పట్టు బిగిస్తున్న ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌.. ఈ ప్రచ్ఛన్నయుద్ధపు ముగింపేమిటో.?

మొక్కకు.. కంకి భారమౌతుందా?  కాయ.. చెట్టునే  బేఖాతర్‌‌‌‌ అంటుందా?  దశాబ్దాలుగా  గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఓ ఇంటి వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది.  భారతీయ జనతా పార్టీ దాని సిద్ధాంత భూమికైన రాష్ట్రీయ స్వయం సేవక్‌‌‌‌ సంఘ్ (ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌) మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయా?  తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి.  ఇదేం సిద్ధాంత రాద్ధాంతం కాదు.  విధానాల ఆచరణ, వ్యవహారశైలి వంటి అంశాలే ఇందుకు కారణం.  ఏడాదిలో ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలకు సన్నద్ధమౌతున్న సంఘ్ అదే యేట 75 ఏండ్లు నిండే మోదీని ‘ఇక చాలించండి’ అని నాయకత్వ మార్పును  ప్రతిపాదిస్తుందా?  ఈ ప్రచ్ఛన్నయుద్ధం ఏ (వి)పరిణామాలకు దారితీస్తోంది? ఇవన్నీ ప్రశ్నలే!  ఇప్పుడిదే  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.  

నా గ్‌‌‌‌పూర్‌‌‌‌లో 1988 అక్టోబరు 23–25  తేదీల్లో జరిగిన  ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  విస్తృత  కార్యకర్తల  సమావేశంలో  దత్తోపంత్‌‌‌‌  ఠేంగ్డే  మాట్లాడుతూ  ‘నాలో ఎన్నో అవలక్షణాలుండొచ్చు, కానీ, రొమాంటిసిజం మాత్రం లేదు’  అని  నర్మగర్భంగా అన్నారు.  అంతగా  ముసుగుకప్పి చెప్పటం ఇప్పుడవసరం లేదనుకున్నారేమో. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత మోహన్‌‌‌‌ భాగవత్‌‌‌‌  అదే  నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో జరిగిన కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఇటీవల మాట్లాడుతూ  ‘నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు.  నేనే చేశానని చెప్పుకోడు.  ప్రజాజీవితంలో  గౌరవ మర్యాదలు  పాటిస్తాడు’ అని  పచ్చిగానే  చెప్పారు. మరి, ఆయనన్నట్టు సేవకుడినని చెప్పుకుని, అహంకారంతో,  గౌరవ మర్యాదలు పాటించనిదెవరు?  పలు నిర్హేతుక నినాదాలతో  రొమాంటిసిజాన్ని  ప్రదర్శిస్తున్నదెవరు?  ఆయనెవరో పేరు వేరే చెప్పాలా!  ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ అధినేత మాటలు గానీ,  సంఘ్ ​గొంతుక  ‘ఆర్గనైజర్‌‌‌‌’లో  అచ్చయిన జీవితకాలపు కార్యకర్త రతన్‌‌‌‌ శారద వ్యాసంగానీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

బీజేపీ – ఆర్ఎస్ఎస్ మధ్య విభేదాలు

18 కోట్ల మంది సభ్యులతో  ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీకి,  దాని సిద్ధాంత భూమిక అయిన ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌కు మధ్య  విభేదాలున్నాయని,  బీజేపీ అగ్రనాయకత్వం వ్యవహార శైలి, పార్టీ నడకతీరుపై  ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  గుర్రుగా ఉంది. అంతకు ముందు నుంచే స్పర్ధలు ఉన్నా ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాల్లో బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్య తేడాలు బయటపడ్డాయి. అందుకే,  పార్టీ విధానాల అమలుపై  మరింత పట్టుకోసం ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఇప్పటికే  ‘దిద్దుబాటు’ చర్యలు ప్రారంభించిందనీ చెబుతున్నారు. బీజేపీ  నేతృత్వంలో ఎన్టీఏ కూటమి ముచ్చటగా మూడోసారి  కేంద్రంలో  అధికారంలోకి వచ్చినా, పార్టీకి  పూర్వవైభవం దక్క లేదు.  భారీ మెజారిటీ అని ప్రచారం చేసుకున్నా కనీస మెజారిటీకి అవసరమైన సంఖ్య కూడా  సొంతంగా  రాక  బీజేపీ బలం 240 స్థానాలకు తగ్గిపోయింది.

సంఘ్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు

వ్యక్తి కేంద్రకంగా  జరిపిన ప్రచారం, 'రొమాంటిసిజం'తో  చేసిన నినాదాలు, అంతటా కనబరచిన అతి విశ్వాసం ఒకవైపు,  అలసత్వం మరోవైపు బీజేపీ కొంప ముంచిందని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ బలంగా నమ్ముతోంది. ఇదిలాగే సాగటం మంచిది కాదని,  పార్టీపై  ప్రత్యక్ష పట్టూ, పాలనపై  పరోక్ష అదుపు సడలనీకుండా మరింత పెంచాలని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  భావిస్తున్నట్టు సంకేతాలున్నాయి. ఈసారి కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే  కాకుండా శాఖల కేటాయింపుల్లోనూ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  తనదైన ముద్ర వేసింది. ఈ పోకడ ఇలాగే కొనసాగితే,  వచ్చే ఏడు  ప్రధాని మోదీకి 75 ఏండ్లు నిండినపుడు..‘మీ పిలుపు
నకు  మీరే  కట్టుబడండి, 75 ఏండ్ల వృద్ధులయ్యారు ఇక తప్పుకోండి’ అని గుమ్మం చూపిస్తుందా?  కేంద్ర ప్రభుత్వంలో  నెంబర్​2,  మోదీ అంతేవాసి అమిత్‌‌‌‌షా  కాదని చెప్పడం సంఘ్‌‌‌‌ లక్ష్యమై ఉంటుందా?  ఇవే రాజకీయ వర్గాల్లో చర్చకొస్తున్నాయి.  ఒకటి మాత్రం నిజం, అటు బీజేపీ ఇటు ఆర్ఎస్ఎస్, అవకాశాన్ని బట్టి ఆధిపత్య సాధనకు  యత్నిస్తున్నట్లు  తేటతెల్లమవుతోంది.  

రాహుల్ బలోపేతం..మోదీ బలహీనం

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్​ ఓడినా  రాహుల్‌‌‌‌ బలపడ్డారు. ఎన్టీఏ  గెలిచినా మోదీ బలహీనమయ్యారు. ఇదివరకటి చరిష్మా ఆయనలో  కనిపించడంలేదు. లక్ష్యం నెరవేరింది కనుక మోదీ ‘పరివార్‌‌‌‌’ అనే మాటను ఇక తొలగించండి అని ఆయనే చెబుతున్నారు. ఈ తొలగింపు  ప్రక్రియ కూడా ఆర్ఎస్ఎస్​ గుర్రు వల్లే అంటున్నారు. 'ఫిర్‌‌‌‌  ఏక్‌‌‌‌బార్‌‌‌‌ మోదీ సర్కార్‌‌‌‌’ మోదీ గ్యారెంటీ వంటి నినాదాల పట్ల,  పార్టీలో వ్యక్తిస్వామ్యం పెరగటం ఆర్ఎస్ఎస్​ కోపానికి కారణాల్లో ఒకటి.  మోహన్‌‌‌‌ భాగవత్‌‌‌‌  నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో  చాలా విషయాలే  తెరపైకి తెచ్చారు. రాజకీయాల్లో  విపక్షాలే తప్ప వైరి పక్షాలుండవని,  పరస్పర  గౌరవ మర్యాదలు లోపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

సంఘ్ సహకారం కోరని బీజేపీ ​

ఆర్ఎస్ఎస్ సరిగా పనిచేయలేదనే  ఆరోపణ  పసలేనిదని,  స్థానికంగా ఎక్కడికక్కడ ఆర్ఎస్ఎస్, ఇతర విభాగాల సహాయ -సహకారాలు కోరని బీజేపీ నాయకత్వానిదే  తప్పని,  ప్రత్యేక పరిస్థితుల్లో 1973,- 77లో  తప్ప ఆర్ఎస్ఎస్​ ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనలేదని,  పౌరులు విస్తృతంగా ఓటింగ్‌‌‌‌లో పాల్గొనాలనే  ప్రచారం ఇటీవల చేసిందని రతన్‌‌‌‌ శారద ఆర్గనైజర్​లో రాశారు. 10-–15 మందితో  కూడిన చిన్న బృందాలు, దేశవ్యాప్తంగా  సుమారు 20 లక్షలకు తగ్గకుండా ఈసారి వీధి మలుపు, ఆఫీసు,  ప్రయివేటు ప్రాంగణ సమావేశాలు జరిపాయని గుర్తు చేశారు. జాతీయ  సమగ్రతకు నిలబడే జాతీయవాద శక్తులకు మద్దతీయాలనే కోరిందన్నారు. 543 స్థానాల్లోనూ 'మోదీ'యే  పోటీ చేస్తున్నారన్నంత  భ్రమ కల్పించడం తప్పని,  బీజేపీ  మంత్రులే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా స్థానిక నాయకులు, కార్యకర్తలు,  ప్రజలకు దొరకని పరిస్థితి ఏంటని ‘ఆర్గనైజర్‌‌‌‌’ ఎండగట్టింది.

తెలంగాణలో ఇంకో నాలుగు సీట్లొచ్చేవి

మొదటి నుంచీ పార్టీకి  కట్టుబడ్డ  నిబద్ధులకే  టికెట్లు ఇచ్చి ఉంటే, తెలంగాణలో మరో నాలుగు సీట్లయినా వచ్చి ఉండేవనే భావన పాతతరం నాయకుల్లో ఉంది.  కనీసం 12 సీట్లు గెలవాల్సిన ఊపువచ్చి, 8  స్థానాలకే పరిమితమయ్యామనే  బాధ కొందరు వ్యక్తం చేస్తున్నారు. 17 లోక్‌‌‌‌సభ స్థానాలకుగాను 15 చోట్ల ఇతర పార్టీల (10 బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, 3 కాంగ్రెస్‌‌‌‌) నుంచి వచ్చినవారికో,  కార్పొ రేట్‌‌‌‌ ప్రతినిధులకో ఇచ్చారనే బాధ పార్టీ శ్రేణుల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని వ్యధ పార్టీ శ్రేణుల్లో నెలకొంది!  జహీరాబాద్‌‌‌‌, నాగర్‌‌‌‌ కర్నూల్‌‌‌‌,  వరంగల్‌‌‌‌, నల్గొండ తదితర  లోక్‌‌‌‌సభ స్థానాల్లో  వలస పక్షులకు కాక  పార్టీకోసం ఎంతోకాలంగా  పనిచేసినవారికే ఇచ్చి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని కొందరంటారు. తాజా  ఫలితాలతో ప్రజలు బీజేపీకి తప్పులు దిద్దుకునే ఒక అవకాశం ఇచ్చారన్నది వారి భావన. 

అతివిశ్వాసం, అలసత్వం

బీజేపీలో పెరిగిన అతివిశ్వాసానికి,  అలసత్వానికి  ఇటీవల  ఫలితాల రూపంలో  వాస్తవ  పరిస్థితులే గుణపాఠం నేర్పాయని  సంఘ్‌‌‌‌ సీనియర్‌‌‌‌,  జీవితకాలపు కార్యకర్త రతన్‌‌‌‌ శారద చురక అంటించారు. బీజేపీ నడక ఎలా దారితప్పిందో  సవివరంగా,  సంఘ్‌‌‌‌ గొంతుకైన “ఆర్గనైజర్‌‌‌‌’  పత్రికలో  ఆయనొక సమగ్ర వ్యాసం రాశారు. చాలా విషయాలు నిర్మొహమాటంగానే  వ్యక్తం చేశారు. అవి, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన అత్యధికులు గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్న విషయాలే!  ‘వారిద్దరూ 
మా మనసులోని మాట చెప్పారు’ అని దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్‌‌‌‌ శ్రేణులు భావిస్తున్నాయి. 3

పడిపోయిన బీజేపీ బలం

పార్టీ నాయకత్వపు వ్యక్తి కేంద్రక ధోరణి,  తప్పుడు నిర్ణయాలు,  లోపభూయిష్ట  విధానాలు, నాయకులు, కార్యకర్తల ప్రవర్తన.. ఇటువంటివే  పార్టీ పతనానికి కారణమని సంఘ్‌‌‌‌ నేపథ్యం ఉన్న పాత తరం నాయకులంటున్నారు. కిందటి ఎన్నికలతో పోల్చి చూస్తే 303 నుంచి బీజేపీ బలం 240కి పడిపోయింది.  ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌‌‌‌  కిందటిసారి  52 స్థానాలను (2014లో 44) ఈ సారి 99 ఎంపీ స్థానాలతో  దాదాపు పార్టీ బలాన్ని రెట్టింపు చేసుకుంది. వివిధ  రాష్ట్రాల్లో  తాను  పాలకపక్షంగానో,  పాలకుల భాగస్వామ్యపక్షంగానో  ఉన్నచోట 271లోంచి 75 స్థానాలను బీజేపీ ఈసారి కోల్పోయింది. రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉండి, తాను సవాల్‌‌‌‌ విసిరిన 187 స్థానాల్లో,  తన ఇదివరకటి సంఖ్య కన్నా బీజేపీ 12 స్థానాలు  మెరుగుపరుచుకుంది. అంటే, పాలకపక్షంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ (డబుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌) విఫలమైనట్టే కదా  అనే విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి.

- దిలీప్‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌, పీపుల్స్‌‌‌‌పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ