ధనుర్మాస ఉత్సవం : ఆరో రోజు పాశురం.. గోపికను నిద్ర లేపటానికి వెళ్లిన వాళ్లకు..!

ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు.  ఇక 6  నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ  జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తిరుప్పావై ఆరవ పాశురంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. . .

విష్ణుమూర్తికి ప్రీతికరమైన ధనుర్మాసంలో భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం 'తిరుప్పావై'ని చదవడం ఆనవాయితీ. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ఇవ్వాళ  ( December 21) ఆరవ రోజు చదువుకోవాల్సిన పాశురం..


పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ రెమ్బావాయ్!!

భావం : అప్పటికే నిద్రను తరిమికొట్టి ఉదయాన్నే మేల్కొన్నవాళ్లంతా, ఇంకా ఆదమరిచి నిద్రపోతున్న ఒక గోపికను కదిలించడానికి వెళ్లారు. 'తెల్లారిందమ్మా! ఇంక నిద్ర లేవమ్మా!' అని ఆమెను తట్టి లేపారు. వీళ్లందరికంటే ముందే మేల్కొన్న పక్షులన్నీ ఎగురుకుంటూ చుట్టుపక్కల తిరుగుతున్నాయి. కొన్ని తినడానికి గింజలు తెచ్చుకుంటున్నాయి. 'ఆరే! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మోగిన శంఖధ్వనిని నీవు వినలేదా? 

ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము ఎరుగనిదానా!) లేచి రావమ్మా! విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్లూడేలా తన కాళ్లతో తన్నినవాడైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగాయోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలగకుండా, మెల్లిగా, 'హరీ! హరీ!' అని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవు మాత్రం కదలకుండా అలాగే పడుకున్నావేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రా.. రా.. వచ్చి మాతో వ్రతము చేద్దువు'

పక్షుల కిలకిలారావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు, ఆలమందల మెడలోని చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం, మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది.

గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీ అనుభావాన్ని  మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూవులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి.  ఈవ్రతమున ప్రధానముగా పొందవలసిన ఫలము భాగవత్సమాగమము. భగవత్సమాగమము అనెడి ఫలమును సాధించుటకు సాధనము కూడా ఆ సర్వేశ్వరుడే ! ఈవ్రతము ఆచరించుటకు భగవత్సమాగమము పొందవలెనన్న కోరిక కలవారు అందరు అర్హులే. అని మొదటిరోజున అందరకు తెలియచేసిరి. సర్వేశ్వరుడే ఉపాయము, ఫలము అని నమ్మి భగవత్ప్రాప్తినే కాంక్షించు వారైనను ఇంద్రియములు వ్యాపారరహితముగా ఉండవు కనుక కాలక్షేపమునకు పరిపూర్ణమగు అనురాగముతో ఈవ్రత సమయమున చేయదగిన కృత్యములు ఇట్టివి అని వివరించుట జరిగింది. ఈవ్రతమునకు పదిరోజుల ముందుగ ... పదిమంది గోపికలను మేల్కొలిపి, వారితో కలిసి వ్రతమునకు సాగుదురు.  

-వెలుగు, లైఫ్-