. అదే రంగు రంగుల గులాబీల మనస్తత్వాలను తెలుసుకుంటే ఉద్వేగంతో మీ మనసు ఉరకలు వేస్తుంది. మీరు ఎవరికైనా మీ ప్రేమను, స్నేహాన్ని, అభిమానాన్ని తెలపాలి అనుకుంటే ఏ రంగు గులాబీలను ప్రజెంట్ చేస్తే వారు మీ మనో భావాలను గ్రహిస్తారో తెలుసుకోండి.. 

ఎర్ర గులాబీ: 

ఎర్రగా పూసిన గులాబీ కనిపిస్తే అమ్మాయిలు చటుక్కున తుంపి జడలో తురుముకుంటారు. కానీ ఎర్ర గులాబీలను ఇష్టపడేవారు ఎక్కువ భావోద్వేగాలకు గురవుతారట. ఎరుపు స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. అందుకే మీ ప్రేమను ఎర్రగులాబీతో తెలపండి..

తెలుపు గులాబీ: 

తెలుపు స్వచ్ఛతకు, పవిత్రతకు, అమాయకత్వానికి, వినయానికి చిహ్నం. ఏదైనా కొత్త పని ప్రారంభించే వారికి ఆల్ ద బెస్ట్ చెప్పాలన్నా, ఏదైనా విజయం సాధించిన వారిని అభినందించాలన్నా వారికి తెల్లగులాబీలతో మీ ప్రశంసలు తెలపవచ్చు. పసుపు గులాబీ: పసుపు రంగు ఎదుగుదలకీ, ఆనందానికి, ఆహ్వానానికి, స్నేహానికి చిహ్నంగా వాడతారు. అందుకే మీ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే వారి దగ్గరకు పసుపు రంగు గులాబీలతో వెళ్ళండి. 

లేత గులాబీ

లేత గులాబీ రంగు ప్రశంసకు, ఆనందానికి, కృతజ్ఞత లాంటి సున్నితమైన భావాలను తెలుపుతుందట. అంతే కాదు అందానికి చిహ్నం లేత గులాబీ రంగు. అందుకే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తెలిపేందుకు లేత గులాబీ పువ్వులను ప్రజెంట్ చేసి సున్నితంగా మీ మనసులోని భావాన్ని తెలపండి.

ఆరెంజ్ రంగు గులాబీ: 

ఆరెంజ్ రంగు ఆవేశానికి చిహ్నం. కానీ కొన్ని సందర్భాలలో ఈ పూలను తమ ప్రేమను తెలిపేందుకు కూడా ఉపయోస్తారు.

ఊదా రంగు గులాబీ: 

ఉదారంగు మనుషుల్లోని అభిమానాన్ని, ఆప్యాయతలను తెలుపుతుంది. అందుకే చాలా మంది వారి ఆరాధనను, ఆప్యాయతలను తెలిపేందుకు ఊదారంగు గులాబీలను బహుకరిస్తారు. 

నీలం రంగు గులాబీ:

నీలం రంగు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. కాని నీలం రంగు ఇతరులను విడిచి పెట్టి ఉండలేని మనస్తత్త్వాన్ని సూచిస్తుంది. అందుకే ఎవరినైనా విడిచిపెట్టలేమని అనిపిస్తే వారికి సున్నితంగా నీలం రంగు గులాబీని తీసుకెళ్ళి మీ మనసును తెలిపేయండి.

ఆకుపచ్చ గులాబీ:

ఆకుపచ్చరంగు సంపద, శాంతి, ప్రశాంతతని సూచిస్తుంది. ఆకుపచ్చ గులాబీలను అనారోగ్యంతో ఉన్నవారు తిరిగి ఆరోగ్యవంతులుగా కోలుకోడానికి, ఆహ్లాదంగా వారి జీవితాన్ని ప్రారంభించడానికి చిహ్నంగా బహుకరిస్తారు. 

నల్ల గులాబీ:

నలుపుని సాధారణంగా విచారానికి చిహ్నంగా సూచిస్తాం. అలా అని దాన్ని తీసిపారేయకండి.. ఒక్కొక్కప్పుడు దాని అవసరం కూడా వస్తుంటుంది మరి.