ధరణి దారుణాలు

టీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్​లను మించిన భారీ కుంభకోణం భూరికార్డుల ప్రక్షాళన సమయంలో జరిగింది. సర్కార్​లో ఉన్న పెద్దలే విలువైన ల్యాండ్ రికార్డులను వివాదాస్పదంగా మార్చడం, ఆ తర్వాత తమ బినామీల ద్వారా అవే భూములను అగ్గువకు కొనుగోలు చేయించడం, లేదా బెదిరింపులతో చెరబట్టడం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ రికార్డులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి భూదందాలకు పాల్పడ్డారు.

ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఈ భూరికార్డుల ప్రక్షాళన ప్రోగ్రామ్ జరిగింది.  మొదటిది 2018 ఎన్నికలకు ముందే ఒక విడత రైతు బంధు వేయడం కోసం రైతులకు కొత్త పాస్ బుక్స్ జారీ చేయడం కాగా, రెండోది హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాగిరి జిల్లాల్లో వివాదాల్లో ఉన్న భూములతోపాటు విలువైన సర్కార్ భూములను గుర్తించడం టార్గెట్​గా పెట్టుకున్నారు. చాలా గ్రామాల్లో గతంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్, నక్సలైట్ల బెదిరింపుల కారణంగా భూములు వదిలేసిన లేదా తక్కువ ధరకు అమ్ముకున్న భూస్వాముల భూములను మళ్లీ రికార్డుల్లోకి తెచ్చారు. 

గత మూడు, నాలుగు దశాబ్దాలుగా కాస్తుదారులుగా ఉంటూ సాగు చేసుకుంటున్న రైతుల నోట్లో మట్టి కొట్టారు. మరికొన్ని చోట్ల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్​గా మార్చేశారు. అన్ని భూసమస్యలకు ధరణి పోర్టలే పరిష్కారమంటూ అప్పటి సీఎం కేసీఆర్ పోర్టల్​ను ప్రారంభించిన రెండో రోజు నుంచే అందులోని లోపాలను, రైతుల ఇబ్బందులను ‘వీ6 వెలుగు’ వెలుగులోకి తెచ్చింది. ధరణి పోర్టల్​లోని సమస్యలు, అది సృష్టించిన భూవివాదాలపై సుమారు రెండేండ్ల పాటు అనేక కథనాలు ఇచ్చాకగానీ రాజకీయ పార్టీలకు ఈ అంశం ఎజెండాగా మారలేదు. 

ధరణి ఫెయిల్యూర్లు

మొదటి అడుగే తప్పటడుగు..

ధరణి పోర్టల్ రూపొందించడానికి ముందు 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమమే లోపభూయిష్ఠంగా, తప్పులతడకగా కొనసాగింది. 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సమగ్ర భూసర్వే చేపట్టలేదు. రికార్డు టు రికార్డు నమోదు చేశారే తప్ప.. ఫీల్డ్​లో ఉన్న భూమి ఎంత..? రికార్డుల్లో ఉన్నదెంత? అనే విషయాన్ని సరిపోల్చుకోలేదు. దీంతో అనేక తప్పులు దొర్లాయి. అలాగే కొందరికి ఒక సర్వే నంబర్​లో భూమి ఉంటే..  వారు మరో సర్వే నంబర్ లో మోకా మీద ఉన్నారు. ఈ విషయం సదరు రైతులకు కూడా తెలియదు. ఇలాంటి సమస్యలన్నింటికీ సమగ్ర భూసర్వేతో పరిష్కారం దొరికేది. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. 

దొరల పేర్ల మీదికి బక్క రైతుల భూములు...

భూమి కోసం తెలంగాణలో జరిగినన్ని పోరాటాలు మన దేశంలో మరెక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ సాయుధ పోరాటల కాలంలో  కమ్యూనిస్టులు,  నక్సలైట్లు పేదలకు పంచిన భూములు కేసీఆర్ ప్రారంభించిన భూరికార్డుల ప్రక్షాళన పుణ్యమా అన్నీ మళ్లీ దొరలు, భూస్వాముల పేర్ల మీదికి వెళ్లాయి. ఏండ్ల తరబడి కాస్తుదారు కాలమ్ లో వచ్చిన బక్క రైతుల పేర్లను తీసేసి.. పట్టాదారులుగా దొరలు, భూస్వాముల పేరిట నమోదు చేశారు. ఇలాంటి తప్పిదాలకు ఎర్రబాడు దొర కుటుంబ సభ్యుల పేరిట నమోదైన భూములే మంచి ఉదాహరణ. 

నిజాం హయాంలో ఎర్రబాడు దొర జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఇందులో వేలాది ఎకరాల భూములను కమ్యూనిస్టులు పేదలకు పంచారు. స్వతంత్ర భారత దేశంలో వచ్చిన కౌలు రక్షిత చట్టం, 1972లో అమల్లోకి వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫలితంగా ఆ కుటుంబానికి చట్టపరంగా ఉండాల్సిన భూములు తప్ప మిగతావన్నీ రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రతాపరెడ్డి వారసులు కూడా వాటిని వదులుకున్నారు. 

కానీ, 2017లో జరిగిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 9 గ్రామాల్లోని 1842 ఎకరాల భూములను ప్రతాపరెడ్డి భార్య సుభద్రమ్మ, ఆయన కుమారులు శ్యాంసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి పేరిట నమోదు చేశారు. ఇందులో ఒక్క శ్యాంసుందర్ రెడ్డి పేరిటే 1533 ఎకరాల భూమి నమోదు కాగా, సుధీర్ రెడ్డి పేరిట 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరిట 135 ఎకరాలు రికార్డుల్లోకి ఎక్కింది. అప్పటి వరకు ఆ భూరికార్డుల్లో కాస్తుదారు కాలమ్ లో వచ్చిన రైతుల పేర్లు ఎగిరిపోయాయి.

 ఆ భూములు తమ చేతుల్లో లేవని, ఎప్పుడో రైతులకు ఇచ్చేశామని ప్రతాపరెడ్డి వారసులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలాగే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మొగల్ పహాడ్ లోనూ చాలా ఏళ్ల క్రితమే చనిపోయిన జమీందార్ రాజా వెంకట మురళీ మనోహర్ రావు పేరిట 697 ఎకరాలు ధరణి పోర్టల్ లో నమోదైంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భూమిని స్థానిక రైతులకు అమ్మేశానని సదరు భూస్వామి 1975లోనే డిక్లరేషన్ ఇచ్చినా, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా రైతుల పేర్లు నమోదు కాలేదు. చాలా గ్రామాల్లో రెండు, మూడు దశాబ్దాల క్రితం తక్కువ ధరకు అమ్ముకుని తెల్లకాగితంపై రాసిచ్చిన కొందరు వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులుగా కొనసాగాయి. దీంతో  మళ్లీ ఆ భూమి తమదేనంటూ తిరగబడ్డారు. దీంతో రైతులు మళ్లీ ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి.. సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. 

పప్పుబెల్లాల్లా ప్రభుత్వ భూముల పంపకం..

భూరికార్డుల ప్రక్షాళనే అదనుగా కొందరు రెవెన్యూ ఆఫీసర్లు ప్రభుత్వ భూములను తమ బినామీలు, బంధువులు, పరిచయస్తుల పేరిట నమోదు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని 669 సర్వే నంబర్ లో 26.08 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో ఇదే జరిగింది.  కరీంనగర్ - గోదావరిఖని హైవేకు కిలో మీటరున్నర దూరంలో తారు రోడ్డుకు రెండు వైపులా ఈ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్​ను ప్రభుత్వం  ఎవరికీ అసైన్ చేయకపోయినా ఇందులోని 22 ఎకరాలను 18 మంది పేరిట నమోదు చేశారు. అందరికీ పట్టాదారు పాస్ బుక్స్ జారీ అయ్యాయి. వారిలో ఇద్దరే స్థానికులు ఉండగా.. మిగతా వారంతా స్థానికేతరులే. ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్న సర్కార్ భూములను రెవెన్యూ ఆఫీసర్లు, బీఆర్ఎస్ లీడర్లు కలిసి చెరబట్టారు. 

రికార్డుల్లో పెరిగిన భూమి 6.50 లక్షల ఎకరాలు.. 

సమగ్ర భూసర్వే చేపట్టకుండా కేవలం పాత రికార్డుల్లోని వివరాలను కంప్యూటర్లలో ఎంట్రీ చేయడం వల్ల అనేక అనర్థాలు జరిగాయి ధరణిలో నమోదైన భూమికి, ఫీల్డ్​లో ఉన్న భూమికి చాలా తేడాలున్నాయి. 1956 నాటి సేత్వార్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ - ఆర్ఎస్ఆర్) రికార్డుతో పోల్చితే గత 60 ఏండ్లలో 
రికార్డుల్లో సుమారు 6.50 లక్షల ఎకరాల భూమి ఎక్కువగా నమోదైంది. దీంతో పాస్​బుక్స్​లో అధికంగా ఉన్న విస్తీర్ణాన్ని సవరించాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది తమకు ఫీల్డ్ లో ఉన్న భూమికి, పాస్ బుక్స్​లో నమోదైన విస్తీర్ణానికి సరిపోలడం లేదంటూ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 

ప్లాటింగ్ అయిన వెంచర్లకు పట్టాదారు పాస్​బుక్స్​

ఉమ్మడి రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలతోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలాంటి నగరాల చుట్టూ మూడు, నాలుగు దశాబ్దాల కిందటి నుంచే నాన్ లేఔట్ వెంచర్లు విరివిగా వెలిశాయి. కనీసం నాలా కన్వర్షన్ కూడా చేసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లుగా అమ్మేశారు. చాలా మంది ప్లాట్ల కొనుగోలుదారులు అవగాహనలోపంతో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి మ్యుటేషన్ చేయించుకోలేదు. దీంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పాత పట్టాదారులకే పాస్ బుక్స్ ఇచ్చారు. దీంతో పాత పట్టాదారులు చాలా చోట్ల మళ్లీ భూములపైకి వచ్చారు. లేదంటే వేరొకరికి గుట్టుగా ధరణిలో రిజిస్ట్రేషన్ చేశారు. ధరణి ద్వారా కొన్న వ్యక్తులు ప్లాట్లను చదును చేసి వ్యవసాయ భూములుగా మార్చేయడంతో ప్లాట్ల ఓనర్లకు, సదరు వ్యక్తులకు గొడవలు తలెత్తాయి. 

కేసీఆర్ భూముల వివరాల్లోనూ ధరణిలో తప్పులే..

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలో 36.1450 ఎకరాలు, ఇదే మండలం శివారు వెంకటాపూర్ లో 10 ఎకరాల భూమి ఉండగా, శోభమ్మ పేరిట 7.1650 ఎకరాల భూమి ఉంది. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం భూమి కలిపితే 53.31 ఎకరాలు అవుతోంది. వాస్తవానికి వారి సేల్ డీడ్స్, పాత రికార్డుల ప్రకారం 53.30 ఎకరాలు మాత్రమే నమోదు కావాల్సి ఉండగా.. పాస్ బుక్, 1బీలో 53.31 ఎకరాలుగా చూపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన అఫిడవిట్​లో నోట్ పెట్టి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం హోదాలో ఉండి కూడా తన పేరిట గుంట భూమి ఎక్కువ నమోదైతే ధరణి పోర్టల్​లో సరి చేయించుకోలేకపోవడం పోర్టల్​లోని డొల్లతనాన్ని వెల్లడిస్తోంది. 

అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం  ఒక కుటుంబం గరిష్టంగా 54 ఎకరాల భూమికి మించి ఉండడానికి వీల్లేదు. కానీ, 2014  వరకు కేసీఆర్ పేరిట ఎర్రవెల్లి విలేజీ పరిధిలో 38.30 ఎకరాలు ఉండగా.. 2014 మే నుంచి 2018 మార్చి 7 వరకు కొనుగోలు చేసిన భూములు కలిపితే 56.295 ఎకరాలకు చేరింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సీలింగ్​కు మించిన 2.29 ఎకరాల భూమిని రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించి స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. కేసీఆర్ కూడా బాధ్యతగా సర్కార్​కు అప్పగించలేదు. 

20 లక్షల ఎకరాలకు పాస్​బుక్కుల్లేవ్​..

రాష్ట్రంలో తెల్ల కాగితంపై రాసుకొని భూములు కొనుగోలు చేసిన రైతులను బీఆర్ఎస్ సర్కార్ అరిగోస పెట్టింది. ఏండ్ల సంది ఎదురుచూసినా సాదాబైనామా దరఖాస్తులను పదేళ్లలో పరిష్కరించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్​లో ఉండగా.. సుమారు 20 లక్షల ఎకరాల భూములకు పట్టాదారు పాస్​బుక్స్​ జారీ కాలేదు. దీంతో పాసుబుక్స్ రాక రైతులు నాలుగేండ్ల నుంచి రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీమ్​లు కోల్పోయారు. కేసీఆర్  ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టమే సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి పెద్ద అడ్డంకిగా మారింది. చట్ట సవరణ చేసి ఈ భూములకు పట్టాలిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 

సర్వే నంబర్లు మిస్సింగ్.. 

ధరణి వెబ్ సైట్​లో చాలా భూముల వివరాలు మాయమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లు కనిపించకుండా పోయాయి. ఉమ్మడి ఏపీలో మా భూమి, వెబ్ ల్యాండ్ పేరుతో ఆన్ లైన్ లో భూరికార్డులు నిర్వహించారు. ఇందులో కనిపించిన లక్షలాది సర్వే నంబర్లు, బై నంబర్లు ధరణి పోర్టల్ వచ్చేసరికి ఎగిరిపోయాయి. కొత్త పాస్ బుక్ లో ఉండి.. ధరణి లో కనిపించకుండా పోయిన సర్వే నంబర్స్ రావడం లేదు. ధరణి పోర్టల్​లో మిస్సింగ్ సర్వే నంబర్లను యాడ్ చేసుకునేందుకు అప్లికేషన్ మాడ్యుల్ తీసుకొచ్చినా.. అందులో మిస్సయిన సర్వే నంబర్లన్నీ చూపడం లేదు.  అలాగే భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సీసీఎల్ఏకు చెందిన ఐఎల్ఆర్ఎంఎస్ పోర్టల్​లో కనిపించిన ఆర్వోఆర్, వన్ బీ, గ్రామనకలు, అమెండ్మెంట్ రిజిస్టర్, పహాణీ, పార్ట్ బీలో చేర్చి పాస్​బుక్స్​ జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లు ధరణి పోర్టల్​లో కనిపించడం లేదు.  

విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి పోర్టల్..

రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్​లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మాన్యువల్​గా ఉన్న రికార్డులన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఐఎల్ఆర్ఎంఎస్) అనే పోర్టల్​లో ఎంట్రీ చేశారు. ఈ పోర్టల్ నిర్వహణను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2018 మేలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ఎఫ్ఎస్) అనే సాఫ్ట్ వేర్ సంస్థకు అప్పగించింది. బ్యాంకులకు సుమారు రూ.99 వేల కోట్ల అప్పులు చెల్లించని కారణంగా ఆ కంపెనీ  నాలుగు నెలల  తర్వాత దివాలా జాబితాలో చేరిపోయింది.

 అగ్రిమెంట్ ప్రకారం.. కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం అలా చేయలేదు. 2021 చివర్లో  టెర్రాసిస్ టెక్నాలజీస్​లోని 52.26 శాతం వాటాను రూ.1,275 కోట్లకు ఫిలిప్పీన్స్ కు చెందిన ఫాల్కన్ గ్రూపునకు అమ్మేసింది. అలా మన భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని తొలిసారిగా 2021 డిసెంబర్​లోనే ‘వీ6 వెలుగు’ వెలుగులోకి తెచ్చింది. 

 ధరణి పోర్టల్​ను నిర్వహించే కంపెనీ వివరాల కోసం ఆర్టీఐ కింద ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా సీసీఎల్ఏ నుంచి రిప్లై రాలేదు. టెర్రాసిస్ కంపెనీ, భూరికార్డుల రక్షణపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశాక 2023 జులైలో తొలిసారిగా టెర్రాసిస్ కంపెనీ బహిరంగ ప్రకటన చేసింది. భూవివరాలు, రైతుల డేటా షేర్ చేసేందుకు తమకు యాక్సెస్ లేదని వివరణ ఇచ్చింది. దీంతో ధరణి పోర్టల్ ఓ ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉందనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది. ఫాల్కన్ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్​ను2021లోనే  గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. 

ప్రొహిబిటెడ్ జాబితాలో మాజీ సైనికుల ల్యాండ్స్..

దేశానికి చేసిన సేవలను గుర్తించి మాజీ సైనికులకు, ఫ్రీడం ఫైటర్స్​కు గత ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములకు టీఆర్ఎస్ సర్కార్ రెడ్ మార్క్ పెట్టింది. వారి భూములన్నింటినీ ధరణిలో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. వాటిని అమ్ముకోకుండా.. వారసులకు ఇచ్చుకోకుండా చేసింది. ప్రభుత్వం మాజీ సైనికులకు, ఫ్రీడం ఫైటర్స్​కు భూమిని అసైన్ చేసిన పదేండ్ల తర్వాత పూర్తి హక్కులు లబ్ధిదారులకే చెందుతాయని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇలాంటి భూములన్నింటిని రెండేళ్ల క్రితమే నిషేధిత జాబితాలో నుంచి తీసేయగా.. టీఆర్ఎస్ సర్కారు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు చెందిన సుమారు 2 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురిచేసింది. ధరణి రాక ముందు ఈ భూములను కొనుగోలు చేసిన రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు.

పట్టాదారు పేరు అడవి, శ్రీ, తెలియదు..

ధరణి పోర్టల్ వచ్చాక భూరికార్డులన్ని  స్ట్రీమ్ లైన్ అయినట్లే కనిపించినా.. చాలా చోట్ల ఇదే ధరణి పోర్టల్ కొత్త వివాదంలోకి నెట్టింది. రికార్డుల ప్రక్షాళనకు పాత రికార్డులు వెరిఫై చేయడంతోపాటు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాల్సిన రెవెన్యూ అధికారులు.. చాలా చోట్ల అలా చేయలేదు. కాస్తులో ఉన్నవారి పేర్లు చేర్చకుండా కొన్ని చోట్ల తమ ఇష్టమొచ్చినట్లు పేర్లు రాస్తూ పోయారు. అడవి, శ్రీ, అన్ నోన్ పర్సన్, మిగులు భూమి, 999, తొలగించాలి, ఇతరులు..  ఇలా రకరకాల పేర్లతో ధరణిలో వేలాది ఎకరాల్లో పట్టాదారుల పేర్లను నమోదు చేశారు. 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో 1827 ఎకరాల పట్టాభూమిని రెవెన్యూ ఆఫీసర్లు  ఫారెస్ట్ భూమిగా చూపించారు. పట్టాదారు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని నమోదు చేశారు. దీంతో మూడేండ్లు ఆ గ్రామ రైతులు చేసిన పోరాటం ఫలితంగా కొందరికి మాత్రమే పాస్ బుక్స్ వచ్చాయి. ఇలాగే మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో వంద సర్వే నంబర్లు/బైనంబర్లలో కలిపి 60.04 ఎకరాల భూమి శ్రీ పేరిట చూపిస్తోంది. ఈ భూమి తమదేనని రైతులు అర్జీలు పెట్టుకున్నా అప్పటి ప్రభుత్వం రికార్డుల్లో మార్పు చేయలేదు.

అక్రమార్కులకు వరంగా రైట్ టూ ప్రైవసీ..

ధరణి పోర్టల్​లో రైట్ టూ ప్రైవసీ అనే మాడ్యుల్ ద్వారా పట్టాదారులు ఎవరైనా తమ భూముల వివరాలను మరొకరు చూడకుండా చేసుకునే వెసులుబాటు ఉంది. అక్రమ సంపాదనతో పదులు, వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేసిన లీడర్లు, ఆఫీసర్లకు ఈ ఆప్షన్ వరంగా మారింది. రైట్ టూ ప్రైవసీ ఆప్షన్ కింద భూములను హైడ్ చేసుకుంటున్నారు.

స్లాట్ క్యాన్సిల్ అయితే కట్టిన డబ్బులు వాపస్ రావట్లే.. 

ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్, నాలా కన్వర్షన్ తదితర లావాదేవీల కోసం డబ్బులు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని ఏదైనా కారణంతో క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బులు వాపస్ రావట్లేదు. అత్యాధునిక సాఫ్ట్​వేర్​తో రూపొందించిన ధరణి పోర్టల్​లో డబ్బులు వాపస్ వసూలు చేయడం తప్ప.. వాపస్ చేసే టెక్నాలజీ లేదు. దీంతో 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు స్లాట్స్ క్యాన్సిల్ అయినవారి సొమ్ము సుమారు రూ.600 కోట్లు సర్కార్ ఖజానాలో మూలుగుతున్నాయి. 

డాక్టర్ ఎన్. యాకయ్య, 
సీనియర్ రిపోర్టర్ 
వీ6 వెలుగు

  • Beta
Beta feature
  • Beta
Beta feature