ఎన్​ఐసీ చేతికి ధరణి : కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం

  • మూడేండ్లపాటు  నిర్వహణ బాధ్యత
  • పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పెంపు
  • ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత కంపెనీ అగ్రిమెంట్​
  • టెర్రాసిస్​ చెర నుంచి బయటపడ్డ పోర్టల్

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ఎట్టకేలకు విదేశీ కంపెనీ టెర్రాసిస్ చెర వీడింది. ఈ పోర్టల్​ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 71  లక్షల మంది రైతులకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూరికార్డుల నిర్వహణను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్​ను  సమూలంగా ప్రక్షాళన చేస్తామని, పోర్టల్ పేరును భూమాతగా మారుస్తామని, ధరణి పోర్టల్ ను ప్రభుత్వమే  నిర్వహిస్తుందని  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా టెర్రాసిస్​ను తప్పిస్తూ ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ముందు దివాళా కంపెనీకి.. తర్వాత విదేశీ సంస్థకు 

భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్ మెంట్ సిస్టం(ఐఎల్ఆర్ఎంఎస్)కు సాఫ్ట్​వేర్ డిజైన్, డెవలప్​మెంట్, ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్​పీ)ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుని 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా మార్చి, అదే ఏడాది అక్టోబర్ 29న అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వాస్తవానికి ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న 4 నెలలకే  ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ దివాళా కంపెనీల జాబితాలో చేరింది.

 అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ దివాళా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ గత సర్కార్ అలా చేయలేదు.ఈ క్రమంలోనే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్ లో సింగపూర్ కు చెందిన ఫాల్కన్ ఎన్జీ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకున్నది. తద్వారా ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎన్జీ కంపెనీ.. దాని పేరును టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చుకుంది.

 సింగపూర్ కు చెందిన టెర్రాసిస్​ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్ లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. గాది శ్రీధర్ రాజు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చాలా దగ్గరివాడనే ప్రచారం ఉంది. మొత్తంగా చుట్టూ తిరిగి నాటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ధరణి ఆపరేటర్లను కూడా గాది శ్రీధర్ రాజుకు చెందిన టెక్ కంపెనీ నుంచే రిక్రూట్ చేసుకున్నారు. ఆయన కంపెనీ ద్వారానే వారికి శాలరీ ఇస్తున్నారు. 

రికార్డుల నిర్వహణలో టెర్రాసిస్​ విఫలం.. 

ధరణి పోర్టల్ నిర్వహణలో టెర్రాసిస్ కంపెనీ పూర్తిగా విఫలమైంది. పాస్ బుక్స్, విస్తీర్ణంలో తప్పులు, ఇష్టారాజ్యంగా ప్రొహిబిటెడ్ జాబితాను రూపొందించడం, లక్షలాది సర్వే నంబర్లు మిస్ కావడం, ఒకరి భూమి మరొకరి పేరిట రావడంలాంటి అనేక సమస్యలను పరిష్కరించేందుకు మాడ్యూల్స్ ఇవ్వడంలో, ఆఫీసర్లకు లాగిన్ ఇవ్వడంలో ఆ కంపెనీ అధికారులు విఫలమయ్యారు. కొన్ని సమస్యలకు కలెక్టర్లు కూడా ధరణిలో పరిష్కారం చూపలేని దుస్థితి నెలకొన్నది. భూరికార్డుల నిర్వహణలో టెర్రాసిస్ కు అనుభవం లేదని 2010 లోనే ఒడిశా​ ప్రభుత్వానికి కాగ్ రిపోర్టు సమర్పించింది. అలా కాగ్ వద్దన్న కంపెనీకే పోర్టల్ బాధ్యతలను గత బీఆర్​ఎస్​ సర్కారు అప్పగించింది. దీంతో డిజిటల్ భూ రికార్డులు గందరగోళంగా మారాయి. 

మొదటి నుంచి రహస్యమే

అత్యంత కీలకమైన భూరికార్డుల నిర్వహణను ఏ కంపెనీ చేపట్టిందనే విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రహస్యంగా దాచిపెట్టింది. ఎవరైనా ఆర్టీఐ కింద అడిగినా సమాచారం ఇవ్వలేదు. టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీ చేతుల్లో మన భూరికార్డులు ఉన్నాయనే విషయాన్ని వెలుగులోకి తెస్తూ తొలిసారిగా 2021 డిసెంబర్ 3న ‘వీ6 వెలుగు’లో  ‘మన భూముల లెక్కలు పైలమేనా’ అనే హెడ్డింగ్ తో స్టోరీ పబ్లిష్​ అయింది. 

ఆ తర్వాత నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ధరణి  సమస్యలపై పనిచేస్తున్న అనేక మంది ఈ విషయాన్ని చర్చకు పెట్టారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఆ తర్వాత నిరుడు జూలైలో ఆ కంపెనీ నుంచి తొలిసారిగా కొన్ని దినపత్రికల్లోఅడ్వర్టైజ్​మెంట్​ రూపంలో ఇచ్చిన వివరణ పబ్లిష్ కావడం ద్వారా ధరణి పోర్టల్ నిర్వహించేది టెర్రాసిస్ అనే విషయం తెలిసింది.

ధరణి సమస్యలనుంచి విముక్తి కల్పిస్తం: మంత్రి పొంగులేటి 

డిసెంబ‌‌‌‌ర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో భూరికార్డుల నిర్వహ‌‌ణ బాధ్యత‌‌ను ఎన్ఐసీ నిర్వహిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన  మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'త్వర‌‌లో ధ‌‌ర‌‌ణి స‌‌మ‌‌స్యల నుంచి ప్రజ‌‌ల‌‌కు పూర్తి విముక్తి క‌‌ల్పిస్తాం. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు ఎలాంటి ముందుచూపు లేకుండా హ‌‌డావిడిగా తొంద‌‌ర‌‌పాటు నిర్ణయాల‌‌తో తీసుకొచ్చిన ధ‌‌ర‌‌ణి పోర్టల్ వ‌‌ల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నది. తెలంగాణ‌‌కు చెందిన 1.56 కోట్ల ఎక‌‌రాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాక‌‌ట్టు పెట్టారు. ఇచ్చిన మాట మేర‌‌కు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూముల‌‌ను కాపాడుకోవ‌‌డానికి, ఆ కంపెనీ కాంట్రాక్టు ర‌‌ద్దు చేశాం” అని పొంగులేటి వెల్లడించారు.

డిసెంబర్ 1 నుంచి ఎన్ఐసీ చేతుల్లోకి..

టెర్రాసిస్ కంపెనీ మూడేండ్ల కాంట్రాక్ట్ నిరుడు అక్టోబర్ 28వ తేదీతో ముగిసింది. కానీ అప్పటి ప్రభుత్వం మళ్లీ అదే కంపెనీని ఏడాదిపాటు కొనసాగించింది. ఆ లెక్కన ఈ నెల 29తో కాంట్రాక్ట్ గడువు ముగియనుంది. దీంతో టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి డేటా, మెయింటెనెన్స్ వర్క్ ట్రాన్స్ ఫర్ చేసేందుకు మరో నెల గడువు ఇచ్చింది. ఇందులో భాగంగా టెర్రాసిస్, ఎన్ ఐసీ ప్రతినిధులు కలిసి నెల రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తారు. డిసెంబర్ 1 నుంచి పూర్తిగా ఎన్ఐసీ నిర్వహణలోకి పోర్టల్ వెళ్లనుంది. మూడేండ్ల పాటు ధరణి బాధ్యతలను ఎన్​ఐసీ నిర్వహిస్తుంది. పనితీరు బాగుంటే మూడేండ్ల తర్వాత మరో రెండేండ్ల పాటు పొడిగించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. పోర్టల్​ పేరును కూడా భూమాతగా మార్చనున్నారు.