మూసీపై పొలిటికల్​ వార్​ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ మీటింగ్స్​

  • బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం
  • ఆ పార్టీ రెండు నాల్కల ధోరణిపై నిలదీయాలని నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ పిలుపు
  • మూసీ నిర్వాసితులతో కలిసి సర్కార్​పైపోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయం
  • బుల్డోజర్లకు అడ్డంగా పడుకోవాలని పార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, వెలుగు : మూసీపై పొలిటికల్ హీట్ పెరిగింది. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని అధికార కాంగ్రెస్.. దాన్ని అడ్డుకుంటామని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రకటించడంతో రాజకీయంగా యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బుధవారం ఒకేరోజు అటు గాంధీభవన్​లో, ఇటు తెలంగాణ భవన్ లో మీటింగ్స్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాంధీభవన్​లో సిటీ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. మూసీపై బీఆర్ఎస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ కేడర్​కు  దిశానిర్దేశం చేశారు. ‘‘మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్​అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనకు అనుమతిచ్చి, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నది. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మూసీ బాధితులకు భరోసా ఇవ్వాలని సూచించారు. మరోవైపు తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లను పంపిస్తే, వాటికి అడ్డంగా పడుకోవాలని పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ మాట మార్చింది : పీసీసీ చీఫ్ మహేశ్

మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ మాట మార్చిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్​లో గ్రేటర్ హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్పొరేటర్లు, హైదరాబాద్ జిల్లాలోని పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా మహేశ్​ మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సర్వే చేయించి, హైలెవల్ మీటింగులు కూడా పెట్టారు. ఈ క్రమంలో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆఫీసర్లను ఆదేశించారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోగానే మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా నిర్వాసితులను రెచ్చగొడుతున్నారు.

ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదే విధంగా మూసీ వెంట ఉన్న నిర్మాణాలన్నీ తొలగిస్తారని తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం రివర్​బెడ్​(నది మధ్య) లోని నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి” అని సూచించినట్టు తెలిసింది. ‘‘హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడే లక్ష్యంతోనే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపడుతున్నది. పేదల ఇండ్లను కూల్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. నిర్వాసితులకు డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు, వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు, ఉపాధి కోసం లోన్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే చెరువుల ఆక్రమణలను తొలగించి, జలవనరులను కాపాడడమే హైడ్రా లక్ష్యం. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దళారుల అవతారమెత్తి చెరువులు, కుంటలు కబ్జా చేశారు.

అలాంటి వాళ్ల పేర్లు త్వరలో బయటపెడ్తం. వాటినే కూల్చేస్తాం. అంతేగానీ మూసీ పరీవాహక ప్రాంతాల వెంట ఉన్న పేదల ఇండ్లను కూల్చివేయం. అది కాంగ్రెస్ పాలసీ కాదు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రక్షాళన పనులు మొదలుపెడ్తం. ఈ విషయాలన్నీ జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి” అని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి, హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, నేతలు కె.కేశవరావు, ఫిరోజ్ ఖాన్, మేయర్ విజయలక్ష్మి,  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

నిర్వాసితులతో కలిసి పోరాడుదాం : కేటీఆర్ 

మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై పోరాడాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మూసీ, హైడ్రా కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. గతంలో మేం రూ.16 వేల కోట్లతోనే మూసీ ప్రక్షాళన చేయాలని అనుకున్నం. కానీ కాంగ్రెస్​సర్కార్ దాన్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచింది.

బిల్డర్లు, బడా వ్యాపారుల నుంచి వసూళ్ల కోసమే మూసీ ప్రక్షాళన అంటూ సీఎం రేవంత్ రెడ్డి దోపిడీకి తెరలేపారు. ఈ విషయాలన్నీ జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి” అని కేటీఆర్ సూచించినట్టు తెలిసింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా పేదల ఇండ్లను కూల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపిస్తే, ఎమ్మెల్యేలు వాటికి అడ్డంగా పడుకోవాలని పిలుపునిచ్చారు.