ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎన్నారైలు తెలిపారు. శనివారం ఆర్మూర్ టౌన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు లోక భూపతి రెడ్డి, ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షులు, బీజేపీ నాయకులు కోటపాటి నర్సింహాం నాయుడు, ఆస్ట్రేలియా ఎన్నారై మల్టి కల్చరల్ కమ్యూనిటీ లీడర్ నూకల వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎన్నారై సెల్ గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, కొక్కుల విద్యాసాగర్ మాట్లాడారు.
గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు బీజేపీకి వారి కుటుంబ సభ్యుల ద్వారా ఓటు వేయించి మరో సారి నరేంద్ర మోదీ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో ఐపీఎఫ్ ద్వారా 24 మంది వైద్యులను నియమించి వైద్య సేవలను, 11 మంది న్యాయవాదులను నియమించి న్యాయ సహాయం అందిస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం చాలా కృషి చేశారని చెప్పారు.