ధర్మమే గెలిచింది.. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై మందకృష్ణ మాదిగ

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ధర్మం గెలిచిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందర్ రావు, ఇతర కార్యకర్తలకు ఆయన స్వీట్లు తినిపించారు. 

తర్వాత భావోద్వేగంతో ఆయన మీడియాతో మాట్లాడారు. అధర్మం తాత్కాలికంగా గెలిచినా.. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు.   ఈ రోజు ఈ విజయం కోసం 30 ఏడ్లు పోరాటం చేశానన్నారు. ఈ పోరాటంలో అమరులయిన ఎమ్మార్పీఎస్​ బిడ్డలకు ఈ విజయం అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయని, కొందరు వెన్నుపోటు పొడిచారని బాధపడ్డారు.

 కానీ యావత్తు సమాజం మాదిగల వైపు నిలబడిందని, ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు తమకు మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం తమవెంట నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చెయ్యాలన్నారు. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయని, వాటి ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలని కోరారు.