ఆధ్యాత్మికం: కర్తవ్యం, బాధ్యత మధ్య తేడా ఇదే..

కర్తవ్యం ....బాధ్యత.....రెండూ మానవ బాధ్యతలు  కానీ ఈ రెండిటికి కొద్దిపాటి తేడా ఉంది.  కర్తవ్యం అనేది ఒక సాధారణ పదం, నైతిక లేదా చట్టపరమైన బాధ్యత అయితే, "బాధ్యత" అనే పదం ఎక్కువగా చట్టపరమైన బాధ్యతను సూచిస్తుంది, అది నెరవేరకపోతే చట్టపరమైన పరిణామాలను కలిగి ఉంటుంది.. బాధ్యత అంటే ఏమిటి.. కర్తవ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. .

కర్తవ్యం, బాధ్యత అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరువేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు)ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు(అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు.తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. 

ALSO READ  | ఆధ్యాత్మికం: ప్రతిరోజు దీపారాధన ఎందుకు చేయాలి... వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి..

రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముడిని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు...  జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలని  భవిష్య పురాణం చెబుతుంది.

వీటిలో మొదటిది.. రాముడి అవతార పరమార్ధంతో ముడివడినది. రెండోది- ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన, అందమైన కూతుర్ని ప్రసాదించాడు.

 ఈమె రాక్షస రాజైన సుందుడుని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు, కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది.అగస్త్యుడు సుందుడు, సుకేతుల్ని శపించి మరణానికి కారణమైనందుకు తాటకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించుకుంటుంది. అందులకు కోపించిన ముని వికృత రూపాన్ని రాక్షసత్వాన్ని ప్రాప్తిస్తాడు.

 అప్పటినుండి తాటక సుబాహులు అరణ్యాలలో మునులు జరిపే యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాయి. విశ్వామిత్ర మహర్షికి దీనిమూలంగా కలిగిన వినాశనానికి కోసల రాజైన దశరథుని అర్ధించి రామలక్ష్మణుల్ని యాగరక్షణ కోసం నియమిస్తాడు. విశ్వామిత్రుని వెంట యాగరక్షణ కోసం వచ్చిన రామలక్ష్మణులు తాటకిని వధిస్తారు

రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణమనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. 

గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం! సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం.అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్ మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే!

రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని!

కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసాగింపు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.