Good Health: షుగర్ పేషంట్లు ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే మంచిదట

షుగర్ పేషంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మందులు  వేసుకోవడం, రోజూ ఎక్సర్సైజ్ చేయడం మామూలే. దాంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే డయాబెటిస్ పేషెంట్లు.. ఏం తింటే ఏమవుతుందో అని భయపడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే స్పెషల్స్....

మల్టీ గ్రెయిన్ ఇడ్లీ

కావల్సినవి:

  • మినపప్పు- అర కప్పు, 
  • బ్రౌన్ రైస్ - అర కప్పు, 
  • బియ్యం అర కప్పు, 
  • కందిపప్పు - పావుకప్పు, 
  • పచ్చిశెనగపప్పు- పావుకప్పు, 
  • మెంతులు -2 టేబుల్ స్పూన్లు 

తయారీ:
మినపప్పు, బ్రౌన్ రైస్స్, బియ్యం, కందిపప్పు, పచ్చిశెనగపప్పు, మెంతులు అన్నింటినీ 12 గంటలు నానబెట్టాలి. తర్వాత అన్నింటినీ కలిపి (కావాలనుకుంటే కొంచెం అల్లం వేసుకోవచ్చు) గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమంలో తగినంత ఉప్పు కలిపి ఇడ్లీలు వేయాలి. సాంబార్, కొబ్బరి చట్నీతో ఈ ఇడ్లీలను తింటే టేస్ట్ సూపర్.

మేతి పరాటా

కావల్సినవి:

  • గోధుమపిండి - 1 కప్పు, 
  • మెంతికూర - అరకప్పు, 
  • గరం మసాలా-1 టేబుల్ స్పూన్, 
  • కారం- 1 టేబుల్ స్పూన్, 
  • ఉప్పు - సరిపడినంత, 
  • పెరుగు-2 టేబుల్ స్పూన్లు (అవసరమనుకుంటే),
  • నూనె-పరాటాలు కాల్చేందుకు 

తయారీ:
ఓ గిన్నెలో గోధుమపిండి, ఉప్పు, సన్నగా తరిగిన మెంతికూర, గరం మసాలా, కారం, ఉప్పు, కొంచెం నూనె వేసి కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ పిండిలా చేసుకోవాలి. 20 నిమిషాలు పిండిని నానబెట్టాలి. తర్వాత చపాతీలుగా ఒత్తుకుని పాస్పై సరిపడినంత నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి.