ఆధ్యాత్మికం : కర్మ, ఙ్ఞానం ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ.. వీటిలో ఏది గొప్పది అని ఎలా నిర్ణయిస్తారు..?

కర్మసన్యాసం గురించి స్పష్టత కోసం మరింత చక్కగా వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు. కర్మసన్యాసం అంటే కర్మాచరణం మానేయమని కాదు. కర్మ చేయాలనే భావన మానేయమని... జ్ఞానమార్గమంటే కర్మఫలాసక్తిని వదలటం, స్వబుద్ధితో కర్మలని ఆచరించటం రెండూ ఒకటేనని, వేరు వేరు కావని అర్ధం చేసుకోవాలి. 

 మాటల్లో చెప్పాలంటే ఫలితం ఆశించకుండా పని చెయ్యటం. బియ్యంలోనో... పప్పులోనో..  రాళ్లని ఏరుతున్నామంటే రాళ్లని పడేసి ఊరుకోం కదా. బియ్యాన్నో, పప్పునో తీసుకుంటాం. ఈ మాట చెప్పకపోయినా అర్ధం అవుతుంది. ఒకటి చేస్తే రెండోది కూడా చేసినట్టే. ఈ రెండింటిని కలిపి కాక విడివిడిగా అర్థం చేసుకోవటాన్నే కుర్రతనం అంటారు.

 "గ్రహణ ధారణ పటు: బాల:" అని జ్ఞానమార్గంలో బాల శబ్దాన్ని అమాయకత్వానికి, తెలియకపోవటానికి, అజ్ఞానానికి వాడతారు. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని  ఇంకా ఎంతో తెలుసుకోవలసిన వాడుగా భావిస్తున్నాడన్నమాట. కర్మలని సన్యసించిన వాడిని సన్యాసి అంటారు. కర్మలు అంటే మనం చేసేవి అనుకున్నప్పుడు ఈ మాట సత్యం..  కాని ఇవి మన చేత చేయబడతాయి.  

 మనం చేసేవి కాదు... చెయ్యటం చెయ్యకపోవటం అన్నది మన ఇష్టాయిష్టాలని బట్టి ఉండదు. చెయ్యాలనుకున్నవి చేయలేకపోవటం, చెయ్యొద్దు అనుకున్నవి చెయ్యాల్సి రావటం అందరికీ అనుభవమే. ... ఇది ఎట్లా జరుగుతోంది? ... వ్యక్తుల సహజ స్వభావాన్ని అనుసరించి ప్రకృతి వారి చేత చేయిస్తోంది. అంటే కర్మలు మానటానికి స్వభావాన్ని వదులుకోవాలి. అది సాధ్యమా?...ఆహారపు అలవాట్లు, వేష భాషలు మనిషిని వదలి పెట్టవు. మరి సన్యాసం అంటే ఏమిటో సరైన అర్ధాన్ని తెలియచేస్తున్నాడు శ్రీకృష్ణుడు...  

సన్యాసం తీసుకోవటం అంటే కాషాయం ధరించటం మాత్రమే కాదు. కాషాయం ధరించాలనుకోవటం కూడా కామమే అవుతుంది కదా. కామం ఉంటే సన్యాసి ఎట్లా అవుతాడు? సన్యాసి అయిన తరువాత ఉండే బంధాలు గృహస్తు కంటే ఎక్కువ. భార్యాపిల్లల వరకే గృహస్తు బంధం.. సన్యాసికి ఆశ్రమం దాని నిర్వహణ, శిష్యులు, వారికి బోధ చేయాలనుకోవటం. ..ముందుగా శిష్యులు దొరకాలనే అన్వేషణ... వారి పోషణ... వారిని తీర్చిదిద్దాలనే బాధ్యత.... ఇట్లా కుటుంబ బాధ్యతని మించిన బాధ్యత ఉంటుంది. ఇది కావాలని పులుముకున్నదే  సన్యాసం ... అంటే అన్నీ వదులుకోవటం అయినప్పుడు ఈ కామాటం ఉంటే దాన్ని ఏమనాలి?

Also Read :- ఈ 5 రాశుల వారికి దివ్యమైన మంచి యోగం అంట..!

సత్+న్యాసి సన్నాసి. అంటే తనలో ఉన్న మమకారాన్ని ప్రేమగా పండించి, దాన్ని విస్తరించి సృష్టిలోని సమస్తమునందు ఉంచగలగటం. అప్పుడు సమస్తంలోను వ్యాపించిన భగవత్ తత్త్వాన్ని అనుభూతి చెందటం జరుగుతుంది. న్యాసం అంటే ఉంచటం. సత్ అంటే సత్ పదార్థం. అంటే ఉండటం అన్న దానికి లక్ష్యమైన పరమాత్మలో సమస్తాన్ని ఉంచటం. ఆయన లేని చోటు లేదు. కనుక తనతోపాటు అంతటా, అన్నిటా భగవంతుడిని  చూడటం.... పరిమితత్వం నుండి అపరిమితత్వంలో ఉండగలగటం.

 ఆత్మవత్ సర్వభూతాని అంటే - అన్ని ప్రాణులను తనవలె ప్రేమించగలగాలి. అది ఫలాపేక్ష లేక సత్కర్మలని  ఆచరించటం వల్ల మాత్రమే వస్తుంది..  ఫలితంగా అహంకార మమకారాలు మాయమవుతాయి.  పరిస్థితులు, వ్యక్తుల విషయంలో కూడా ఇష్టాయిష్టాలు ఉన్నట్లయితే అవే బంధిస్తాయి...  కనుక సన్యాసి కాలేడు. వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల తనకి ఆధ్యాత్మిక సాధన సాగటం లేదని. కొంతమంది వ్యక్తుల కారణంగా కుదరటం లేదని చెప్పటం కుంటిసాకులు మాత్రమే.. అది సన్యాసి లక్షణం కాదు. దానితో అనుకూల పరిస్థితులు కావాలని కోరుకోవటం మొదలైన వాటి వల్ల కోరిక మొలకెత్తింది. ఆ కోరిక తీరకపోతే, కోపం, అసహనం ఇత్యాది సిద్ధం. ఇక తను గొప్ప అనుకోవటం మొదలై, ఇతరులు అజ్ఞానులు, మూర్ఖులు, దుష్టులు అనే అభిప్రాయంతో వాళ్లపై ద్వేషభావం కలిగితే వాళ్లలో భగవంతుడి ఉనికిని గుర్తించనట్లే కదా. ప్రతివారు  తమకి నచ్చిన దారిలో సాగుతుంటారు.. వారిలో కూడా దైవం ఉంటాడు కనుక, వారి అభిప్రాయాలని, ఆచారాలని, అలవాట్లని కూడా దైవస్వరూపంగా భావించాలి .

జ్ఞాన మార్జించటం మొదలు పెట్టిన వారు ఏ స్థితిని పొందుతారో, కర్మయోగం ఆరంభించిన వారు కూడా అదే స్థితిని పొందుతారు. సాంఖ్యమనే జ్ఞానాన్ని, కర్మయోగ మార్గాలు రెండూ ఒకటేనన్న భావనతో చూసిన వాడే దర్శించిన వాడు. జ్ఞానమార్జించటం మొదలు పెట్టిన వారు ఏ స్థితిని పొందుతారో, కర్మయోగం ఆరంభించిన వారు కూడా అదే స్థితిని పొందుతారు. సాంఖ్యమనే జ్ఞానాన్ని, కర్మయోగ మార్గాలు రెండూ ఒకటేనన్న భావనతో చూసిన వాడే దర్శించిన వాడు.వివేకాన్ని పొందటం. సందేహాలు తీరటం ఈ మార్గంలో ప్రధానం. ఆచరించేపనులకి ప్రాధాన్యం ఉండదు. పనులు చెయ్యటం కూడా జ్ఞానం పొందటానికే.అయినప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్న వారికి కర్మాచరణం తప్పనిసరి కాదు. మళ్ళీఇక్కడ కర్మాచరణం అంటే కావాలనుకుని చేసే కర్మలు మాత్రమే చేయించబడేవి. అవి జరుగుతూనే ఉంటాయి. 

యోగమార్గం అవలంబించే వారికి ప్రధాన సాధనం కర్మాచరణమే. ఎందుకంటే కర్మలు వ్యక్తిగత ప్రకృతిలో ఉన్న హెచ్చుతగ్గులనిసరిచేసి, త్రిగుణాలని చక్కబరచి, చిత్తశుద్ధిని కలిగిస్తాయి. కనుక సత్కర్మాచరణం లేనిదే జ్ఞానం లభించదు. ఈ రెండు సాంఖ్యము, యోగము, లేదా జ్ఞానము, కర్మము అని రెండు భాగాలుగా కనిపిస్తాయి. కానీ ఒకటే అర్థం  చేసుకునేప్రయత్నంలో భాగంగా విభజించి చెప్తారంతే. వీటిలో దేనితో మొదలుపెట్టినారెండవది అప్రయత్నంగా, సహజంగా సిద్ధిస్తుంది..సంక్షిప్తంగా చెప్పాలంటే సత్కర్మాచరణం వల్ల చిత్తశుద్ధి, దానివల్ల జ్ఞానం కలుగుతాయి. జ్ఞానం కలిగితే జ్ఞానియే జ్ఞానం. జ్ఞానికి కర్మ  అంటే ఆచరించేవాడు ఆరోపించుకున్నదే. కానీ  వేరుగా మరొకటి లేదని తెలుస్తుంది. తానే కర్మ, కర్మాచరణం: కూడా  కనుక సాంఖ్యము, యోగము రెండు వేరు అనుకొనే వారు ఇంకా పిల్లలు అని అన్నాడు శ్రీ కృష్ణుడు.

–వెలుగు, లైఫ్​ ( డా. అనంతలక్ష్మి‌‌)–‌‌